‘గాయత్రీ మంత్రం’ అసలు తెలుసా పవన్!

పవన్ కల్యాణ్- తెలుగుదేశం పార్టీ ముష్టి వేసినట్టుగా వేస్తే మహదానదంగా స్వీకరించిన 24 సీట్ల గురించి సంబరపడిపోతున్నారు. 24 సీట్లు తీసుకోవడం అనేదే ఒక అద్భుతం అన్నట్టుగా కవరింగ్ చేస్తున్నారు. జెండా సభలో కూడా…

పవన్ కల్యాణ్- తెలుగుదేశం పార్టీ ముష్టి వేసినట్టుగా వేస్తే మహదానదంగా స్వీకరించిన 24 సీట్ల గురించి సంబరపడిపోతున్నారు. 24 సీట్లు తీసుకోవడం అనేదే ఒక అద్భుతం అన్నట్టుగా కవరింగ్ చేస్తున్నారు. జెండా సభలో కూడా ఆయన ఆ తరహా మాటలు వల్లెవేయడం విశేషం. ఆయన 24 సీట్లు మాత్రమే తీసుకున్నందుకు ఒకవైపు పార్టీనాయకులు, కార్యకర్తలంతా ఆగ్రహోదగ్రులై ఉడికిపోతుండగా, వైఎస్సార్ సీపీ నాయకులు ఎద్దేవా చేస్తుండగా.. సభలో కవరింగు చేసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. ‘గాయత్రీ మంత్రం కూడా 24 అక్షరాలే’ అంటూ పవన్ కల్యాణ్ సమర్థించుకున్నారు. హిందువులు ఆధ్యాత్మికంగా గాయత్రీమంత్రాన్ని ఎంత విశిష్టంగా భావిస్తారో.. తనకు దక్కిన సీట్లు అంత విలువైనవని ఆయన భావం కాబోలు.

అయితే ఇక్కడ ప్రజలకు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కాపు కులానికి చెందిన పవన్ కల్యాణ్ కు బ్రాహ్మణ్యం మీద మోజు ఎక్కువ ఉన్నదేమో. తాను జంధ్యం వేసుకుంటానని, నిత్యం గాయత్రి చదువుతానని ఆయన గతంలో వెల్లడించారు. అబ్రాహ్మణులు గాయత్రి చదవకూడదని రూలేం కాదు గానీ.. చదవడంలో దాని పట్ల కాస్త గౌరవం, అవగాహన కూడా పెంచుకోవాలని అనుకోవడం తప్పు కాదు.

తన కులం నిర్దేశించిన నియమం కాకపోయినప్పటికీ, భక్తితో, గౌరవంతో పనిగట్టుకుని రోజూ గాయత్రి చదివే పవన్ కల్యాణ్.. ఆ మంత్రంలో కనీసం ఎన్ని అక్షరాలున్నాయో తెలుసుకోకపోతే ఎలాగ? చదివే అందరికీ అక్షరాల లెక్క అందరికీ తెలియాలని రూలేం లేదు. తెలుసుకోకుండా.. ఇన్ని అక్షరాలు ఉన్నాయంటూ సభావేదికమీదినుంచి ప్రకటిస్తే ఎలాగ? గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయంటూ పవన్ చెప్పిన మాటలు.. ఇప్పుడు ఆయన అజ్ఞానాన్నే బయటపెడుతున్నాయి.

పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టునే చదువతాడని అందరూ అంటూ ఉంటారు. చదవడం రూపంలో చాలాసార్లు బయటపడడు గానీ.. ఎవరో రాసిన స్క్రిప్టును బట్టీ పెట్టుకుని వచ్చి అప్పగిస్తాడని మాత్రం చాలా సార్లు దొరికిపోతుంటాడు. కనీసం తనకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులో గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయని ఉన్నప్పుడు.. తాను స్వయంగా ఒకసారి ఆ మంత్రాన్ని చెక్ చేసుకుని ఉండాల్సింది. 

ఓం భూర్భువస్వః
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

అనేది గాయత్రి మంత్రం. ఇందులో ఎలా లెక్కపెట్టినా కనీసం 29 అక్షరాలు ఉంటాయి. మరి గాయత్రిలో 24 అక్షరాలు ఉంటాయి, జనసేనకు 24 సీట్లు దక్కాయి.. ఆ మంత్రం స్థాయి పవర్ ఫుల్ గా మేం ఉన్నాం.. అని వేదిక మీద గప్పాలు కొట్టుకున్న పవన్ కల్యాణ్ కు గాయత్రిలో ఎన్ని అక్షరాలున్నాయో తెలియదా? పోనీ, ఆయనకు తెలియదు, ఎవడో స్క్రిప్టు రాశాడని అనుకుందాం.. వాడికి కూడా తెలియదా? అంత అజ్ఞానులతో స్క్రిప్టులు రాయించుకుని వాటిని వల్లెవేసి.. ఊగిపోతూ మాట్లాడేసి.. పవన్   కల్యాణ్ ఏం సాధించాలని అనుకున్నారు.

అయితే పవన్ కల్యాణ్ గానీ, ఆయన స్క్రిప్టు రచయిత గానీ ఇలా పొరబడడానికి లేదా, ప్రజలకు అంత జ్ఞానం ఎక్కడుందిలే.. వాళ్లు మన మాటలు వింటారు తప్ప.. మన తప్పును గుర్తించేది ఏముంందిలే అనే అహంకారంతో గానీ.. 24 అక్షరాలే అని తేల్చడానికి ఒక కారణం ఉండొచ్చు. 

గాయత్రిని చతుర్వింశతి గాయత్రి అంటారు. అంటే దాని అర్థం గాయత్రిలో 24 అక్షరాలు ఉంటాయని కాదు. ఆ మంత్రంలోని 24 అక్షరాలతోపాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుందని చెబుతారు. అయితే ఆ 24 అక్షరాలను దేవతా మూర్తులతో ఉండే సంబంధాన్ని తెలియజేయడం అనేది ‘తత్సవితుర్వరేణ్యం..’ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ ప్రారంభిస్తే మంత్రంలో ఉండేది 24 అక్షరాలు మాత్రమే. కానీ.. అది పూర్తిమంత్రం కాదు కదా. దానికి ముందు ‘ఓం భూర్భువస్వః’ అనే వాక్యం ఉంటుంది.

ప్రధానమైన మంత్రంలో అది భాగంకాదని దానిని ఇగ్నోర్ చేయవచ్చునని డబాయించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. ‘ఓం భూర్భువస్వః’ అనేదానికి అర్థం.. ‘సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు), చిత్ స్వరూపుడు (జ్ఞానస్వరూపుడు), ఆనంద స్వరూపుడు (దుఃఖ రహితుడు) అయిన సర్వరక్షకుడు పరమేశ్వరుడు’ అని!

ఆ తరువాత ‘తత్’ అనగానే ‘అలాంటి లక్షణాలతో కూడిన’ అని రెండో వాక్యం మొదలవుతుంది. అలాంటప్పుడు మంత్రంలోని మొదటి పంక్తిని ఇగ్నోర్ చేయడం సాధ్యం కాదు. గాయత్రికి చతుర్వింశతి (24) గాయత్రి అని పేరు ఉండవచ్చు గానీ, ఆ మంత్రంలో 24 అక్షరాలు మాత్రమే ఉంటాయనేది తప్పు. వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి 24 అక్షరాలతో 24వేల శ్లోకాల రామాయణం రాశారని చెబుతారు. దానిని సాకుగా చూపి గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయనడం తప్పు. 

తెలుగుదేశం విదిలించిన సీట్లను పుచ్చుకుంటూ.. తన గతిలేనితనాన్ని అవమాన భారాన్ని కప్పిపుచ్చుకోవడానికి గాయత్రీమంత్రాన్ని అడ్డు పెట్టుకుని అక్షరాలతో పోల్చడం పవన్ కల్యాణ్ కు పద్ధతి కాదు. ఈ వ్యవహారం గాయత్రి అని పిలుచుకునే యజ్ఞోపవీతాన్ని అడ్డు పెట్టుకుని అప్పులు ఎగ్గొట్టడానికి ప్రమాణాలు చేసే గురజాడ వారి కన్యాశుల్కం హీరో గిరీశాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంది.