“మాది దక్షిణాది లో “కపూర్” ఫ్యామిలీ కావాలనుకున్నాను”. ఇదీ చిరంజీవి లేటెస్ట్ స్టేట్మెంట్.
ఇది వినగానే దానవీరశూరకర్ణ రేంజులో “ఆచార్య” దేవా! ఏమంటివి ఏమంటివి! కపూర్ కుటుంబముతో పోలికా! ఎంత మాట..ఎంత మాట…! అని డైలాగెత్తుకోవాలనిపించింది.
తెలుగు సినిమా చరిత్రలో మెగా ఫ్యామిలీది ఒక అరుదైన రికార్డు. అదీ ఒకే ఒక విషయంలో. ఈ ఫ్యామిలీ నుండి హీరోలు పుట్టలు పుట్టలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చేస్తున్నారు. క్రికెట్ టీమ్ సైజ్ నుండి ఇప్పుడు ఒక సినిమా హాల్ నిండేంత మంది అయ్యేట్టున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కపూర్ ఫ్యామిలీ లా అవుదామని అనుకోవడం అంత సమంజసంగా లేదు. విషయం పక్కనబెడితే మెగాఫ్యామిలీ “పెద్ద”గా తన కుటుంబాన్ని వేరే కుటుంబంతో పోల్చుకోవడమే తప్పు. ఏ ఫ్యామిలీ మరొక ఫ్యామిలీలా ఉండదు. మెగా ఘనత మెగా దే. ఆ యూనిక్నెస్ పాటించకుండా పోలిక పెట్టుకోవడం అస్సలు బాలేదు.
ఇక కపూర్ ఫ్యామిలీ లో హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు ఇంకా నిర్మాతలు కూడా ఉన్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, పాటలు, సాహిత్యం లాంటివి రాసే వారు కూడా ఉన్నారు.
అంతేకాదు కపూర్ ఫ్యామిలీ హిందీ పరిశ్రమకి ఎంతో చేసింది. స్టూడియో కట్టింది, సినిమాలు తీసింది, పరోక్షంగా చాలా మందికి జీవనాధారం అయింది. మరి చిరంజీవి ఫ్యామిలీ సినీ పరిశ్రమకు అటువంటి సేవలేం చేయలేదు? ఒళ్లొంచి పని చేసి రెమ్యునరేషన్ తీసుకోవడం తప్ప స్టూడియోలు కట్టి వేలాదిమందికి ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. కనీసం ఒక డబ్బింగ్ స్టూడియో అయినా పెట్టలేదు. గిట్టుబాటు కాదని కొంత, తనకు వ్యాపార దృక్పథం లేదని మరికొంత..కొన్ని కారణాలు చెప్పి వైజాగ్ లో స్టూడియో కూడా కట్టము అనేశారు.
అసలు చిరంజీవి చేసే ప్రతి పనీ కూడా తనకు ఎంత ఉపయోగపడుతుంది అని ఆచి తూచి చేసేదే. సినీ ప్రస్థానం ముగిసిపోతుంది అనుకునే టైం లో రాజకీయాలలోకి వచ్చారు. సినిమా తీస్తే హిట్ కొట్టాల్సిందే అన్నట్లు రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని డిసైడ్ అయిపోయారు.
తన వ్యక్తిత్వానికి సరిపోని అంశాన్ని లేవనెత్తుకుని భంగపడ్డారు. చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో కలపను కలపను అంటూనే ఒక మంత్రి పదవి కోసం కలిపేశారు చిరంజీవి గారు. ఎందుకంటే పార్టీ నడపడం ఖర్చుతో కూడుకున్న పని. దానికి చాలా త్యాగం అవసరం. అంత ఓపిక, అవసరం ఆయనకు లేదు.
ఒక్కటి మాత్రం చెప్పుకోదగ్గ మంచి విషయం ఉంది. ఈయన పేరు మీద ఒక రక్త శిబిరం ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు ఈ మాత్రమైనా సమాజానికి సేవ చేస్తున్నందుకు అభినందించాల్సిందే.
మరి వీరు కపూర్ ఫ్యామిలీ తో ఎలా పోల్చుకుంటారు?? అత్యధిక సంఖ్యలో సినీ హీరో లు వీరి ఫ్యామిలీ నుండి ఉన్నారన్న పాయింటుతో గిన్నీస్ రికార్డులకెక్కాలనుకున్నా ఓకే గానీ కపూర్ ఫ్యామిలీతో పోలిక అనవసరనం.
– భాస్కర్ కిల్లి.