సత్యార్థికి నోబెల్.. మన వ్యవస్థకు ఒక వెక్కిరింత..!

కైలాష్ సత్యార్థి…. ఇంత వరకూ ఈయనకు భారత దేశంలోని వర్సిటీ లేవీ గౌరవ డాక్టరేట్లు ఇవ్వ లేదు… మీడియా లో ఈయన సేవలు ఫోకస్ అయ్యింది లేదు… అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలేవీ ఈయనకు…

కైలాష్ సత్యార్థి…. ఇంత వరకూ ఈయనకు భారత దేశంలోని వర్సిటీ లేవీ గౌరవ డాక్టరేట్లు ఇవ్వ లేదు… మీడియా లో ఈయన సేవలు ఫోకస్ అయ్యింది లేదు… అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలేవీ ఈయనకు పద్మశ్రీనో.. పద్మభూషణో. పద్మవిభూషణో.. ఇవ్వమని సిపారసు చేయలేదు. అయితేనేం.. ఈయన చేస్తున్న మంచి పనుల గురించి… సామాజిక సేవలో చేసిన కృషి గురించి నోబెల్ వారి వరకూ చేరింది. నిజంగా సత్యార్థి కి నోబెల్ శాంతి బహుమతి దక్కడం మన వ్యవస్థలోని అన్ని వర్గాలకూ ఒక చిన్న ఝలక్.  ఒక వెక్కిరింత.

తాము చెప్పినదే వేదం అని ఫీలవుతున్న మీడియాకు.. తమ అండ లేకపోతే ఏదీ సాధ్యం కాదన్న రాజకీయ నేతలకు… తాము జోక్యం చేసుకొంటే తప్ప ఎవరికీ అవార్డులు రావనే లాబీయిస్టులకు… చాచి కొట్టినట్టుగా మారింది సత్యార్థికి అందుతున్న సత్కారం. 

పద్మ అవార్డులు ఇవ్వాలంటే.. ప్రభుత్వాలు సిఫార్సు చేయడమే దారుణమైన వ్యవహారం.  అత్యుత్తమైనవిగా భావించే ఆ అవార్డుల వ్యవహారంలోకి రాజకీయ రొచ్చును చల్లుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి సన్నిహితులు, సానుభూతి పరులందరికీ పద్మఅవార్డులు దక్కుతున్నాయి. మరీ బరి తెగింపు ఏమిటంటే.. ఆ పార్టీ తరపున ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ల పేర్లను…. ప్రాంతీయ పార్టీ నేతలకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారి పేర్లను నిస్సిగ్గుగా పద్మ అవార్డుల జాబితాలు ఉంచుతున్నారు.

ఎవరైనా ఏమైనా అనుకొంటారు.. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం అవార్డులను అందుకొంటే.. అవి కొనుక్కొచ్చినవో.. కొట్టుకొచ్చినవో అనుకొంటారు తప్ప.. గౌరవం దక్కించుకొన్నవి కాదు.. అనే భయం భక్తులేమీ లేకుండా… మన వాళ్లు తెగిస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారందరి తీరుతోనూ పద్మ అవార్డులకు విలువ పోయింది. ఇక వాటిని దక్కించుకొన్న వాళ్లు కూడా వాటిని తమ “స్క్రీన్ నేమ్స్'' గా ఉపయోగించుకొంటూ కోర్టుల చేత మొటిక్కాయలు తింటున్నారు. అది వేరే సంగతి!

అయితే ఇండియాలో గుర్తింపుకు నోచుకోని.. “పద్మాల'' పడగపడని ఒక వ్యక్తికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇంకేముంది… మీడియాకు రేపటి నుంచి సత్యార్థి ఒక సెలబ్రిటీ! రాజకీయ నేతలు సత్యార్థితో కలిసి పనిచేస్తామంటారు… ఆయన సలహాలను స్వీకరిస్తామంటారు. వచ్చే ఏడాదో.. ఆ తర్వాతి ఏడాదో.. ఈయనకు పద్మభూషణో. పద్మవిభూషణో దక్కే అవకాశాలూ లేకపోలేదు. ఆయనకు ఆ అవార్డును ఇచ్చామని గొప్పలు చెప్పుకొనే అవకాశాన్ని ప్రభుత్వాలు ఎందుకు మిస్ చేసుకొంటాయి?!