రాజధానికి నిర్మాణానికి చందాలా?

ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి వుంటుందా? ఇలా ప్రశ్నిస్తే నాపై విరుచుకు పడే వారే ఎక్కువ కావచ్చు.కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. రాష్ట్రాన్ని రెండుగా చీల్చి, మీ మానాన మీరు బతకండి, పొండి, కావాలంటే కావాల్సిన…

ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి వుంటుందా? ఇలా ప్రశ్నిస్తే నాపై విరుచుకు పడే వారే ఎక్కువ కావచ్చు.కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. రాష్ట్రాన్ని రెండుగా చీల్చి, మీ మానాన మీరు బతకండి, పొండి, కావాలంటే కావాల్సిన ప్యాకేజీలు ఇస్తాం అని చెప్పిన తరువాత జరుగుతున్న తంతు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఒకాయన యాభై లక్షలు విరాళం ఇచ్చినపుడే అనుమానం వచ్చింది. ఇదేదో, ప్రీప్లాన్డ్ ట్రాక్ ప్రకారం జరుగుతోంది అని. ఆపై పెన్షనర్లు తొమ్మిది కోట్లు ఇచ్చారు. ఏదో చానెల్ తుపాను బాథితుల సహాయం అన్నట్లుగా విభజన బాధితుల సహాయ నిధి సేకరిస్తోందట. ఏమిటిదంతా? 

మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన భాజపా హయాంలోనా ఈ ముష్టి ఎత్తుకునే దుస్థితి. కాంగ్రెస్ చేసిన అరాచక విభజన కు తన వంతు సాయం చేసిన భాజపా, ప్యాకేజీ పుణ్యం తమదే అని ఎన్నికల వేళ డప్పేసి చాటుకుంది. పైగా మోడీ మహాశయుడు, ఈ అద్భుతం సాధించింది, మన వెంకయ్య నాయుడే అని పొగిడారు కూడా.  మరి ఈ ప్యాకేజీలో రాజధాని నిర్మాణం లేదా? లేదూ, భాజపా ఇచ్చేనిధులు అరకొరే అని అప్పుడే తెలిసిపోయిందా? మరెందుకోసమీ నిధుల సమీకరణ. 

ఎవరో ఒకాయిన బహుశా బాబు దృష్టిని ఆకర్షించడానికి కావచ్చు, 50 లక్షలు విరాళం ఇచ్చారు. మంచిదే. ఇంకా సిఎమ్ కాలేదు. మరి ఈ యాభై లక్షలు ఏ పేరిట ఇచ్చివుంటారు.సిఎమ్ ఫండ్ అని ఇచ్చి వుంటారు. అంటే అది దేనికి వెళుతుంది. సిఎమ్ సహాయ నిధికి. దానికి రాజధాని నిర్మాణానికి సంబందం ఏమిటి? సరే ఆ సంగతి అలా వుంచండి. మరి పెన్షనర్లు ఎందుకు తొమ్మిది కోట్లు ఇచ్చినట్లు? ఎవరన్నా పిలుపు ఇచ్చారా? లేదే? మరెందుకు ముందే కూసే కోయలల మెహర్బానీ? రేపో, ఎల్లుండో కేంద్రంలో ప్రభుత్వం కొలువుతీరుతుంది. 

ఇప్పటికే రాజధాని ఎంపికపై వేసిన అధికారిక కమిటీ కేంద్రానికి తన నివేదిక ఇస్తుంది. ఆపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఆఫ్ కోర్స్..దానిపై బాబు ప్రభావం వుండోచ్చు. మంచిదే. మనని అడిగి మరీ రాజధాని నిర్ణయిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది? అప్పుడు రాజధాని నిర్మాణానికి నిదులు విడుదల అన్నది. అది ఎంత మొత్తం, ఎన్నాళ్లలో, ఎన్ని విడతల్లో ఇస్తారు. ఇది కేంద్ర భవనాల శాఖ నిర్మిస్తుందా..లేక రాష్ట్రానికి నిధులిచ్చి చేసుకోమంటారా ఇంకా తెలియదు. 

మరి అలాంటపుడు ఎవరు అడిగారని? చానెల్ కావచ్చు మరో సంస్థ కావచ్చు. ఇలా సాధారణంగా చేసేది కేవలం చాలా వరకు మెహర్భానీ కోసమే. తమకు ఇష్టమైన ప్రభత్వం అధికారంలో వుంటే, తీసకెళ్లి సేకరించిన తుపాను బాధితుల మెత్తం ఆయనకు ఇస్తారు. తమకు ఇష్టంలేని ప్రభుత్వం వుంటే ఏ రామకృష్ణ మిషన్ కో అందిస్తారు ఎందుకిలా? ఇలాంటి వ్యవహారాలను మెహర్బానీ అని కాక ఏమనాలి? సరే ఈ వ్యవహారం వదిలి మళ్లీ , రాజధాని దగ్గరకు వస్తే, అసలు హైదరాబాద్ ను మించిన అద్భుతమైన రాజధానిని నిర్మించుకునేందుకు సాయం చేస్తామనే కదా మొదట్నించీ కేంద్రం చెబుతూ వస్తోంది. మన వాళ్లు హైదరాబాద్ గురించి పట్టుపట్టినపుడల్లా ఇదే మాట కదా. పైగా ఇప్పడు బాబుగారు కూడా, జిల్లాకో హైదరాబాద్ వంతున 13 హైదరాబాద్ లు కడతామంటున్నారు. అంటే అంత విజన్ ఆయనకు వుందంటే, ఆర్థిక పరిస్థితి కూడా ఆయనకు తెలిసే వుండాలి కదా. ఆయనేమీ విరాళాలు ఇవ్వమని కోరలేదే? మరెందుకు ఈ వసూళ్లు, చెక్కుల అందచేతలు?

అదలా వుంచితే, పోనీ ఎంత ఇస్తారు..అందరూ కలిసి ఓ వంద కోట్లు? వంద కోట్లతో రాజధానిలో ఏ మేరకు నిర్మాణం సాగించగలరు. బాబు లెక్కల ప్రకారం అయిదు లక్షల కోట్లు కావాలి. చానెల్ మహా అయితే కోటీ వసూలు చేయగలదు. అందరూ కలసి మరో 99 కోట్లు అందించగలరు. అంతకన్నా వీటిని మరో ప్రయోజన కరమైన పనులకు వాడితే మంచిది కదా? పించనర్లు 9 కోట్లు తమ అర కొర పింఛన్ల నుంచి కోత పెట్టకుని ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఆ మొత్తాన్ని నిధికింద పెట్టుకుంటే, వారికి ఆరోగ్య పథకాల్లాంటివి అందుబాటులోకి వస్తాయి కదా? 

అసలు ప్యాకేజీతో ఎవరికి ఉపయోగం?

సీమాంధ్రకు ప్యాకేజీ రూపొందించేటపుడు కేవలం పారిశ్రామిక వేత్తలకు పనికి వచ్చేలా వుండకూడదు. అభివృద్ధికి దోహదపడేలా వుండాలి. హైదరాబాద్ లో వున్న అనేకానేక సీమాంధ్రుల సంస్థలు, ఈ ప్యాకేజీపై అప్పుడే కన్నేసాయి. తమ తమ సంస్థల రిజిస్ట్రేషన్ ను సీమాంధ్రలో చేయించి, అరకొర మరలింపుతో సబ్సీడీలు, పన్నురాయతీలు కొట్టేయాలని చూసే అవకాశం వుంది. ఇప్పటికే గతంలో భూములు పొందిన అనేకానేక సంస్థలు ఈ రోజులుకు తమ తమ కార్యకలాపాలు ప్రారంభించలేదు, ఉపాధి కలిగించలేదు. 

విశాఖ లో ప్రభుత్వం నుంచ చౌకగా స్థలం పొంది, భవనాలు నిర్మించిన విప్రో సంస్థ ఏ మేరకు కార్యకలాపాలు ప్రారంభించిందో అదంరికీ తెలిసిందే. గతంలో ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చారు. ప్యాకెజీలో నిబందనలు చాలా స్పష్టంగా వుండాలి. కేవలం పారిశ్రామిక వేత్తలు కోట్లు వెనకేసుకోవడానికి కాకుండా, నిజమైన ఉపాధి కల్పన, అభివృద్దికి దోహదపడేలా వుండాలి. అంతేకానీ కాగితాలపై ఉద్యోగులను, లెక్కల్లో ప్రగతిని చూపి, రాయతీలను తన్నుకుపోయే డేగలకు ఉపయోగపడేలా కాదు.

చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో అపారమైన పలుకుబడి వుంది. అయిదులక్షల కోట్లు కాకున్నా, కనీసం లక్ష కోట్లన్నా మంజూరు చేయించుకోగలరు. అందులో సందేహం లేదు. పైగా మోడీ కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగేలా విభజన వ్యవహారం వుందని అధికారులను మందలించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు హోం శాఖ వర్గాలు సీమాంధ్రకు న్యాయం చేయాలంటే,  అంటూ ఓ అలవి కాని లక్షల కోట్ల మొత్తం కావాలని చెప్పినట్లు ఆ వార్తల సారాంశం. అంటే సమస్య తీవ్రత మోడీ కి తెలిసినట్లే. అందువల్ల ఆయన చేయాల్సింది చేస్తారు. అంతవరకు ఈ విరాళాలకు విరామం పెట్టడం మంచిది. 

చాణక్య

[email protected]