పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటుచేస్తే, 'భోజనంతో చంపేస్తారా ఏంటి..' అంటూ సరదాగా జోక్ చేయడం కామన్. కానీ ఇక్కడ పెట్టే రుచులన్నీ ట్రై చేస్తే మాత్రం నిజంగానే చచ్చిపోతామేమో అనిపిస్తుంది. అవును.. ఒకటి కాదు, రెండు కాదు.. 100 కాదు, 200 కాదు.. ఏకంగా 2500 రకాల రుచులతో మెనూ ఏర్పాటుచేశారు.
అవును.. మీరు విన్నది నిజమే. ఏకంగా 2500 రకాల వంటకాలతో మెనూ సిద్ధమైంది. కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి వేడుకల్లో భాగంగా 1 నుంచి 3వ తేదీ వరకు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటుచేశారు.
గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ ప్రీ-వెడ్డింగ్ పార్టీ కోసం సర్వహంగులు సిద్ధం చేశారు. ఈ వేడుకలోనే ఆహుతులకు 2500 రకాల ఆహార పదార్థాల్ని వడ్డించబోతున్నారు. ఇండోర్ నుంచి ప్రత్యేకంగా 25 మంది ఛెఫ్ లను రప్పించి ఈ వంటకాల్ని సిద్ధం చేయిస్తున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాల రుచుల్ని సిద్ధం చేయబోతున్నారు. ఇక మధ్యాహ్న భోజనం కోసం 250 రకాలు, డిన్నర్ కోసం మరో 250 రకాలతో మెనూ సిద్ధం చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో ఏ ఒక్క ఆహార పదార్థం రిపీట్ అవ్వదంట.
దీనికితోడు మిడ్-నైట్ స్నాక్స్ పేరిట ఏర్పాటు చేయబోతున్న కౌంటర్, మొత్తం వేడుకకే హైలెట్ అవుతుందని చెబుతున్నారు ఇండోర్ ఛెఫ్స్. ఇక ప్రాంతాలవారీగా చూసుకుంటే.. ప్రపంచంలోని అన్ని ప్రముఖ వంటకాలు మెనూలో కవర్ అవుతాయంట. ఇండియన్, ఏషియన్ కాంటినెంటర్, మెడిటేరియన్, స్పానిష్, జపనీస్, చైనీస్.. ఇలా సమస్తం ఈ మెనూలో ఉంది. నిజంగా ఇన్ని రుచుల్ని 3 రోజుల్లో ఎవరైనా టేస్ట్ చేయగలరా..?