చిత్రం: ఈగల్
రేటింగ్: 1.5/5
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి తదితరులు
కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, కమిల్ ప్లోకి, కర్మ్ చావ్లా
ఎడిటింగ్: కార్తిక్ ఘట్టమనేని
కథ: కార్తిక్ ఘట్టమనేని
సంగీతం: దవ్జాంద్.
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
దర్శకత్వం: కార్తిక్ ఘట్టమనేని
విడుదల: 9 ఫిబ్రవరి 2024
రవితేజ సినిమా అంటే ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. పెద్ద గ్యాప్ లేకుండా తెర మీదకొస్తూనే ఒక్కోసారి హిట్టు కొడుతూ వెంటనే పెద్ద ఫ్లాపుల్ని కూడా ఇస్తూ వెళ్తుంటాడు. పెద్ద బ్యానర్ మీద వచ్చిన ఈ “ఈగల్” మీద అంచనాలైతే ఉన్నాయి. ఎలా ఉందొ చూద్దాం.
ఒక ప్రాంతానికి చెందిన పత్తి గురించి తెలుసుకున్న జర్నలిస్ట్ (అనుపమ) తన పేపర్లో ఒక చిన్న వార్త రాస్తుంది. దాంతో ప్రధాని కార్యాలయం, ఇంటిలిజెన్స్ విభాగం కూడా అలర్ట్ అయిపోయి ఆ పత్రిక ఆఫీసుపై ఆకస్మిక దాడి చేయిస్తాయి. ఈ ఇబ్బంది తెచ్చినందుకు ఆ జర్నలిస్ట్ ఉద్యోగం కూడా పీకేస్తాడు పత్రికాధినేత. ఇంతకీ ఎందుకీ దాడి? ఎవరి కోసం వెతుకులాట?
ఈగల్ అనబడే సహదేవ్ వర్మ (రవితేజ) పత్తిని పండించె రైతు. ఒక మారుమూల కొండ ప్రాంతంలో గిరిజనుల చేత పత్తిని సాగు చెయించి, బట్టను నెయించి విదేశాలకి ఎగుమతి చేయిస్తూ వాళ్లకి జీవనోపాధి కల్పిస్తాడు. కానీ అతనిప్పుడు దేశంలో లేడు. అతనొక మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ క్రిమినల్. ఒక పత్తి రైతు అలా ఎలా మారాడు అనేది కథ!
కొన్ని సినిమాలను చూస్తే భక్తిగా దండం పెట్టాలనిపిస్తుంది… తీసినవారి ఉన్నత భావాల వల్ల.
కొన్ని చూస్తే మెచ్చుకుంటూ దండేయాలనిపిస్తుంది… దర్శకుల ప్రతిభ కారణంగా.
కొన్నిటిని చూస్తే జాలేస్తుంది…ఆలోచన మంచిదే అయినా వనరులు లేక ఆకట్టుకోలేకపోవడం వల్ల.
ఇంకొన్ని చూసినప్పుడు చిరాకేస్తుంది…ఆలోచనే సరైనది కాకపోవడం వల్ల.
కొన్ని సార్లు చిరాకుతో పాటు విపరీతమైన కోపం కూడా వస్తుంది… అన్నీ ఉండి, అనుభవం ఉండి, పెద్ద నటులుండి, భారీ బ్యానరయ్యుండి నాశిరకం సినిమాని ప్రేక్షకుల మొహాన కొట్టడం వల్ల. ఈ “ఈగల్” ఆ చివరి కోవకు చెందే సినిమా.
అసలు హీరో చేసే పత్తేపారం …అదే.. “పత్తి” వ్యాపారం ఏంటో! సీక్రెట్ గోడౌన్ ఏంటో, అందులో ఆయుధాలేంటో..అతని కోసం ప్రైం మినిస్టర్ ఆఫీస్ రేంజులో వెతుకులాటేంటో…ఇంతకీ అతనెవరో చెప్పడానికి దర్శకుడు ప్రేక్షకుల చేత ముప్పై చెరువుల నీళ్లు తాగించాడు.
సినిమా మొదలైనప్పటి నుంచీ హీరో గురించి ప్రస్తావన రాగానే ప్రతి పాత్ర వణికిపోవడమే సరిపోయింది. అతను ఇంతటి వాడు అంతటి వాడు అని కాలం చెల్లిన బిల్డప్పు డైలాగులతోనే 40 నిమిషాలు గడిచిపోయాయి. అతనొక రూత్లెస్ అస్సాసిన్ అని ఒకడు, బ్లడ్ ఈటర్ అని ఇంకొకడు, షార్ప్ షూటర్ అని మరొకరు, రూత్లెస్ డెవిల్ అని వేరొకడు…ఇలా రకరకాల బిరుదులతో హీరోని పరిచయం చేస్తూనే ఉంటారు. సినిమా మొత్తంలో హీరో చేసిన పనేమిటి అని అడిగితే గుర్తొచ్చేది ఒకటే..పిట్టలదొరలాగ తుపాకి పేల్చడం! అంతకు మించి చేసిందేమీ లేదు.
దర్శకుడు ఈ కథని చెబితే రవితేజ ఒప్పుకున్నాడో అర్ధం కాదు. తెలిస్తే అది నిజంగా ఆసక్తిదాయకమైన కేస్ స్టడీ అవుతుంది. కంగాళీ కథ చెప్పి హీరోని, నిర్మాతని ఎలా బుట్టలో వేసుకోవచ్చో చెప్పే పాఠం అవుతుంది.
అసలీ కథని సినిమాగా తీయడం కరెక్టని పీపుల్స్ మీడియా లాంటి బ్యానర్ ఎలా నమ్మిందో కూడా బోధపడదు.
రవితేజ కెరీర్లో చాలా ఫ్లాపులుండొచ్చు కానీ ఇంత దయనీయమైన సినిమా మరొకటి లేదు.
రవితేజకి ఒక పేరుంది. సినిమా ఎలా ఉన్నా తన ఎనెర్జీతో చివరిదాకా మోయగలడని. కానీ అదేంటో..సహదేవ్ వర్మ పాత్రలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. మొదటిసారిగా రవితేజని చూస్తే నీరసం ఆవహించింది. ఎంతెలా అంటే…రవితేజ సినిమాలకి తొలి రోజు తొలి ఆటకి వెళ్లే ఆయన ఫ్యాన్స్ కూడా తర్వాతి సినిమాకి రాకపోవచ్చు. ఆ రేంజులో ఉంది డ్యామేజ్.
గతంలో “ఏక్ మిని కథ” లో చేసిన కావ్య థాపర్ హీరోయిన్ గా సెకండాఫులో కాసేపు కనిపిస్తుంది. ఉన్నంతలో ఈమె కాస్త ఊరటనిచ్చింది.
నవదీప్ హీరో పక్కన సైడ్ కిక్ లా ఉంటాడు. ఈ కథకి దిక్కు దిశ లేకపోయినా.. హీరో కాల్చే కాల్చుడికి “నార్త్ ఈస్ట్”, “సౌత్ వెస్ట్” అంటూ వాస్తు దిక్కులు చెప్పే పాత్ర నవదీప్ ది.
అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరొయిన్ కాదు. ఈమెది విషయం తక్కువ హడావిడి ఎక్కువ అనుకునేలాంటి పాత్ర.
మధుబాల కూడా అంతే. అయినదానికి కాని దానికి ఓవర్ రియాక్షన్ ఇస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది.
ఆ మాటకొస్తే ఇందులో ప్రతి క్యారెక్టర్ అవసరానికంటే ఎక్కువగా రియాక్టవుతూ నాన్ సింక్ ధోరణిలో ప్రవర్తిస్తుంటుంది.
అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, శివనారాయణ, మిర్చి కిరణ్ లాంటి నవ్వించగలిగే నటులున్నా వాళ్లు కూడా పొడుకున్నారు. అవును లిటరల్ గా ఒక బండ వెనక పొడుకుని ఉంటారు సెకండాఫులో చాలావరకు. హీరో ఇచ్చే సౌండ్ కి “అది సౌండ్ కాదు హెచ్చరిక. బతకాలనుకుంటే మీరూ పొడుకోండి” అని శివనారాయణ చెబితే మిగిలిన ముగ్గురూ పొడుకుంటారు. నిజానికి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా అదే.
టెక్నికల్ గా చూస్తే కెమెరా వర్క్ బాగుంది. ఆ పని చేసింది కూడా దర్శకుడే.
అలాగే దర్శకుడే ఎడిటర్ కూడా. కథనంలో ఆర్గానిక్ ఫ్లో లేకుండా సీన్లకి ఎఫెక్ట్స్ కలిపి ఒక దాని పక్కన ఒకటి పేర్చినట్టు ఉంది. కార్తిక్ ఘట్టమనేనిలోని ఎడిటర్ తనలోని దర్శకుడిని పూర్తిగా మింగేసాడు.
సంగీతం అస్సలు బాగోలేదు. పాటలు నీరసంగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పేలవంగా ఉన్నాయి.
ఈ సినిమా చూసాక అనుభూతి ఎలా ఉందో చెప్పాలంటే…ఏదో కలతనిద్రలో అర్ధం పర్ధం లేని కలగన్నట్టు, సబ్-టైటిల్స్ లేని పరభాషా చిత్రం చూసిన్నట్టు, ఐదో తరగతి పిల్లవాడు ఎమ్మే ఫిజిక్స్ క్లాసులో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అతనెవరో చెప్పినట్టు ఈ సినిమా అర్ధం కావాలంటే మినిమం ఐ.ఏ.ఎస్ అయ్యుండాలేమో!
“మెచ్యూరిటీ లేకపోతే ఈ కథ అర్ధం కాదు” అని ఒక పాత్ర ఇంకో పాత్రతో అంటుంది. కానీ అది ప్రేక్షకులతో అన్నట్టే ఉంది.
అలాగే 53 నిమిషాల సినిమా అయ్యాక, “ఇప్పటి వరకు చూసినవి సంఘటనలు మాత్రమే. కథ కాదు…” అని ఇంకో డైలాగ్! అంటే గంటైనా సినిమాలో కథ మొదలవ్వలేదనేగా! ఆ తర్వాత కూడా మొదలైన ఫీలింగ్ రాదు. అది వేరే సంగతి.
ఇక డైలాగ్ రైటింగైతే అత్యంత దారుణమనే చెప్పాలి. వెనుక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినంత మాత్రాన దిక్కుమాలిన డైలాగ్ గొప్ప డైలాగైపోదు. ఏ డైలాగ్ లెంగ్త్ ఎంత వరకు ఉండాలి, ఏ మాట అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనే కనీసమైన తూకం కూడా లేని అన్-ప్రొఫెషనల్ రచన ఇది.
ఇంటర్వల్ కార్డ్ పడే ముందు “డేంజర్” బోర్డ్ చూపిస్తాడు రవితేజ. అది చూసి చాలా మంది తెలివైన ప్రేక్షకులు ఇంటర్వల్ తర్వాత వెనక్కి రాలేదు. మెంటల్ స్టామినా బాగా ఉన్నవారు, వృత్తి రిత్యా తప్పని సమీక్షకులు ద్వీతీయార్ధపు మానసిక వేదనకి సిద్ధమై వచ్చారు. అనుభవించారు.
“ఈగల్ మనల్ని కూడా ఎక్కడో అక్కడి నుంచి చూస్తుంటాడు” అనే లైన్ తో సినిమా ముగుస్తుంది. దాంతో ఏ మూలనుంచి తుపాకితో దాడి చేస్తాడో అనే భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి.
ఇది ముమ్మాటికీ అశ్రద్ధతో, అతి తెలివితో ప్రేక్షకుల మీద చేసిన దాడి. పైగా దీనికి “యుద్ధకాండ” పేరుతో సీక్వెల్ కూడా ఉందట. బహుశా వచ్చే మార్గశిరం అర్ధరాత్రి విడుదల చేసుకుంటారేమో!
బాటం లైన్: గ్రద్ద పొడిచేసింది