రాజధాని తరలింపు క్యాన్సిల్?

కొద్ది రోజుల క్రితం అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత, విజయవాడ కేంద్రంగా రాజధాని ఏర్పాటుచేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముందు తెగ హడావుడి జరిగింది. రాజధానిపై రోజుకో వదంతి షికారు చేసింది. రోజుకో…

కొద్ది రోజుల క్రితం అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత, విజయవాడ కేంద్రంగా రాజధాని ఏర్పాటుచేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముందు తెగ హడావుడి జరిగింది. రాజధానిపై రోజుకో వదంతి షికారు చేసింది. రోజుకో ఊరు పేరు, వారానికో ప్రాంతానికో పేరు హల్ చల్ చేసింది. దానికి తోడు చంద్రబాబు, సుజన, నారాయణ ఇలా అందరూ తలా మాట మాట్లాడుతూ వచ్చారు. పైగా కమిటీలపై కమిటీలు వేసుకుంటూ పోయారు. ఇలాంటి సమయంలో ఒక పక్క కేంద్ర కమిటీ నివేదిక వస్తుందనగానే తాత్కాలిక రాజధాని అన్న అస్త్రాన్ని బాబు బయటకు తీసారు. దానిపై అన్ని పక్షాలు బుస్సు మన్నాయి. ఇంతలో కమిటీ నివేదిక వచ్చింది. కేంద్రం ఇంకా ఏమీ అనకుండానే బాబు తీర్మానం చేయించేసారు. కేంద్రం ఉద్దేశ పూర్వకంగానే కమిటీని, అది ఇచ్చిన నివేదికను, తదనంతర చర్యలను మరిచిపోయింది. 

మరోపక్క రాజధాని వదంతులతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు తమ చిత్తానికి పెరిగిపోయాయి. పెద్దలు ఎవరికి వారు భూములు కొనుక్కుని అవకాశాల కోసం చూస్తున్నారు. పైగా మా తాతలిచ్చిన ఆస్తితో కొన్నానని ఒకరు, బల్క్ కా కొనలేదని ఇంకొకరు చెబుతున్నారు తప్ప కోనలేదని మాత్రం అనడం లేదు. 

ఇలాంటి నేపథ్యంలో తీర్మానం జరిగిపోయింది. ఇక తరలింపు ప్రారంభమవుతుంది అనుకున్నారు. కానీ రాజధాని నిర్ణయం అయిపోయే వరకు జరిగన హడావుడి ఒక్కసారి చప్పున చల్లారిపోయింది. సరైన వసతులు లేకుండా తరలిస్తే చూస్తూ ఊరుకోం అని ఎన్జీవోల నాయకుడు పరుచూరి అశోక్ బాబు హెచ్చరించారు. బాబు కూడా విజయవాడలో అలా అలా తిరిగి వచ్చారు. మేథా టవర్స్ పరిశీంచారు కానీ, తరలింపుపై పెదవి విప్పలేదు. 

అంతా అయిపోయాక, బాబు ఇప్పుడు హైదరాబాద్ లోని తన అత్యాథునిక చాంబర్ లో కొలువు తీరారు. అంత అత్యాధునికంగా తయారుచేసారు అంటే కొన్నాళ్లు వాడడానికే కదా. సరే అది అలా వుంచితే. తన కార్యకలాపాలకు తన ఇల్లు సరిపోడవం లేదని, పడగొట్టి కొత్తది కట్టాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం బాబు కుటుంబం కొన్నాళ్లు ఫార్మ్ హౌవుస్ కో గెస్ట్ హవుస్ కో మారుతోందట. అంతే కానీ విజయవాడకు కాదు. అంటే బాబు పాలన హైదరాబాద్ నుంచే, కుటుంబం కూడా హైదరాబాద్ లోనే. పార్టీ కెంద్ర కార్యాలయం హైదరాబాద్ లోనే. హెరిటేజ్ కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే అన్నది ఇక్కడ అప్రస్తుత మైనా చెప్పక తప్పదు. పైగా బాబు ఇల్లు కట్టడం ఇప్పుడు ప్రారంభించినా కనీసం ఏడాది పడుతుంది ఎంత చకచకా పనులు పూర్తి చేసినా. ఇన్ని పనులు ఇక్కడ పెట్టకుని, బాబు రాజధానిని ఇప్పట్లో విజయవాడకు తీసుకెళ్తారంటే అనుమానమే. 

కావాల్సింది జరిగిపోయింది. విజయవాడ రాజధాని అన్నది డిసైడ్ అయిపోయింది. ఈ విషయమై పేచీలు లేకుండా అంతా సజావుగా జరిగిపోయింది. రాయలసీమ నుంచి చిటికెడు ప్రతిఘటన కూడా లేకపోయింది. అందువల్ల ఇక వచ్చిన సమస్య ఏమీ లేదు. ఇవాళ కాకుంటే రేపు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ లోగా రియల్ ఎస్టేట్ ధరలు అలా అలా పెరిగాల్సి వుంది. ఇప్పుడే పుటుక్కున రాజధాని అంటే ఇప్పుడున్న దరలు ఫిక్సయిపోతాయి. అదే కనుక, అలా అలా ఊరిస్తూ వస్తే, మెలమెల్లగా ధరలు పెరుగుతూ పోతాయి. మరో రెండు మూడేళ్ల తరువాత రాజధాని వచ్చేసరికి అంతకు అంతా పెరుగుతాయి. అదే కదా భూములు కొట్టిన బడా బాబులకు కావాల్సింది. 

పైగా భూ సేకరణ అన్నది హడావుడిగా జరిగేది కాదు. ఇప్పుడు లేఅవుట్ లకు ముకుతాడు వేసారు. కొనుగోళ్లు మందగిస్తాయి. రేట్లు నోటిమాటల్లోనే పెరగడం ప్రారంభమవుతుంది. ఆగలేని వారు, అవసరం వున్నవారు అమ్ముకోక తప్పదు. అంటే డబ్బున్న మా రాజులకు భూ సేకరణకు కావాల్సినంత అవకాశం. పైగా భూములు బలవంతంగా సేకరిస్తామన్న బెదిరింపు. ఫీలర్. దీంతో అదేదో రేటు వున్నపుడు అమ్మేసుకుంటే, ప్రభుత్వంతొ తలనొప్పి వుండదు అనుకునే వాళ్లు కూడా వుంటారు. ఇది కూడా భూ వ్యాపారులకు వరమే. 

రాజధానిని నిర్ణయించి వదిలేసి, తమ పని తాము హైదరాబాద్ నుంచి చక్కబెట్టుకోవాలని సైలెంట్ గా డిసైడ్ అయిపోవడంతో, వచ్చే సైడ్ ఎఫెక్ట్ లు ఇవన్నీ. మరి హైదరాబాద్ ను ఇప్పట్లో వదలకూడదని అనుకున్నపుడు రాజధానిపై అంత ఆత్రం ఎందుకు ప్రదర్శించారని ఎవరూ అడగా కూడదు. జవాబు ఆశించా కూడదు. రాజధాని అంటే రోజులోనో నెలలోనో అయ్యేది కాదు, ఇప్పటి నుంచి ప్రారంభించకుంటే ఏలా ఎవరైనా అడగొచ్చు. అదీ నిజమే. కానీ ఇక్కడ రాజధాని నిర్ణయానికి మాత్రమే తొందర పడలేదు. రాత్రికి రాత్రి తరలించేస్తామన్నంత బిల్డప్ ఇచ్చారు. 

కొందరు కీలక అధికారులను అక్కడకు మారుస్తున్నారని ఓ సారి, మేథ టవర్స్ ను సెక్రటేరియట్ గా మారుస్తున్నారని మరోసారి ఇలా ఫీలర్లపై ఫీలర్లు వదులుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి నిమ్మకు నీరెత్తినట్లు వుండిపోయారు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పుంజుకోవడానికి ఎంత చేయాలో అంతా చేసారు. ఇప్పుడు ఇక సైలెంట్ అయ్యారు. ఇప్పుడు రకరకాల డోలాయమాన పరిస్థితులు ఏర్పడతాయి. చిన్నవాళ్లు అమ్ముకోవాలో, మానాలో తెలియక కిందా మీదా అవుతారు. ప్రభుత్వం లాక్కుంటుందేమో అని భయపడతారు. ఇప్పట్లో రాజధాని రాదు కనుక, ఇంక ఇంతకన్నా రేటు రాదేమో అనుకుంటారు. ఇలా రకరకాలుగా వుంటుంది పరిస్థితి. దీన్నంతా క్యాష్ చేసుకుంటారు భూ వ్యాపారులు. మళ్లీ ఎన్నికల వరకు బాబు హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తారు. ఎందుకంటే హైదరాబాద్ అంత కీలకం. దాన్ని వదిలి అంత సులువుగా కదలలేరు. అది వాస్తవం.

చాణక్య

[email protected]