సినిమా రివ్యూ: రోమియో

రివ్యూ: రోమియో రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: టచ్‌స్టోన్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: సాయిరామ్‌ శంకర్‌, అదోనిక, రవితేజ, సుబ్బరాజు, అలీ, ప్రగతి తదితరులు కథ, మాటలు: పూరి జగన్నాథ్‌ సంగీతం: సునీల్‌ కశ్యప్‌ కూర్పు:…

రివ్యూ: రోమియో
రేటింగ్‌: 1.5/5

బ్యానర్‌: టచ్‌స్టోన్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: సాయిరామ్‌ శంకర్‌, అదోనిక, రవితేజ, సుబ్బరాజు, అలీ, ప్రగతి తదితరులు
కథ, మాటలు: పూరి జగన్నాథ్‌
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాత: ‘టచ్‌స్టోన్‌’ దొరైస్వామి
కథనం, దర్శకత్వం: గోపీ గణేష్‌
విడుదల తేదీ: అక్టోబర్‌ 10, 2014

నిర్మాణ దశలోనే చాలా ఆలస్యమైన ‘రోమియో’ చిత్రానికి అన్నిటికంటే పెద్ద ఎస్సెట్‌… ‘పూరి రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్‌లైన్‌. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌’లాంటి ప్రేమకథలు రాసిన పూరి జగన్నాథ్‌కి లవ్‌స్టోరీస్‌ డీల్‌ చేయడంలో సెపరేట్‌ స్టయిల్‌ ఉంది. ‘రోమియో’ సినిమా వరకు తనకి స్టార్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా బ్యాలెన్స్‌ చేయాల్సిన అవసరాలు అవీ లేవు కనుక పూరిలోని రైటర్‌ కదం తొక్కి ఒక కొత్తరకం ప్రేమకథని రాసి ఉంటాడని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఆశలు రేకెత్తించిన ఆ ట్యాగ్‌లైన్‌పై ఆశలొదిలేసుకోవడానికి ఆట్టే సమయం పట్టదు. రోమియో స్టార్ట్‌ అయిన జస్ట్‌ కొన్ని మినిట్స్‌లోనే అర్థమైపోతుంది… ఇది పూరి మనసుపెట్టి రాసిన ప్రేమ కథ కాదని. 

కథేంటి?

సమంత (అదోనిక) రోమ్‌ని చుట్టి రావాలనే కోరికతో ఒంటరిగా ఆ దేశానికి వచ్చేస్తుంది. ఆమెని చూడగానే వెంట పడడం మొదలు పెడతాడు కిట్టు (సాయిరామ్‌ శంకర్‌). సమంత అచ్చంగా తను ప్రేమించిన అమ్మాయిలానే ఉండడంతో తనని ఎలాగైనా తనతో తీసుకెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ అప్పటికే సమంత మరో వ్యక్తితో (సుబ్బరాజు) ప్రేమలో ఉంటుంది. కిట్టు ప్రేమని అర్థం చేసుకుని సమంత అతనితో ఉండిపోతుందా లేక తను ప్రేమించిన వాడే కావాలని వెళ్లిపోతుందా?

కళాకారుల పనితీరు:

సాయిరామ్‌ శంకర్‌ ఎక్కువ కష్టపడకుండా వీలయినంత సహజంగా నటించడానికి ట్రై చేసాడు. అతను బాగానే చేసాడు కానీ పాత్ర చిత్రణలో లోపాల వల్ల తేలిపోయాడు. ఈ చిత్రం మొత్తం హీరో, హీరోయిన్ల చుట్టూ తిరుగుతుంటుంది. హీరోయిన్‌ది చాలా చాలా ఇంపార్టెంట్‌ రోల్‌. అలాంటప్పుడు ఎవరైనా క్యూట్‌ ఫేస్‌ని సెలక్ట్‌ చేసుకుని ఉండాల్సింది. అదోనిక ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌ అయింది. మిగిలిన పాత్రలన్నీ కూడా లీడ్‌ క్యారెక్టర్స్‌తో ఫోన్‌లో సంభాషించేవే కావడం విశేషం. రవితేజ కనిపించిన కాసేపు తన ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అలీ సంభాషణలు కూడా ఫర్వాలేదు. సుబ్బరాజు, ప్రగతి షరా మామూలే. 

సాంకేతిక వర్గం పనితీరు:

పూరి జగన్నాథ్‌ రాసిన కథ, మాటల్లో ఆయన ముద్ర అస్సల్లేదు. లీలగా ఒక ఐడియా వస్తే… దానిని కొన్ని గంటల్లో ఏదో అలా అలా అల్లేసినట్టు, కొన్ని మాటలు రాసేసినట్టు ఉంటుంది కానీ ఎక్కడా ఈ కథకి స్ట్రక్చర్‌ అంటూ లేదు. కథలో అస్సలు మేటర్‌ లేకపోవడంతో దర్శకుడు కూడా దానికి ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ప్లే రాయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతో రోమ్‌ నగరాన్ని వీలయినంత అందంగా కెమెరాలో బంధించగలిగారు. మ్యూజిక్‌ ఆకట్టుకోదు. 

డైరెక్టర్‌ గోపీ గణేష్‌కి ఒక సినిమాని తెరకెక్కించడంలో నేర్పు ఉంది కానీ తన తొలి సినిమాకి బలమైన కథని ఎంచుకోలేకపోయాడు. ఈ కథని తీర్చి దిద్దిన విధానంతో అతని దర్శకత్వ ప్రతిభపై ఒక అంచనాకి రావడం భావ్యం కాదు. 

హైలైట్స్‌:

  • రవితేజ ఉన్న ఆ కొన్ని క్షణాలు    
  • రోమ్‌, వెరోనా బ్యాక్‌డ్రాప్‌

డ్రాబ్యాక్స్‌:

  • స్క్రిప్ట్‌
  • హీరోయిన్‌
  • మ్యూజిక్‌

విశ్లేషణ:

రోమ్‌, వెరోనా నగరాల నేపథ్యంలో ఒక లవ్‌స్టోరీ సెట్‌ చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాలోంచి పుట్టిన కథలా ఉందిది. ఆలోచన మంచిదే కానీ అందుకు అనుగుణమైన ప్రేమకథ రాసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించినట్టు లేరు. కథ మొదలయ్యే తీరు చూస్తేనే ఇది హాఫ్‌ బేక్డ్‌ స్క్రిప్ట్‌ అనే సంగతి తెలిసిపోతుంది. హీరోయిన్‌ని చూడగానే ‘దాన్ని చూసాను… దాన్ని చూసాను’ అని ఎవరితోనో ఫోన్లో చెప్తాడు హీరో. ఏదో నేపథ్యం ఉందేమో అనుకుంటాం కానీ అసలు సంగతి తెలిసాక మాత్రం… చనిపోయిన ప్రేయసి రూపంలో మరొకరు కనిపిస్తే ఇలాగేనా రియాక్ట్‌ అయ్యేది అనుకోకుండా ఉండలేం. 

చనిపోయిందని అనుకున్న తన ప్రేయసి మళ్లీ తారసపడితే ఆ ప్రియుడు ఎలా స్పందిస్తాడు, ఆమెని దక్కించుకోవడానికి ఏం చేస్తాడు అనేది పూరి జగన్నాథ్‌ ఐడియా. హృద్యంగా చెప్తే ఇదే కథ రక్తి కడుతుంది. కానీ ఈ ఐడియాని డెవలప్‌ చేసిన విధానం చూస్తే ‘లవ్‌’ అనే కాన్సెప్ట్‌ మీదే రైటర్‌కి సరైన ఇంప్రెషన్‌ లేదేమో అనిపిస్తుంది. ఒకానొక దశలో ఇదంతా ఏదో సరదాగా జరుగుతోందని, ఏదో ట్విస్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తారేమో అని కూడా ఆశ పుడుతుంది. కానీ ఎప్పుడైతే జయసుధ ఫోన్‌ లైన్లోకొచ్చి సెంటిమెంట్‌ డైలాగులు చెబుతుందో… అప్పుడే ఇదంతా రచయిత సీరియస్‌గానే రాసుకున్నాడని స్పష్టమవుతుంది. 

పూరి జగన్నాథ్‌ ఆ మధ్య తీసిన ‘నేను నా రాక్షసి’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాలకి ఏమాత్రం తీసిపోని స్క్రిప్ట్‌ ఇది. ఇదే కథని పూరి జగన్నాథ్‌ స్వయంగా డైరెక్ట్‌ చేసినట్టయితే… స్పాట్‌ ఇంప్రొవైజేషన్స్‌తో ఏమైనా బెటర్‌గా తయారయ్యేదేమో! ఈ హాఫ్‌ బేక్డ్‌ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌ మీదకి వెళ్లిపోయిన గోపీ గణేష్‌కి దీంతో ఏం చేయాలో పాలుపోక… పూరి రాసిచ్చిన దానినే ఫాలో అయిపోయాడు. ప్రథమార్థం అయ్యే సరికి ‘‘ఏం జరుగుతోందిక్కడ’’ అనిపించింది కాస్తా ద్వితీయార్థంలో ‘‘జరుగుతున్న దానికి ఏమైనా అర్థం ఉందా… అసలు ఇదో ప్రేమకథా..!’’ అనిపిస్తుంది. 

రోమ్‌, వెరోనా నగరాల విశిష్టతని తెలియజేసి, అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించిన టూరిస్ట్‌ గైడ్‌లా పని చేస్తుంది తప్ప ఈ ‘రోమియో’ మరే విధంగాను అలరించదు. అక్కడికి వెళ్లాలని ఉండి.. ఎప్పటికీ వెళ్లలేమనుకునే వాళ్లు ఆ లొకేషన్లు చూసి తృప్తి పడేందుకు ఈ చిత్రం ఉపయోగపడుతుంది. ఒక మంచి లవ్‌స్టోరీ చూడ్డానికో… లేదా కాసేపు కాలక్షేపం అయిపోయే సినిమాని కోరుకునో రోమియోకి వెళితే మాత్రం నిరాశ, నిట్టూర్పులు తప్పవు. 

బోటమ్‌ లైన్‌: రోమియో – పూరి రాసిన రోమ్‌ ట్రావెలోగ్‌!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri