ఎమ్బీయస్‌ :రాజధాని ఎప్పటికి తయారయ్యేను?

ఆంధ్ర రాజధాని గురించి క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు కానీ నాకైతే అయోమయంగా వుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని బాబు స్పష్టం చేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలోని వూళ్లల్లో పెడతారని వార్తలు వస్తున్నాయి.…

ఆంధ్ర రాజధాని గురించి క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు కానీ నాకైతే అయోమయంగా వుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని బాబు స్పష్టం చేశారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలోని వూళ్లల్లో పెడతారని వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోవే అయినా విజయవాడకు దగ్గరే కదా అనవచ్చనుకోండి. విజయవాడ పరిసరాల్లో భూమి ఎక్కడుంది? అని ప్రశ్నించినపుడు 'కృష్ణా జిల్లాలోనే నూజివీడు వద్ద దేవాలయ భూములున్నాయి, ప్రభుత్వ భూములున్నాయి' అని జవాబిచ్చారు. దేవాలయభూములంటే హిందూ భక్తులు దేవుడి కోసం యిచ్చినవి. అవి అన్యాక్రాంతం అయినపుడే బాధపడతాం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఆక్రమించుకున్న దేవాలయ భూముల్ని, వక్ఫ్‌ భూముల్ని (చర్చి భూముల గురించి ఎవరూ మాట్లాడరు? అవేవీ లేవా? అన్యాక్రాంతం కాలేదా?) స్వాధీనం చేసుకుంటాం అని ప్రకటనలు చేస్తారు. ఎవరినీ తరిమివేసినట్లు గానీ, పొలాలు కౌలుకి తీసుకున్న వారి దగ్గర్నుంచి న్యాయబద్ధమైన అయివేజు తీసుకున్నట్లు కానీ ఎన్నడూ చదవలేదు. కొత్త ప్రభుత్వం రాగానే మళ్లీ యీ పాత ప్రకటనే వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వమే దేవాలయ భూముల్ని తీసేసుకుంటుందంటే అయ్యో అనిపించింది. రాజధాని నిర్మాణం అంటూ విరాళాలు పోగేస్తూన్నారు కదా, మళ్లీ దేవుడి భూములపై కన్నేయాలా? 

రాజధాని బట్టి జనమా? జనం బట్టి రాజధానా?

ఇప్పుడు గుంటూరు జిల్లాలో అమరావతి, వైకుంఠపురం.. అంటూ ఏవేవో చెపుతున్నారు. అక్కడ దేవుడి మాన్యాలో, అడవులో, ఏమి ఎగురుతాయో తెలియదు. ఏం చెప్పినా, ఎలా చెప్పినా కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూమిలభ్యత లేదని శివరామకృష్ణన్‌ కమిటీయే చెప్పింది. దొనకొండలో బోల్డంత ప్రభుత్వ భూమి వుంది కదా, చవకలో అయిపోతుంది, అక్కడ కట్టేయండి అని వచ్చిన సలహాలు బాబు కొట్టి పారేశారు. అక్కడ జనసమ్మర్దం లేదట. రాజధాని పెడితే ఎవరూ వెళ్లరట. ఇలా అన్న నెల్లాళ్లు తిరక్కుండా ప్రకాశం జిల్లాకు వచ్చి దొనకొండకు కోస్టల్‌ కారిడార్‌ వస్తుంది, యిండస్ట్రియల్‌ బెల్టు వస్తుంది చూసుకోండి యిక్కడ నందనవనమే అని ఆయనే ప్రకటన చేశారు. అన్ని వచ్చినపుడు జనాలు రారా? జనాలు వచ్చినపుడు రాజధానికి లోటేమిటి? ఏమిటో, ఒక మాటకు మరో మాటకు పొంతన వుండదు.

హైదరాబాదు శివార్లలో వ్యవసాయం నాశనం

కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడ రాజధాని పెట్టిన వ్యవసాయం దెబ్బ తింటుందని అందరూ హెచ్చరిస్తున్నారు. నేనూ అదే నమ్ముతున్నాను. గతంలో హైదరాబాదులో ఎటు చూసినా పచ్చదనం వుండేది. కూరగాయలు చౌకగా, ధారాళంగా దొరికాయి. 20 ఏళ్లగా రియల్‌ ఎస్టేటుపై మోజు పెరిగాక, హైదరాబాదు శివార్లలో వ్యవసాయం మానేశారు. కూరలు పండించటం లేదు. భూములన్నీ ప్లాట్లుగా చేసి, ఆ వెంచర్‌ యీ వెంచర్‌ అంటూ జెండాలు పాతేసి ఏమీ చేయకుండా వదిలేశారు. అక్కడ ఏమీ పండించటం లేదు. అలా అని యిళ్లూ కట్టరు. ఈ స్థలాలన్నిటిలో యిళ్లు కట్టాలంటే ప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం సిమెంట్‌ తెచ్చినా సరిపోదు. పక్కవాడు యిల్లు కడితే మన స్థలానికి రేటు పెరుగుతుంది, అప్పుడు అమ్ముకోవచ్చు అని ఆశతో అందరూ డాక్యుమెంట్లు చూసుకుని మురుసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి, పాడిపరిశ్రమ మొత్తం మూలపడింది. శివారు ప్రాంతాలన్నీ అయిపోయాక పక్క జిల్లాలపై పడ్డారు. హైదరాబాదుకు 50 కి.మీ. వ్యాసార్థంలో ఎక్కడా ఏదీ పండించటం లేదంటే అతిశయోక్తి కాదు. 

పండడానికి భూమి సిద్ధపడినా, పండించే నాథుడెవడు? ఇక్కడి రైతులు యిరవై యేళ్లగా పంచెలు వదిలేసి, జీన్స్‌లోకి దిగిపోయారు. రియల్‌ ఎస్టేటు కంపెనీలకు భూమి అప్పగించగా వచ్చిన ఎడ్వాన్సు డబ్బుతో జీవనసరళి మార్చేసుకున్నారు. వాళ్ల పిల్లలు కూడా ఐటీ వంటి వేరే వృత్తులకు వెళ్లిపోయారు. ఇప్పుడు రియల్‌ ఎస్టేటు డల్లవడంతో వీళ్లు డీలా పడ్డారు. ఎడ్వాన్సు యిచ్చిన బుక్‌ చేసుకున్న భూములను పాత రేట్లకే రిజిస్టర్‌ చేసుకోమని రియల్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ రేటుతో యిప్పుడు కొంటే కిట్టుబాటు కాదని, ప్లాట్లు వేసినా, ఫ్లాట్లు కట్టినా అమ్ముడు పోవని రియల్టర్ల భయం. అడ్వాన్సు తిరిగి యిచ్చేసి డాక్యుమెంట్లు పట్టుకుపొమ్మని వారంటారు. 'ఇంకా ఎక్కడి అడ్వాన్సు? ఎప్పుడో తినేశాం. మీరు భూమి తీసుకోవాల్సిందే' అంటూ రైతుల గోల. మళ్లీ వ్యవసాయం చేయాలంటే అలవాటు తప్పిపోయింది. వారి భవిష్యత్తు అగమ్యంగా తయారైంది. 
అక్కడా అదే జరుగుతుంది

ఈ హైదరాబాదు కథే రేపు కృష్ణా, గుంటూరు జిల్లాలలో పునరావృతం కాబోతోంది. ఇప్పటికే ప్లాట్లు చేసి ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల వాళ్లూ కొనేస్తున్నారు. డబ్బు విషయంలో ప్రాంతీయభేదాలు వుండవు. పెట్టుబడికి ఎక్కువ రాబడి ఎక్కడ వస్తే అక్కడ పెట్టేస్తారు. హైదరాబాదు మొహం కూడా చూడకుండా అక్కడ ప్లాట్లు కొన్నవాళ్లెందరో వున్నారు. రాజధాని వస్తుందనుకుంటున్న జిల్లాల్లో భూముల ధరలు ఆకాశానికి అంటడంతో రిజిస్ట్రేషన్లు స్తంభింపచేశారు. హైదరాబాదులోనూ యిలాటి సందర్భాలున్నాయి – వేర్వేరు కారణాల చేత. అప్పుడు కూడా క్రయవిక్రయాలు ఆగలేదు. పవరాఫ్‌ ఎటార్నీతో అమ్మకాలు, అనామత్తు అగ్రిమెంట్లు జరిగాయి. ఇప్పుడు అక్కడా అవే జరుగుతూ వుంటాయి. ఇది అనేక లిటిగేషన్లకు దారి తీస్తుంది. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోయినపుడు అనేక పనులు కోర్టు దస్తావేజుల్లో యిరుక్కుపోతాయి. తెలుగుతల్లి ఫ్లయిఓవర్‌, హఫీజ్‌పేట ఫ్లయిఓవర్‌.. యిలా ఎన్నో నిర్మాణాల విషయంలో అడ్డంకులు వచ్చి జాప్యం అయింది. ఇప్పుడు మెట్రో విషయంలో కూడా కొన్ని రూట్లలో అదే జరుగుతోంది. 

అమ్మకాలో, అగ్రిమెంట్లో జరిగి పుష్కలంగా డబ్బు చేతికి అందితే ఎవరైనా పని చేస్తారా? వ్యవసాయం అంటేనే రిస్కుతో కూడుకున్నది. ఆర్థిక అవసరమే ఆ రిస్కు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఆ అవసరమే లేనపుడు వ్యవసాయం జోలికి ఎవరు పోతారు? కోస్తా జిల్లాల్లో వ్యవసాయం మూలపడితే తిండిగింజలకు లోటు రాదా? అక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌ పెడతామంటున్నారు. అసలు ఫుడ్డే ప్రొడ్యూస్‌ చేయనప్పుడు యిక ప్రాసెసింగ్‌ ఏం జరుగుతుంది? రాజధాని కడతామంటున్న లక్షో, అరలక్షో ఎకరాలలో వ్యవసాయం మానేస్తేనే యింత అనర్థం వస్తుందని ఎలా అంటారు? అని ఎవరైనా అమాయకంగా అడగవచ్చు. ఆ లక్ష ఎకరాలను చుట్టుముట్టి వున్న లక్షలాది ఎకరాలలో కూడా పొలాలు రియల్‌ ఎస్టేటు వెంచర్లగా మారిపోయి భూమి నిరుపయోగం అయిపోతుందని హైదరాబాదు చెపుతున్న అనుభవసారం. 

భూములమ్ముకున్న రైతులు ఏం చేయబోతారు?

ఈ హెచ్చరికలను టిడిపి నాయకులు పట్టించుకోవటం లేదు. 'నష్టపరిహారం కింద మేం యిచ్చే డబ్బుతో/కన్వర్షన్‌తో రైతులు వేరే చోట మరింత ఎక్కువ భూమిని కొని వ్యవసాయం చేస్తారు' అని వాదిస్తున్నారు. ఏ పని చేయాలన్నా డబ్బే మోటివేటింగ్‌ ఫ్యాక్టర్‌ (చోదకశక్తి). హైదరాబాదు పరిసరాల్లో రైతుల సంగతులు గమనించాం. ఈ మధ్యే హాస్యనటుడు వేణుమాధవ్‌ ఒక పరిశీలన చేశారు – 'రియల్‌ ఎస్టేటు బూమ్‌ వున్నంతకాలం దానిలో వచ్చిన డబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టేవారు. ఇప్పుడు బూమ్‌ తగ్గింది, సినిమాలూ తగ్గాయి' అని. కష్టపడకుండా వచ్చిన డబ్బును రిస్కు వున్న వ్యాపారాల్లో పెట్టడం సహజంగా జరుగుతూ వుంటుంది. వ్యాపారాలు మరిగిన తర్వాత పొలంలోని బురదలో దిగబుద్ధి కాదు. అబ్బే కోస్తా వారి తత్వం వేరు, వ్యవసాయం చేసి తీరతారు అనుకుంటే ఎక్కడ చేస్తారు? ఆంధ్ర మొత్తంలో ఎక్కడ చూసినా భూమి (సంస్కృతంలో భూమికి మరో పేరు 'ధరా') ధర మండిపోతోంది. అందువలన అక్కడ కొనలేరు. 

కొంటే తెలంగాణలో కొనాలి, లేదా కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లి కొని అక్కడ వ్యవసాయం చేయాలి. అక్కడ పంటలు పండితే యీ జిల్లాలలో పచ్చదనం ఎలా వస్తుంది? వ్యవసాయంపై ఆధారపడిన ఆంధ్ర ఆర్థికస్థితి ఎలా బాగుపడుతుంది? అసలు రైతులు భూములిస్తారా అని కూడా అంటున్నారు. రాజధానిగా ఓ మూడు, నాలుగు గ్రామాలను కలిపి సెలక్టు చేస్తే కొంతమంది యిస్తామని, మరి కొందరు యివ్వమని అంటే యివ్వనన్న వాళ్లపై బలప్రయోగం చేస్తారా? సెజ్‌ల విషయంలో యిలా చేసే గత ప్రభుత్వాలు చెడ్డపేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు యిలా చేసి ప్రతిపక్షాలకు ఆయుధాన్ని అందిస్తారా? 'అబ్బే, రైతులను మెప్పించేట్లా లాండ్‌ పూలింగ్‌ చేస్తాం' అంటున్నారు. ఈ పూలింగ్‌ను కొన్నాళ్లు పోయాక ఫూలింగ్‌గా వ్యవహరిస్తారా అన్న అనుమానం కూడా వస్తోంది. ఎందుకంటే రుణమాఫీ అంటూ వచ్చిన టిడిపివారు యిప్పుడు అలా అనవద్దు రుణ విముక్తి అనమంటున్నారు. ఇంకా నయం, రైతు మోక్షం అనలేదు. 

రూపాంతరం చెందుతున్న ఋణమాఫీ హామీ

ఎన్నికల ముందు టిడిపి వాగ్దానాలు, దానికి అనుకూల మీడియా మద్దతుగా రాసిన వ్యాసాలు చదివితే యిప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియకుండా వుంది. విజన్‌ వున్న నాయకుడు బాబు, నిపుణుల కమిటీ వేసి, లెక్కాడొక్కా వేసి చూసుకుని, అమలు కాగల హామీయే యిచ్చారంటూ మీడియా ఆకాశానికి ఎత్తేసింది. సందేహాలు లేవనెత్తిన ఎన్నికల కమిషన్‌కు కూడా టిడిపి అదే విధంగా లేఖ రాసింది. ఆ మేధావుల్లో కొందరు టీవీ చర్చల్లో పాల్గొని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పుడు వాళ్లు 'సమైక్య రాష్ట్రంలో వుండగా యిచ్చిన హామీ యిది' అని బుకాయిస్తున్నారు. విభజన బిల్లు పాసయిన తర్వాతనే ఎన్నికలు జరిగాయి, టిడిపి మ్యానిఫెస్టో తయారయింది. అప్పట్లో రిజర్వ్‌ బ్యాంకును ఒప్పిస్తాం, బ్యాంకులపై ఒత్తిడి తెస్తాం, కేంద్రం మెడలు వంచుతాం అంటూ చాలా చెప్పారు. ఇప్పుడు '…అవేమీ సాయం చేయకపోయనా ఎలాగోలా చేస్తాం' అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు బాబు. హామీ యిచ్చేనాటికి యిప్పటికి బ్యాంకింగ్‌ రూల్సు మారలేదు. కొత్త నిబంధనలు రాలేదు. వీళ్లు ఎన్నికల్లో హామీలు యిచ్చారు కదాని పాత అప్పు తీర్చకపోయినా కొత్త అప్పులిద్దామని బ్యాంకులు అనుకోవు. మాఫీ అంటూ లెక్కలు తీయబోతే కొందరు రైతులు, మరి కొందరు బ్యాంకు అధికారులు కుమ్మక్కయి చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. డూప్లికేట్‌ పాస్‌బుక్కులపై ఋణాలు, ఒకే పొలంపై రెండేసి బ్యాంకుల్లో ఋణాలు… యిలా అనేకం తేలాయి. ఋణగ్రస్తుల పేర్లు కూడా బ్యాంకులు పూర్తిగా యివ్వటం లేదట. ఈ వివరాలు చేతిలో లేకుండా మరి టిడిపి నిపుణుల కమిటీ ఆకాశపంచాంగం ఎలా గుణించిందో ఏమో! 

అమలుకి వచ్చేసరికి రెండు ప్రభుత్వాలూ కొత్త కొత్త పరిమితులు విధిస్తున్నాయి. ఆర్థికభారం తగ్గించుకోవడానికే యీ కిటుకులన్నీ అని అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రభుత్వం అక్టోబరు మూడోవారంలో కార్పోరేషన్‌ పెట్టి 20% రిలీజ్‌ చేస్తుందట. కొత్త అప్పులివ్వడానికి బ్యాంకులకు అది చాలా? అలా వాళ్లు చెప్పారా? రైతులకు బాండ్లు యిస్తారట. నాలుగేళ్లలో మొత్తం అప్పు తీరిపోతుందట. ఈ లోగా పడే వడ్డీ మాటేమిటి? అదెవరు కడతారు? ఈ రుణమాఫీ పథకం అమీబాలా రకరకాలుగా రూపం మార్చుకుంటూ ఏదోలా తయారైంది. నాకైతే అర్థం కావటం లేదు. పథక రూపకర్తలకైనా అవుతుందో లేదో తెలియదు. 'బంగారం వేలం వేయవద్దని, రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకులకు చెప్పాం, వాళ్లు ఒప్పుకున్నారు' అని రెండు ప్రభుత్వాల ప్రెస్‌ నోట్లు విడుదలవుతాయి. బ్యాంకర్ల తరఫు నుండి ఒక్క ప్రకటనా రాదు. వాళ్లు పీడించడం మానలేదు, కొత్త అప్పులు యివ్వటం లేదు అని రైతులు మొత్తుకుంటున్నారు. బలహీనమనస్కులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

లాండ్‌ పూలింగ్‌ అంటే నమ్ముతారా?

ప్రభుత్వాల క్రెడిబిలిటీ యిలా వున్న పరిస్థితుల్లో,  ప్రచారం ఎక్కువ, ఆచరణ తక్కువ అని అందరికీ తేటతెల్లంగా తెలుస్తుంటే, యిప్పుడు లాండ్‌ పూలింగ్‌ అంటే భూయజమానులు ఎగబడి యిస్తారా? ఏడేళ్ల క్రితం యిలాగే అని చెప్పి పెండింగులో పెట్టారు. బాబు అధికారంలోకి వస్తూనే వాటిని డెవలప్‌ చేసి యిచ్చేమన్నారు. ఎందుకంటే కొత్తగా అడిగితే దాని సంగతి ఎత్తుతారని భయం. బాకీలు ఎగ్గొట్టేవాడు, తొలిసారి తీసుకున్న అప్పును ఠంగున తిరిగి యిస్తాడట. ఈ సందర్భంలో తొలిసారి దానికే ఏడేళ్లు పట్టింది. అయితే అప్పుడు బాబు ప్రభుత్వం లేదు. ఆయన రాగానే మాత్రం ఠంగున యిచ్చేశారు, కొత్తగా పూ(ఒత్తు లేదు)లింగ్‌ చేయాలి కాబట్టి! కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదని అందరికీ తెలుసు. తర్వాతి వచ్చిన ప్రభుత్వం యీ కమిట్‌మెంట్‌ను పాటిస్తుందో లేదో తెలియదు. ఉమ్మడి రాష్ట్ర నిర్ణయాలను తెరాస ప్రభుత్వం తిరగతోడుతోంది. బాబు తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఎలా వుంటారో ఎవరికి తెలుసు? తేమనేలలో మల్టీ స్టోరీడ్‌ బిల్డింగులు కట్టడానికి ఖర్చు ఎక్కువ అని అందరికీ తెలుసు. పునాదులకే బోల్డు అవుతుంది. కేంద్రం యిస్తుందంటారా? పైగా ఏ పరిహారం యివ్వాలన్నా కేంద్రం కనికరం చూపాలి. ఋణమాఫీ విషయంలో కరుణ చూపలేదు. అంతా రూల్సు ప్రకారమే అన్నారు. భూసేకరణకు నిధులు దయచేయించండి అంటే ప్రభుత్వభూమిలో ఎందుకు కట్టరాదు? అని అడిగితే…? మీరు ప్రచారానికే యింత తగలేస్తే ఎలా..? అంటే!? మొన్ననే గుజరాత్‌ వెళ్లి వచ్చాను. సిఎం పేరు మీద పోస్టర్లు లేవు, హోర్డింగ్స్‌ లేవు. ప్రభుత్వ పథకాల ఆర్భాటమూ లేదు. రాజస్థాన్‌లోనూ అంతే. సిఎం పబ్లిసిటీపై వాళ్ల బజెట్‌ చాలా తక్కువగా వున్నట్టుంది. దాదాపు 30 ఏళ్లగా మనకు పట్టిన తెగులు యిది. దీనికే ఎంత డబ్బూ చాలటం లేదు. పెద్ద రాష్ట్రం వుండగా పబ్లిసిటీకి పెట్టినంతే చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నట్లు కనబడుతోంది. 

నేను యిలాటి సందేహాల గురించి రాస్తే 'మీది నిరాశావాదం. అసలే విభజన వలన మానసికంగా కృంగిపోయిన ఆంధ్రులను మరింత దిగాలుపరచకండి' అని కొందరు మందలిస్తున్నారు. ఆశలు చూపించేవారు రాజకీయనాయకులు. 'హామీలను గుడ్డిగా నమ్మి పగటికలలు కంటూ బద్ధకించకండి. వాస్తవాలపై దృష్టి సారించి, జాగ్రత్తగా భవిష్యత్తు ప్లాను చేసుకోండి అని హెచ్చరించేవారు' నా బోటి హితైషులు. వీళ్లు చెప్పే హామీలు అమలైతే మంచిదే. కాకపోతే…? నమ్మిన యువతంతా మానసికంగా దెబ్బ తింటారు కదా. కీడెంచి మేలు ఎంచమని పెద్దలే చెప్పారు. గతానుభవాలు ప్రస్తావిస్తూ, సమస్యలో దాగి వున్న కోణాలపై వెలుగు ప్రసరింపచేస్తూ 'పరిస్థితి ఎలా వున్నా తట్టుకునేట్లా తయారవండి' అని చెప్పడమే నా లక్ష్యం.  రాజధాని విషయంలో యిన్ని చిక్కుముళ్లు వున్నప్పుడు టిడిపి ప్రస్తుత పదవీకాలంలోనే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఎవరైనా చెప్పగలరా? అని వారినే ఆలోచించమంటున్నాను.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2014)

[email protected]