బెంగాల్‌ సిపిఎంలో నిరసన గళానికి ఉద్వాసన

పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. 34 ఏళ్ల పాలనలో వాళ్లు ప్రజలకు దూరమయ్యారని సులభంగా అనేయవచ్చు. కానీ అసలైన కారణాలు అనేకం – కమ్యూనిస్టు ఆదర్శాలతో ఎప్పుడో పార్టీలో చేరినవారు…

పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. 34 ఏళ్ల పాలనలో వాళ్లు ప్రజలకు దూరమయ్యారని సులభంగా అనేయవచ్చు. కానీ అసలైన కారణాలు అనేకం – కమ్యూనిస్టు ఆదర్శాలతో ఎప్పుడో పార్టీలో చేరినవారు వృద్ధులైనా, అనారోగ్యపీడితులైనా యిప్పటికీ నాయకులుగా వున్నారు.  మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్యకు ఊపిరితిత్తుల సమస్య, పాలిట్‌ బ్యూరో సభ్యుడు నిరుపమ్‌ సేన్‌కు గుండె సమస్య.  సిపిఎం లేబరు వింగ్‌ సీటు, బెంగాల్‌ యూనిట్‌ అధినేత శ్యామల్‌ చక్రవర్తికి స్పాండిలోసిస్‌. వారు పార్టీ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు. అయినా పదవుల నుండి తప్పుకోవటం లేదు. యువతరం నుండి నాయకులు లేరు. చాలాకాలంగా అధికారంలో వుండటం చేత ఆదర్శాలు మరుగున పడి, జబర్దస్తీ చేసి డబ్బులు దండుకోవడం మరిగారు కార్యకర్తలు. ఇదంతా చూసి కమ్యూనిజం అంటే అరాచకం అనే అభిప్రాయానికి వచ్చారు బెంగాల్‌ ప్రజలు. అందుకనే మమతా బెనర్జీ పాలనలో ఎన్ని లోపాలున్నా భరిస్తూ, సహిస్తూ వస్తున్నారు తప్ప కమ్యూనిస్టులను మళ్లీ ఆదరించటం లేదు. ఎంతో కాలంగా పార్టీలో వున్న నాయకులను, సానుభూతిపరులను యీ వాస్తవం బాధిస్తోంది. ''ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రస్తుత నాయకత్వం తప్పుకుని యితరులకు అవకాశం యివ్వాలి.'' అన్నారు సోమనాథ్‌ చటర్జీ. విమాన్‌ బోస్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. ''ఓటమికి వ్యక్తులను బాధ్యులను చేయడం కాంగ్రెసు పద్ధతి. మన కమ్యూనిజంలో సామూహిక బాధ్యత వహిస్తాం'' అంటూ నాయకత్వం ఆ మాటలను కొట్టి పారేసింది. 

అబ్దుల్‌ రజాక్‌ మొల్లా అనే పాలిట్‌ బ్యూరో సభ్యుడు మరింత ఘాటుగా విమర్శించాడు. కమ్యూనిస్టులు మతానికి వ్యతిరేకులు కాబట్టి, ముస్లిములు కమ్యూనిస్టులను సాధారణంగా దూరంగా పెడతారు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అపజయం తర్వాత తన మతస్తులకు చేరువ కావడానికి మొల్లా హజ్‌కు వెళ్లి 'తను కూడా పక్కా ముస్లిమునే' అని చూపదలచుకున్నాడు. అయితే పార్టీ అతనికి అనుమతి యివ్వలేదు. ''హర్‌కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ తలపాగా, కృపాణ్‌తో అసలైన సిక్కులా తిరిగితే మీరేం చేశారు? ఇప్పుడు నా హజ్‌ ప్రయాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?'' అని వాదించాక సరేనన్నారు. పార్టీ వ్యవహారాలపై మొల్లాకు చాలా ఫిర్యాదులున్నాయి. 'ఓటమి తర్వాత బుద్ధదేవ్‌, నిరుపమ్‌ సేన్‌ నాయకత్వం నుండి తప్పుకుని సూర్యకాంత మిశ్రకు అప్పగించమన్నాను. వినలేదు. యువనాయకులను ప్రోత్సహించడం లేదు. కార్యకర్తల్లో కుర్రవాళ్లకు కమ్యూనిజం గురించి చెప్పేవారు లేరు. గతంలో మృణాల్‌ సేన్‌, సునీల్‌ గంగోపాధ్యాయ వంటి మేధావులు కమ్యూనిజం గురించి ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగించేవారు. క్రమేపీ సిపిఎం మేధావులను దూరం చేసుకుంది. ఇప్పుడు ప్రేరణ కలిగించేందుకు ఎవరూ లేరు. విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలకు కుర్రాళ్లు కోక్‌ బాటిల్స్‌ చేతిలో పట్టుకుని వస్తున్నారు. గతంలో నాయకుల పుట్టినరోజులు జరిపేవాళ్లం కాదు. ఇప్పుడు జ్యోతిబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. మైనారిటీలను, వెనుకబడిన వర్గాలను సిపిఎం దూరం చేసుకుంటోంది. వాళ్లకోసం ఏమీ చేయడం లేదు. చెప్పినా వినడం లేదు. ఏమిటిదంతా?' అని మండిపడ్డాడు. 

పార్టీ అతని ధోరణిని తప్పుపట్టింది. ఫిబ్రవరి 26 న పార్టీలోంచి బహిష్కరించింది. అతను వెంటనే వెనుకబడిన వర్గాల, ముస్లిములు సంక్షేమం కోసం పార్టీ పెడతానని ప్రకటించాడు. సిపిఎంతో పడదు కానీ, సిపిఐ, యితర లెఫ్ట్‌ పార్టీలతో కలిసి తృణమూల్‌తో పోరాడతానంటున్నాడు. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]