హైదరాబాదీ భోజన సంస్కృతితో అలవాటు ఉన్నవారు.. ప్రత్యేకించి.. హైదరాబాదీ స్పెషల్ వంటకం అయిన దమ్ బిర్యానీ తినేవారు… ప్యారడైజ్ రెస్టారెంట్ గురించి తెలియకుండా ఉండరు. ప్యారడైజ్ బిర్యానీకి దేశవ్యాప్త ప్రాచుర్యం ఉంది. హైదరాబాదీ ఫుడ్ కల్చర్ అలవాటైన వారు ఉండాలేగానీ.. విదేశాల్లో కూడా ప్రాచుర్యం ఉంది.
హైదరాబాద్ నగరం పేరెత్తగానే.. ప్రత్యేకించిన ముస్లిం నవాబుల మాంసాహార మరియు ప్రత్యేకశైలిలో వండే బిర్యానీల ఘుమఘమలు భోజన ప్రియుల నోరూరిస్తాయి. వీటిలో ప్యారడైజ్ బిర్యానీది అగ్రస్థానం అనడంలో సందేహం లేదు. భాగ్యనగరానికి వచ్చే దాదాపుగా ప్రతి వీఐపీ.. కనీసం ఒక్కసారైన ప్యారడైజ్ బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. గతంలో రాహుల్‌గాంధీ వంటి అనేక మంది ప్రముఖులు, సినీస్టార్లు మక్కువ చూపించడం ద్వారా ప్యారడైజ్ బిర్యానీ పాప్యులారిటీ బాగా పెరిగింది.
హైదరాబాదు నగరంలో ఒక్క సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్లో మాత్రమే ఈ బిర్యానీ హోటల్ ఉండేది. ఇప్పుడు నగరంలో పలుప్రాంతాలకు దాన్ని విస్తరించారు. అయితే హైదరాబాదీ ప్యారడైజ్ బిర్యానీని ఇతర నగరాలకు కూడా విస్తరించే ప్రయత్నం ఇప్పుడు నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పబ్లిక్ ఈక్విటీలకు వెళ్లడం ద్వారా.. నిధులు పోగుచేసి.. ఆ నిధుల్తో భారీస్థాయిలో ఇతర నగరాలంతటా ప్యారడైజ్‌హోటళ్లు ఏర్పాటుచేస్తారన్నమాట.
హైదరాబాదు నగరం అంటేనే రకరకాల నవాబుల సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి చెందిన భోజన విశేషాలకు ప్రసిద్ధి. నవాబుల దం బిర్యానీ, చాయ్-బిస్కట్, హలీం, స్వీట్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే ఆయా విశేషాలకు సంబంధించి ప్యారడైజ్ మరియు బావార్చి బిరియానీ, ఆల్ఫా టీ, పిస్తాహౌస్ హలీం, పుల్లారెడ్డి స్వీట్స్ ఇలా.. అనేకం ప్రసిద్ధి చెందాయి. ఇవి సాధారణంగా హైదరాబాదులో తప్ప మరెక్కడా దొరకవు అని ప్రసిద్ధి. అయితే ఇప్పుడు తొలిసారిగా ప్యారడైజ్ బిర్యానీ ఇతర నగరాల భోజన ప్రియుల చవులూరించడానికి సిద్ధం అవుతున్నదన్నమాట.