‘విడాకుల’ మధ్య వికసిస్తున్న ‘మహా’ ‘కమలం’!

పెళ్ళికి ముందే విడాకులా? మహారాష్ర్ట రాజకీయాలు చూస్తే, అలాగే అనిపిస్తుంది. ఎన్నికలకు ముందే పొత్తులు రద్దు చేసుకున్నాయి రెండు ప్రధాన కూటములు. ఒకటి ఎన్డీయే కూటమి; రెండు యూపీయే కూటమి. చూడబోతే ఒకరిని చూసి…

పెళ్ళికి ముందే విడాకులా? మహారాష్ర్ట రాజకీయాలు చూస్తే, అలాగే అనిపిస్తుంది. ఎన్నికలకు ముందే పొత్తులు రద్దు చేసుకున్నాయి రెండు ప్రధాన కూటములు. ఒకటి ఎన్డీయే కూటమి; రెండు యూపీయే కూటమి. చూడబోతే ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొంది, విడాకులకు పరుగెత్తారు. ఎన్డీయేలో బీజేపీతో పెనవేసుకున్న సంబంధం శివసేనకు వుంది. ‘హిందూత్వమే’ బీజేపీ సిధ్ధాంతమనుకుంటే, అదే సిధ్ధాంతం కలిగిన పార్టీ యావద్భారతంలో ఒక్కటే వుంది. అది శివసేన. అందుకే ఈ రెండు పార్టీలూ దాదాపు ‘రెండున్నర దశాబ్దాల’ పాటు కలిసి కాపురం చేశాయి. చిరుకలహాలు వస్తున్నా, సర్దుకు పోయాయి.

శివసేన వ్యవస్థాపకుడు బాల థాకరే అటువైపు వున్నంత కాలం, బీజేపీ అగ్ర నేతలు అద్వానీ, వాజ్‌పేయీలు ఇటువైపు వుండి, ఈ కాపురాన్ని చెడకుండా కాపాడుకుంటూ వచ్చారు. బాల థాకరే వుండగానే, శివసేననుంచి విడిపోయి, మహారాష్ర్ణ నవ నిర్మాణ సమితి(ఎం.ఎన్.ఎస్) స్థాపించి, శివసేనకు సవాలు నిలిచారు. ఈ లోగా థాకరే అస్తమయం కావటంతో థాకరే తనయుడు ఉద్ధవ్ థాకరే శివసేన పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత కూడా గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు శివసేనతో స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అంతెందుకు? ఈ ఏడాదే (2014) లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా, బీజేపీ, శివసేనలు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నాయి. మొత్తం 4 సీట్లలో 41 సీట్లను రెండూ కలసి కైవసం చేసుకున్నాయి. అయితే ఈ ఘనవిజం తోనే పేచీ మొదలయ్యింది. శివసేన వల్లనే బీజేపీ గెలిచిందనీ, మోడీ గాలి వల్లనే శివసేన గెలిచిందని రెండు పార్టీల నేతలూ వాదులాడు కున్నారు. దానికి తోడుగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. మోడీ కి ఎదురు గాలి బీహార్, కర్ణాటకలో మొదలయ్యి, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లకు కూడా పాకిపోయింది. దాంతో ఉధ్ధవ్ అనేక సాకుల్లో ఈ ‘నెపాన్ని’ కూడా , ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు కు సంబంధించి వాడారు. సీట్ల సంఖ్య దగ్గరా, ముఖ్యమంత్రి అభ్యర్తిత్వం దగ్గరా బీజేపీ, శివసేనల మధ్యా  ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వాన్ని వదలుకోవటానికి, శివసేన ఎంత మాత్రమూ సిధ్ధంగా లేదు. బీజేపీ కూడా తన బెట్టు అది వీడ లేదు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి వెళ్ళినా, గెలవటమూ, సొంత బలంతో ప్రభుత్వాన్ని స్థాపించటమూ ఖాయమనే నిర్థారణకు బీజేపీకి వచ్చేసింది. దాంతో ‘తెగతెంపుల’కే సిధ్ధమయ్యింది. 

ఇక అధికారంలో వున్న కాంగ్రెస్ ఎన్సీపీలు(యూపీయే కూటమికిచెందిన పక్షాలు), ఇదే పార్లమెంటు ఎన్నికలలో చతికిల పడ్డాయి. అయితే ఇదే ఎన్డీయే ప్రభంజనం  ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వీయదన్న చిన్న భరోసా ఎక్కడో, రెండు పార్టీలకీ ఏర్పడింది. ఇక్కడా ఇదే పేచీ. అయితే పొత్తు నుంచి వేరుపడటానికి కాంగ్రెస్ కన్నా, ఎన్సీపీయే ఎక్కువ ఉత్సాహం చూపించింది. అధినేత శరద్ పవార్ ఎక్కువ సీట్లకు పట్టుపట్టారు. ఎలాగయినా కాంగ్రెస్‌ను వదలించుకోవాలనే ఆయనలోని కాంక్ష ఈ ‘తెగతెంపుల’ సందర్భంగా బలంగా బయిట పడింది. ప్రజల్లో  ప్రభుత్వం పట్ల వుండే విముఖతను( యాంటీ ఇన్‌కంబెన్సీని) కాంగ్రెస్ ఖాతాలో వేసి, ఎన్సీపీని కాపాడు కోవాలన్నది పవార్ వ్యూహం. ఎందుకంటే ‘ఆదర్శ్’ కుంభకోణం లాంటి అనేక అవినీతి ఆరోపణలు, అధికారంలో వున్న కాంగ్రెస్ ఎన్సీపీ సర్కారు ఎదుర్కొంటోంది. ఈ మురికిని  కాంగ్రెస్‌కే పులిమేసి,  తాను ‘మిస్టర్ క్లీన్’ లో బయిట పడి,  తన పార్టీని స్వతంత్రంగా బరిలో నిలపాలన్నది ‘పవర్ గేమ్ ప్లాన్’. అయితే ఇలా సొంతంగా పోటీ చేసి, ఏకంగా ప్రభుత్వాన్ని స్థాపించే మెజారిటీ సాధించగలననే నమ్మకం మాత్రం ఎన్సీపీ నాయకత్వంలో వుండి వుండక పోవచ్చు. కాకుంటే ఫలితాల తర్వాత , ఇటు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా, అటు బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా,  పంచ ముఖ పోటీ వల్ల ( ఎం.ఎన్.ఎస్‌తో కలుపుకుని అయిదు పార్టీలు బరిలో వుంటాయి.) ప్రభుత్వం స్థాపించగల మెజారిటీ  రాక పోవచ్చు. అప్పుడు, మద్దతు ఇవ్వటానికి వీలుగా ఎన్సీపీ వుండాలంటే ఎన్సీపీని సమదూరంగా వుంచాలి. అంటే కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవాలి. ఇదే పవార్ వ్యూహమని ముందుగా పసిగట్టి వ్యాఖ్యానించిన నేత ఎం.ఎన్.ఎస్ అధినేత రాజథాకరే. అయితే ఆయన వ్యాఖ్యానం బాగా దూరం వెళ్ళిపోయింది: పవార్ బీజేపీతో కుమ్మక్కయ్యే కాంగ్రెస్‌తో తెగ తెంపులు చేసేసుకున్నాడని అనేశారు. 

‘మోడీ గాలి’ వుందా? లేదా? అన్నది ప్రశ్న కాదు. పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత యుపీలో సమాజ్ వాదీ పార్టీ కోలుకున్నట్లూ, బీహార్‌లో జెడి(యూ) కోలుకున్నట్లూ, మహారాష్ర్టలో ఇటు కాంగ్రెస్ కానీ, అటు ఎన్సీపీ కానీ కోలుకోలేదు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ముందు బీజేపీకీ, తర్వాత శివసేనకూ వరమవుతుంది. ఇప్పుడిప్పడే బయిటకు వస్తున్న  కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. 2  స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 150 నుంచి 16ం వరకూ గెలచుకునే అవకాశం వుందనీ, సుదూరమైన రెండవ స్థానంలో శివసేన వుంటుందనీ అంచనాలు వేస్తున్నారు. తర్వాత స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎం.ఎన్.ఎస్ వుండే అవకాశం వుందంటున్నారు. 

బీజేపీ ని నిలువరించగల ‘కుల సమీకరణలు’ ఏవీ అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీలకు అనుకూలం లేవు. శివసేనకు స్థాన బలం వున్నా, అది ‘జూనియర్ పార్టనర్’ గానే వుండిపోయింది. కాబట్టి దాని బలం బీజేపీని మింగేసటంతగా వుండక పోవచ్చు. ఎలా చూసినా, ఈ ‘విడాకుల’ పర్వం బీజేపీకే లాభించేటట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ శివసేన అనూహ్యంగా బీజేపీని నిలువరించగలిగితే అప్పుడు ‘సంకీర్ణాని’కి తావుంటుంది. అలాంటప్పుడు మాత్రమే, ‘పవార్’ ఆశలు ఒక మేరకయినా నెరవేరతాయి.

సతీష్ చందర్