పార్టీలు కావాలా..ప్రజలు కావాలా?

ఈ దేశంలో మరే ప్రాంతీయ భాషా ప్రజలకు పట్టని దుస్ఢితి తెలుగు ప్రజలకు పట్టింది. తమ ఆస్తులు, అధికారాల కోసం రాజకీయాలు చేయడమే జీవన ఉపాథిగా పెట్టకున్న రాజకీయ నాయకులు పుణ్యమా అని తెలుగు…

ఈ దేశంలో మరే ప్రాంతీయ భాషా ప్రజలకు పట్టని దుస్ఢితి తెలుగు ప్రజలకు పట్టింది. తమ ఆస్తులు, అధికారాల కోసం రాజకీయాలు చేయడమే జీవన ఉపాథిగా పెట్టకున్న రాజకీయ నాయకులు పుణ్యమా అని తెలుగు జనాలు ఇక యుగాంతం వరకు రెండుగా చీలిపోయే బతకాలి. ఈ రావణకాష్టం కొండెక్కకుండా, ఈ దరిద్రపు రాజకీయాలు చేసే జనాలు, యథాశక్తి తైలం పోస్తూనో, కట్టెలు జత చేస్తూనూ వుంటారు తప్ప వేరు కాదు.

నిన్నటి దాకా రాజకీయ పార్టీలు..నాయకులు. ఉద్యమం..వేర్పాటు..ఇప్పుడు అన్నీ అయిపోయాయి కదా. ప్రజలు తమకు నచ్చిన వారికి ఎక్కడికక్కడ అధికారం అంటగట్టేసారు కదా. ఇంకేమిటి బాధ. ఈయనకేమో..అక్కడా అధికారం లాక్కోవాలన్న అత్యాశ. ఆయనకేమో, అతగాడికి ఇక్కడకు రానివ్వకూడదు..తన అధికారం చేజారిపోకూడదన్న పంతం. అందుకే కొట్టుకుంటున్నారు. కానీ విచక్షణ మరిచి ఈ కొట్టుకున్న నేపథ్యంలో తాము ఇద్దరు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులమని, తాము మాట్లాడే మాటలు, తమ తమ రాష్ట్రాల ప్రజలను కూడా ప్రభావితం చేస్తాయని మరచిపోతున్నారు. 

దేశంలో ఎక్కడాలేదీ వింత పరిస్థితి. భాజపా, కాంగ్రెస్ అనేక హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అధికారంలో వుండొచ్చు. నిత్యం రాజకీయంగా ప్రకటనల పోరు సాగించవచ్చు. కానీ పక్క పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ల పై వీళ్లు, వీళ్లపై వాళ్లు బుదర జల్లుకోవడాలు లేదు. పార్టీలు పార్టీలు తిట్టుకోవడమే కానీ వ్యక్తులుగా ముఖ్యమంత్రులు తిట్టుకోవడంలేదు
కానీ కెసిఆర్ అండ్ కో, ఇటు బాబు అండ్ చినబాబు అదే పని చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని కేసిఆర్. ఆయనకు పాలించడం చేతకావడం లేదని బాబు. మధ్యలో చినబాబు ట్విట్టర్ సన్నాయి నొక్కులు. ఆపై లోకేష్ గుడ్డలూడదీస్తామని తెరాస శ్రేణులు. ఇదంతా ఎందుకు వస్తోంది. తెలంగాణలో కూడా అధికారంలో తేదేపా ఇప్పటి నుంచే వెంపర్లాడడం వల్ల, చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు నేరుగా వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల. కేసిఆర్ లాంటి వాళ్లు పాలనపై కన్నా అధికారం నిలబెట్టుకునేందకు పార్టీ మార్పిడులను ప్రోత్సహించడం వల్ల. ఆ విధంగా టీడీపీని నిర్వీర్యం చేసి, తాను బతికేద్దామని అనుకోవడంవల్ల. ఈ పరిస్థితి సహించలేక తేదేపా ఇలాంటి దూషణల వ్యూహం ఎంచుకుంది.నిజానికి తేదేపా కూడా ఆంధ్రలో టీఆర్ఎస్ మాదిరిగానే వైకాపా నుంచి ఫిరాయింపులను సదా ప్రోత్సహిస్తున్న సంగతి విస్మరించింది. ఆ సంగతి అలా వుంచితే తెలంగాణలో తెలుగుదేశం వ్యవహారాలు జనాల దృష్టిలో వుండకుండా చేసేందుకు కెసిఆర్ పాలన లోపాలపై గురిపెట్టింది. దాన్ని అదనుగా చేసుకుని తెరాస శ్రేణులు కూడా ప్రతి దూషణలకు దిగుతున్నాయి. వారు కూడా తెలివిగా ఈ ఆంధ్రపార్టీల వ్యవహారం మరుగున పడిపోయి, ఉద్యామాన్ని రగిల్చిన వేడి చల్లారకుండా చూడాలనుకుంటున్నాయి. 

కానీ ఇటు అటు ఇద్దరు కీలక నేతలు ఒకటి మరిచిపోతున్నారు. విభజన నేపథ్యంలో అన్నదమ్ముల్లా ఒకే భాష మాట్లాడే జనాల మధ్య దూరం పెంచారు. పోనీ విభజన జరిగిపోయింది. ఆ గాయం మెల్లగా మానుతుంది అంటే, పుల్లలు పెట్టి మరీ రేపుతున్నారు. తాము నేరుగా గొడవ పడుతున్నాం అనుకుంటున్నారు. ఒకే భాష మాట్లాడే జనం మధ్య చిచ్చు పెంచుతున్నాం అనుకోవడం లేదు. పైగా అసలే పదేళ్ల ఉమ్మడి రాజధాని, పైగా హైదరాబాద్ లో సెటిలైన లక్షలాది సీమాంధ్రులు వున్నారన్న సంగతిని ఈ రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. 

చాణక్య
[email protected]