సాక్షి జగన్ సొంత పత్రిక. ఆయనకి వ్యతిరేకంగా ఏమీ రాయరు. నిజమే కానీ, బుధవారం సాక్షిలో జ్యోతిర్మయం శీర్షిక కింద చిన్న కథ వచ్చింది. ఈ శీర్షిక కింద ఆధ్మాత్మిక విషయాలు వస్తుంటాయి. “అప్పుడే దేశం బాగుంటుంది” క్యాప్షన్‌తో వచ్చిన కథని మొదట అర్థం చేసుకోవాల్సింది జగనే.
కథలోకి వెళ్లే ముందు జగన్ పర్యటనల్లో అధికారులు చేస్తున్న అతి గురించి మాట్లాడుకుందాం. జగన్ వెళుతున్న దారిని దిగ్బంధనం చేస్తారు. షాపులు మూసేయిస్తారు. అత్యవసరం ఉన్నా జనాల్ని వదలరు. చివరికి శుభకార్యం జరుగుతున్న ఇంటి ముందర కూడా ముళ్ల తీగలు వేస్తారు. ఆయన కాన్వాయి కోసం తిరుమల భక్తుల నుంచి కారు లాక్కుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరిగి ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఇది.
మరి రాజుని దేవుడితో సమానమని, ఆయన ఏం చేసినా చెల్లుతుందనే రాజరికం పరిస్థితి ఎలా వుంటుంది? సాక్షి కథలో ఏముందంటే జనక మహారాజు వస్తున్నాడు, రాజమార్గంలో ఎవరూ వుండకూడదని మిథిలాపురి ప్రజల్ని తరిమివేస్తూ భటులు హెచ్చరిస్తున్నారు.
అష్టావక్రుడు అనే ముని దీన్ని లెక్క పెట్టకుండా రాజబాటలో నిల్చుని ” రాజు తన సౌకర్యం కోసం, ప్రజల అత్యవసరాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి వ్యక్తిని నిలదీసే హక్కు రుషులకు వుంది” అంటాడు.
అన్ని కాలాల్లోనూ భటులు ఒకటే. సేమ్ సైకాలజీ, ఆ మునిని బంధించి రాజు దగ్గరికి తీసుకుపోయారు. ఆయన చేతులు జోడించి ” రాజుని నిలదీసే మంచి వాళ్లు ఉన్న దేశం పుణ్యం చేసుకున్నది. ధర్మం కోసం గొంతెత్తే వాళ్లున్న దేశం బాగుంటుంది. వాళ్లే అసలుసిసలైన ఆస్తి” అని తప్పుని దిద్దుకునే అవకాశాన్ని ఇచ్చిన అష్టావక్రున్ని గురువుగా స్వీకరిస్తాడు.
అపుడు రాజరికం కాబట్టి అలా జరిగింది. ఇపుడు ఏ జరుగుతుందో మీకు చెప్పక్కర్లేదు.
జీఆర్ మహర్షి