బ్రేక‌ప్, విడాకుల‌కు అస‌లు కార‌ణాలు ఇవే!

సెల‌బ్రిటీల్లో కావొచ్చు, సామాన్యుల్లో కావొచ్చు.. ఈ రోజుల్లో విడిపోవ‌డం, బ్రేక‌ప్, విడాకులు అనే మాట‌లు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటాయి. 75 యేళ్ల కింద‌ట విడాకుల చ‌ట్టం తేవ‌డ‌మే పాపం అనుకున్న ఈ దేశంలో ఇప్పుడు…

సెల‌బ్రిటీల్లో కావొచ్చు, సామాన్యుల్లో కావొచ్చు.. ఈ రోజుల్లో విడిపోవ‌డం, బ్రేక‌ప్, విడాకులు అనే మాట‌లు త‌ర‌చూ వినిపిస్తూ ఉంటాయి. 75 యేళ్ల కింద‌ట విడాకుల చ‌ట్టం తేవ‌డ‌మే పాపం అనుకున్న ఈ దేశంలో ఇప్పుడు ఆ చ‌ట్టం మ‌రింత వేగంగా ప‌ని చేసి, సెటిల్ చేయాల‌నుకునే త‌త్వం పెరిగింది.

పెళ్లైన రెండు మూడు నెల‌ల్లోనే విడిపోయామ‌ని చెప్పే వాళ్లు న‌గ‌ర జీవితంలో, ఆఫీసుల్లో క‌నిపించ‌డం వింత కాకుండా పోయింది. మ‌రి ఇంత‌కీ ఈ బ్రేక‌ప్ ల‌కు, విడాకుల‌కు, విడిపోవ‌డాల‌కూ కార‌ణాలు ఏమిటంటే.. మారిన నాగ‌రిక‌త అనే మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటాయి. మ‌రి నాగ‌రిక‌త మార‌డం అంటే.. మ‌నుషుల ఆలోచ‌నా తీరు మార‌డ‌మే అని చెప్పాలి! మారిన పోక‌డ‌ల్లో భాగంగా.. ఆలోచ‌నా తీరు కూడా మారింది, ఫ‌లితంగా క‌లిసి కాపురం చేయ‌డం క‌ష్ట‌మ‌నే భావ‌న‌కు తేలిక‌గా వ‌స్తూ ఉండొచ్చు. మ‌రి ఇంత‌కీ అలా ప్ర‌భావితం చేస్తున్న అంశాలు ఏవంటే.. దానికి రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ కూలంక‌మైన విశ్లేష‌ణ‌ల‌ను అందిస్తారు. ప్ర‌త్యేకించి అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డ‌మే విడిపోవ‌డాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వారు చెబుతారు.

ప‌ర్ఫెక్ట్ గా ఉండాల‌నే అంచ‌నాలు!

తమ భాగ‌స్వామి లేదా తాము ప్రేమించిన వారు ప్ర‌తి విష‌యంలోనూ ప‌ర్ఫెక్ట్ గా ఉంటార‌నే అంచ‌నాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఏ మ‌నిషీ అన్నింటా ప‌ర్ఫెక్ట్ గా ఉండ‌లేడ‌నే అంశాన్ని అర్థం చేసుకోవ‌డానికి ప‌రిణ‌తి ఉండాలి. ఆ ప‌రిణ‌తి సాధించేలోపే రిలేష‌న్ లో ఇలాంటి అంచ‌నాల‌ను ఏర్ప‌రుచుకుని భంగ‌ప‌డే వారు, ప‌ర్ఫెక్ష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల విడిపోవ‌డంలో జ‌రుగుతుంటుంద‌ట‌!

అర్థం చేసేసుకుంటార‌నే అంచ‌నాలు!

తాము ఇన్ డైరెక్ట్ గా చెప్పినా, ఇన్ డైరెక్ట్ గా వ్య‌వ‌హ‌రించినా పార్ట్ న‌ర్ అర్థం చేసేసుకుని త‌మ‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే అంచ‌నాలు కూడా చాలా మందికి ఉంటాయ‌ట‌! పార్ట్ న‌ర్ ఆ రీతిన అర్థం చేసుకోలేన‌ప్పుడు వ్య‌తిరేక భావ‌న‌లు పెంపొందించుకుని విడిపోయే ఆలోచ‌న చేసే వారున్నార‌ట‌!

పూర్తీ ఏకీభావం ఉంటుంద‌నే అంచ‌నాలు!

త‌ను ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. త‌న పార్ట్ న‌ర్ అందుకు పూర్తి ఏకీభావంతో ఉంటుంద‌ని, ఉండాల‌ని అనుకునే వారు కూడా ఉంటారు! వివాహం చేసుకున్నాం కాబ‌ట్టి.. త‌మ పార్ట్ న‌ర్ తామేం చెబితే అది చేస్తుంద‌ని, చేయాల‌నే ఆలోచ‌న‌తో వీరు ఉంటారు. అలా జ‌ర‌గ‌న‌ప్పుడు వీరు తీవ్రంగా నిరాశ చెందుతారు. తమ అంచనాలు, తాము అనుకుంటున్న‌దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించే పార్ట్ న‌ర్ ను వీరు స‌హించ‌లేక‌పోవ‌చ్చు!

మార‌తార‌నే అంచ‌నాలు!

ఒక‌వేళ త‌మ పార్ట్ న‌ర్ తో త‌మ‌కు న‌చ్చ‌ని లక్ష‌ణాలు క‌నిపించినా, వారిని తాము మార్చుకోగ‌ల‌మ‌నే అంచ‌నాల‌తో మ‌రికొంద‌రు ఉంటారు. తాము చెబితే మార‌తార‌ని, త‌మ కోసం మారతార‌నేవి వీరి అంచ‌నాలు. మ‌రి ఆ అంచ‌నాలకు అనుగుణంగా పార్ట్ న‌ర్ మార‌క‌పోతే వీరు బాగా ఇబ్బందికి గుర‌వుతారు. తాము చెప్పినా మార‌డం లేద‌నేది వీరిని బాగా అస‌హ‌నానికి గురి చేయ‌వ‌చ్చు!

అటెన్ష‌న్, టైమ్ అంచ‌నాలు!

త‌మ పార్ట్ న‌ర్ కాబ‌ట్టి.. త‌ను మ‌రే ధ్యాస లేకుండా త‌మ గురించే ఆలోచించాల‌ని, త‌మ‌తోనే టైమ్ స్పెండ్ చేయాల‌ని, వేరే వ్యాపాకాల‌ను పెట్టుకోకుండా టైమ్ అంతా త‌మ‌తో గ‌డ‌పాల‌నే అంచ‌నాల‌తో మ‌రికొంద‌రు ఉంటారు. ఇలా టైమ్, అటెన్ష‌న్ త‌మ‌పై వెచ్చించ‌లేని మ‌నిషితో తాము వేగ‌ల‌మ‌నే భావ‌న‌తో విడిపోయే ఆలోచ‌న చేసేర‌కం వీరిలో కొంద‌రు ఉండ‌వ‌చ్చు!

త‌న స‌మ‌స్య‌ల‌ను తీర్చేస్తార‌నే అంచ‌నాలు!

జీవితంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల‌కు పార్ట్ న‌ర్ ద్వారా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌నే అంచ‌నాల‌తోనూ కొంద‌రు ఉండ‌వ‌చ్చు. పార్ట్ న‌ర్ రావ‌డంతో అంత వ‌ర‌కూ తాము ప‌డ్డ ఇబ్బందులు తీరిపోతాయ‌ని, లేదా వాటిని పార్ట్ న‌ర్ కంప్లీట్ గా ప‌రిష్క‌రించేస్తాడ‌నే అంచ‌నాల‌తో ఉన్న వారికీ ఆ అంచ‌నాలు ఫ‌లించ‌డ‌మ ముఖ్య‌మే!

సెక్సువ‌ల్ అంచ‌నాలు!

పెళ్లితో సాక‌రం అయ్యే శృంగారం విష‌యంలో కూడా అంచ‌నాలు పెట్టుకుని ఉండ‌వ‌చ్చు. ఇవి దీర్ఘకాలం పాటు ఉండే అంచ‌నాలు కూడా కావొచ్చు! అలాంటి అంచ‌నాలు అనుభ‌వంలోకి రాక‌పోవ‌డం కూడా నిరాశ‌ను క‌లిగించే అంశ‌మే! ఇవి కూడా విడాకుల‌కు ప్ర‌ముఖ‌మైన కార‌ణాలే!

అతిగా ప్రేమ‌ను ఆశించ‌డం!

త‌మ పార్ట్ న‌ర్ క‌ల‌లో కూడా త‌మ గురించే స్వ‌ప్నాల‌ను క‌లిగి ఉండాల‌నే తీరునా కొంద‌రు ఉంటారు. పార్ట్ న‌ర్ త‌మ‌ను విప‌రీతంగా ప్రేమించాల‌నే అంచ‌నాలు వీరివి!

సామాజిక‌మైన ప‌రిస్థితులు, సినిమాలు, సాహిత్యం, సొంత ఆలోచ‌నాలు, మాన‌వ స‌హ‌జ‌మైన కోరిక‌ల ఫ‌లితంగా ఏర్ప‌డే అంచ‌నాలు ఇవ‌న్నీ. ఇలాంటి అంచనాలు అంద‌రికీ ఉండొచ్చు! అన్ని అంచ‌నాలూ క‌లిపి ఒక‌రికే ఉండొచ్చు. కొంద‌రి విష‌యంలో ఈ అంచ‌నాల‌న్నీ కార్య‌రూపం దాల్చ‌వ‌చ్చు. వారు నిస్సందేహంగా హ్య‌పీ! అయితే పెట్టుకున్న అంచ‌నాల్లో కొన్ని అందుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డం వ‌ల్ల నిరాశ చెంద‌డం మ‌రి కొంద‌రి ప‌ని కావొచ్చు. అయితే అంచ‌నాలు ఎన్ని ఉన్నా.. వాటి విష‌యంలో ప‌రిణ‌తి ఉంటే మాత్రం ఏ స‌మ‌స్యా ఉండ‌దు!