జనవరి నెల సినిమాల్ని సంక్రాంతికి ముందు, సంక్రాంతి తర్వాతగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏటా సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ నెలలో డామినేషన్ కూడా దాదాపు అందులో ఓ సినిమాదే ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో కూడా అదే సీన్ రిపీట్ అయింది.
సంక్రాంతికి ఎప్పుడు సినిమాలు సిద్ధమైనా, అంతకుముందు వారం బాక్సాఫీస్ డల్ గా కనిపిస్తుంది. అది సహజం. ఈ జనవరిలో కూడా మొదటివారం అదే పరిస్థితి. రాఘవరెడ్డి, సర్కారునౌకరి, ప్రేమకథ లాంటి సినిమాలు వచ్చాయి.
వారం రోజులు ఆడినా చాలు అనుకునే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా సర్కారు నౌకరి. సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు ఇందులో హీరోగా నటించాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బ్యాకప్ తో వచ్చిన ఈ సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ, రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడం మైనస్ అయింది.
ఇక ఆ తర్వాత వారం బాక్సాఫీస్ మొత్తం స్తబ్దుగా మారింది. ఎందుకంటే, అప్పటికే సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకుల వెయిటింగ్ తారాస్థాయికి చేరడంతో పాటు, టాలీవుడ్ లో కొన్ని వివాదాలు కూడా ప్రేక్షకుల దృష్టిని మరల్చాయి. అలా సుదీర్ఘ నిరీక్షణ మధ్య గుంటూరుకారం, హనుమాన్ సినిమాలతో సంక్రాంతి బాక్సాఫీస్ గ్రాండ్ గా ఓపెన్ అయింది.
పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ఈ రెండు సినిమాలు సందడి చేశాయి. వీటిలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరుకారం సినిమాపై భారీ అంచనాలుండేవి. ఆ అంచనాలకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగా థియేటర్ల కేటాయింపు జరిగింది. ఎంతలా అంటే, హనుమాన్ సినిమా కోసం అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లలో కూడా గుంటూరుకారం వేసేంతలా మేనియా అల్లుకుపోయింది.
అలా అతి భారీగా రిలీజైన గుంటూరు కారం సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఆశించిన స్థాయిలో లేదంటూ, స్వయంగా హీరో ఫ్యాన్స్ నుంచి పెదవి విరుపులు వచ్చాయి. అదే టైమ్ లో హనుమాన్ సినిమా అద్భుతంగా ఉందనే టాక్ కూడా బయటకొచ్చింది.
ఇలా ఓ పెద్ద సినిమాకు నెగెటివ్ టాక్ రావడం, చిన్న సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఒకేసారి జరిగిపోయాయి. అయినప్పటికీ భారీ రిలీజ్, స్టార్ పవర్ కారణంగా, సినిమా బాగాలేదంటూనే జనం మహేష్ బాబు మూవీని చూశారు. అలా సంక్రాంతి బరిలో గుంటూరు కారం సినిమా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. వసూళ్లనే కొలమానంగా తీసుకుంటే గుంటూరుకారం హిట్. ప్రేక్షకుల అభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకుంటే మాత్రం.. ఇలాంటి కంటెంట్ తో మహేష్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావడం ఏంటనే బాధ మాత్రం అందరిలో ఉంది. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి నిష్ణాతుడి సినిమాలో ఉండాల్సిన కంటెంట్ కాదిది. దీనికితోడు ఫ్యామిలీ సినిమాను పక్కా మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేయడం కూడా పెద్ద మైనస్ గా మారింది.
అదే టైమ్ లో హనుమాన్ సినిమాపై ఒక్కటంటే ఒక్క కంప్లయింట్ లేదు. తక్కువ అంచనాలతో సినిమా చూసిన జనం, హనుమాన్ లో కొన్ని ఎపిసోడ్స్ కు ఫ్లాట్ అయ్యారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విషయంలో బ్లాక్ బస్టర్ అనే పదం కూడా చాలా చిన్నది. సంక్రాంతి సినిమాల చరిత్ర తీస్తే, పెట్టిన బడ్జెట్ కు వచ్చిన వసూళ్లకు లెక్కలేసుకొని చూసుకుంటే, హనుమాన్ సినిమాది అత్యంత భారీ విజయం. కనీవినీ ఎరుగని ప్రభంజనం ఇది. ప్రస్తుతం గుంటూరుకారం కంటే ఎక్కువ స్క్రీన్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోన్న సినిమా హనుమాన్.
గుంటూరుకారం, హనుమాన్ వచ్చిన 24 గంటలకే సైంధవ్ సినిమా రిలీజైంది. వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ మూవీ అన్ని ఏరియాస్ నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వెంకటేష్ నుంచి అతడి ఫ్యాన్స్ ఆశించిన కంటెంట్ సైంధవ్ లో లేకపోవడం ఒక ఎత్తయితే.. మితిమీరిన హింస ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసింది. వెంకీ బలమే కుటుంబ ప్రేక్షకులు. వాళ్లు దూరమవ్వడం సైంధవ్ కు పెద్ద దెబ్బ.
ఇక సంక్రాంతి సినిమాల వరసలో చివర్లో వచ్చిన మూవీ నా సామిరంగ. కేవలం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని రికార్డ్ టైమ్ లో సినిమాను పూర్తిచేసి, రిలీజ్ చేశారు. నిజమే ఇది సంక్రాంతి సినిమానే. కాకపోతే సంక్రాంతి విజేత మాత్రం కాదు. రొటీన్ సీన్లు, డైలాగ్స్ ఈ సినిమాను చంపేశాయి. కీరవాణి అందించిన పాటలు క్లిక్ అవ్వకపోవడం మరో మైనస్. అయితే కట్టుదిట్టమైన బడ్జెట్ లో సినిమాను తీసి, పకడ్బందీగా రిలీజ్ చేయడం వల్ల ఈ సినిమా బ్రేక్-ఈవెన్ సాధించింది. సంక్రాంతికి కాకుండా మరో టైమ్ లో వచ్చుంటే ఈ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.
సంక్రాంతికి షెడ్యూల్ అయి, భారీ పోటీ మధ్య వాయిదాపడిన కెప్టెన్ మిల్లర్ సినిమా రిపబ్లిక్ డేకు రిలీజైంది. మంచి వీకెండ్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. ధనుష్ నటించిన ఈ సినిమా తెలుగులో ఫ్లాప్. ఈ మూవీతో పాటు హన్సిక నటించిన 105 సినిమా కూడా ఫ్లాప్ అయింది. మరో 3 సినిమాలది కూడా ఇదే దారి. ఓవరాల్ గా జనవరి నెలలో హనుమాన్ సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.