ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని గద్దె దించడం ఒక్కటే లక్ష్యంగా.. ‘జెండా’ పేరుతో తెలుగుదేశం- జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన తాడేపల్లి గూడెం సభ ఆద్యంతం నేతలు రంకెలు వేయడంతో దద్దరిల్లిపోయింది.
పవన్ కల్యాణ్ తమ పార్టీని ముంచబోతున్నాడో.. తేల్చబోతున్నాడో క్లారిటీ లేని స్థితిలో చంద్రబాబునాయుడు, జగన్ మీద విషం కక్కడం మినహా తన బతుక్కి ఇంకో లక్ష్యం లేదన్నట్టుగా పవన్ కల్యాణ్ తమ ప్రసంగాలను పూర్తి చేశారు.
మరి ఈ ఉభయపార్టీల పొత్తుబంధానికి ఎంతో కీలకమైన ఈ బహిరంగ సభలో, చంద్రబాబు వారసుడిగా ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించడానికి ఇప్పటినుంచే రెడీ అవుతున్న చినబాబు నారా లోకేష్ ఏడీ? ఎక్కడ? ఆయన కనిపించలేదు ఎందుకు? నోరు తెరిస్తే చాలు.. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ ప్రజల్ని ఎంటర్టైన్ చేసే చినబాబు ప్రసంగం లేకుండా పోయింది ఎందుకు? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రప్రజల ఎదుట ఉన్నాయి. లోకేష్ ఎందుకు రాలేదు.. అనే చర్చ పార్టీలో కూడా నడుస్తోంది. ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.
సీఎంగా ఎప్పటికీ చంద్రబాబునాయుడు మాత్రమే ఉంటారంటూ.. పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కల్యాణ్ కు సీఎం ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని సంకేతాలివ్వడం ద్వారా నారా లోకేష్ గతంలో కీలక ప్రకటన చేశారు. ఈ మాటల పట్ల పవన్ కల్యాణ్ తీవ్రమైన అసంతృప్తికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన బహిరంగ వేదికమీదనే ప్రకటించారు కూడా.
నారా లోకేష్ సీఎం సీటు గురించి మాట్లాడినప్పుడు కోపం వచ్చినా సరే.. జగన్ ను ఓడించడం కోసం ఆ పార్టీతో కలిసి ఉన్నానంటూ పవన్ సెలవిచ్చారు. అయితే.. జెండా అనే తాడేపల్లి గూడెం సభావేదిక మీద నారా లోకేష్ ఉండడానికి వీల్లేదని పవన్ కల్యాణ్ ముందే పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. పవన్ పట్టుపట్టడం వల్లనే.. లోకేష్ ను ఈ సభకు దూరం పెట్టారని అంటున్నారు.
వేదికమీద చంద్రబాబునాయుడు, లోకేష్ ఇద్దరూ ఉంటే.. తనను లోకేష్ తో సమానమైన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారని, చంద్రబాబు ఒక్కడే ఉంటే తనను ఆయనతో సమానమైన నాయకుడిగా ప్రజలు భావిస్తారని పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు కూడా ఇప్పుడు.. పవన్ కల్యాణ్ ఎలా ఆడిస్తే అలా ఆడే స్థితిలో ఉన్నారు. ఆయన మాటకు ఎదురుచెప్పేంత సీను లేదు. ఆయన ద్వారా రాగల కాపు ఓటు బ్యాంకును దూరం చేసుకునేంత ధైర్యం లేదు. అందుకే పవన్ నిబంధన పెట్టగానే, కొడుకు నారా లోకేష్ ను పక్కన పెట్టేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ – నారా లోకేష్ ల మధ్య సీఎం సీటు గురించిన మాటల వివాదాలు.. ముందుముందు కూడా ఈ పొత్తు పార్టీల ప్రచార సభలపై ప్రభావం చూపిస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.