నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం రాజకీయ నాయకులకు గుణపాఠం నేర్పుతోంది. రాజకీయాల్లో ఎలా వుండకూడదో రఘురామ ఎపిసోడ్‌ను ఒక పాఠంగా చేర్చొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇంతకాలం తిడుతుంటే, గంటల తరబడి చూపిన చానళ్లు, పేజీలకు పేజీలు ప్రచురించిన ఎల్లో పత్రికలు, ఇప్పుడాయన విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో కళ్లెదుటే ప్రత్యక్ష సాక్ష్యం.
కాదనుకుండా చంద్రబాబు రాజగురువు పత్రిక రామోజీ ఆవేదనను అక్షరీకరించింది. దాని తోక పత్రిక మాత్రం రఘురామను లైట్ తీసుకోవడం గమనార్హం. రాజకీయాల్లో అవసరానికి మించి మాట్లాడితే, చివరికి ఏమవుతుందో రఘురామ రాజకీయ పంథా అనేక గుణపాఠాలు నేర్పుతోంది. రఘురామే కాదు, రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎక్కువ మాట్లాడితే సమాజ గౌరవానికి నోచుకోరు.
వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో ఇష్టానుసారం మాట్లాడే నేతలు చాలా మంది ఉన్నారు. కొందరు జగన్ కేబినెట్‌లో చోటు కూడా దక్కించకున్నారు. అయితే రఘురామకృష్ణంరాజు త్వరగా పతనావస్థకు చేరుకుంటూ వుండొచ్చు. ఇతరులకు మరికొంత సమయం పట్టొచ్చు. ముందూ, వెనుకా… కాస్త సమయం పట్టొచ్చే కానీ, ప్రజల్లో విలువ కోల్పోవడం మాత్రం గ్యారెంటీ.
రఘురామకృష్ణంరాజే పెంచి పోషించిన మరో యూట్యూబర్ ఉన్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్‌ను ఇష్టానుసారం తిడుతూ వుండేవారాయన. దీంతో ఆయనకు పి.గన్నవరం సీటును చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో అంతకు మునుపు అతను సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్, హిందూ దేవతలు, అలాగే అగ్రవర్ణ అమ్మాయిలను ఎత్తుకొస్తే రక్షణ ఇవ్వడంతో పాటు లక్ష రూపాయిలు బహుమానంగా ఇస్తాననే కామెంట్స్… ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి వీడియోలు బయటికొచ్చాయి. సీన్ కట్ చేస్తే.. ఆయనకు టికెట్ కట్. ప్రస్తుతం ఆ బాధ నుంచి రఘురామ శిష్యుడు కోలుకోలేకున్నాడు.
రఘురామ పెంచి పోషిస్తున్న మరో మీడియా పులి కొలికపూడి శ్రీనివాస్. ఎల్లో చానళ్లలో కూచుని జగన్‌ను తిట్టడమే ఈయనకు టికెట్ దక్కడానికి ఏకైక అర్హత. పైగా మీడియా యజమానుల కోటాలో టికెట్ ఇచ్చారట. ప్రస్తుతం ఈయన ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీ అభ్యర్థి. బాబోయ్ ఇతన్ని భరించలేకున్నామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు.
రఘురామకృష్ణంరాజు ప్రస్తుత పరిస్థితికి వస్తే… కూటమి పార్టీలేవీ తనకు టికెట్ ఇవ్వలేదని వాపోతున్నారు. జగన్‌పై పోరాటం చేయడమే తనకు శాపంగా మారిందని అంటున్నారు. జగన్‌పై ఇంత వరకూ ఒక్క మాట కూడా మాట్లాడని నేతలకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు టికెట్లు ఇచ్చాయని రఘురామే చెబుతున్నారు. జగన్‌ను తిట్టాలని ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా తనకు చెప్పాయా? అని రఘురామ ఒకసారి తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. జగన్‌ను తిట్టాలనేది కేవలం తన నిర్ణయమే. దాని పర్యవసానాలను తానే ఎదుర్కోవాల్సి వుంటుంది. ఇప్పుడు మరెవరినో నిందించడం వల్ల ప్రయోజనం లేదు.
నరసాపురం టికెట్‌ను బీజేపీ తన పార్టీ నాయకుడైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ఇవ్వగానే, రఘురామ ఏపీ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ ధోరణే టీడీపీ, జనసేన అధినేతల్ని భయపెడుతోంది. మొన్నటి వరకు జగన్‌ను, నిన్న ఏపీ బీజేపీ నేతలు, నేడో, రేపో తమను రఘురామ తిట్టడనే గ్యారెంటీ ఏముందని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆలోచించి వుంటారు. అందుకే టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రఘురామ అనే చెత్త, శనిని తమ నెత్తిపై వేద్దామని చంద్రబాబు వ్యూహం రచించారని బీజేపీ నేతలు అంటున్నారు.
అయితే తమ పార్టీ పెద్దలు పసిగట్టి, తప్పించుకున్నారని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. అసలు తనకు టికెట్ దక్కకపోవడానికి ప్రధాన కారకుడైన చంద్రబాబును పొగుడుతూ, మరెవరినో రఘురామ నిందిస్తే లాభం ఏంటి? తనకు ప్రధాన శత్రువు జగనో, మరెవరో కాదని ఇప్పటికైనా రఘురామ గుర్తిస్తే మంచిది. నోరు తనకు శత్రువని గుర్తించాల్సిన అవసరం వుంది. ఐదేళ్లలోనే రాజకీయ ముగింపు కోరి తెచ్చుకోవడం బాధ కలిగించే అంశం. భవిష్యత్‌లో మరింతగా నష్టపోకుండా రఘురామ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అది ఆయన చేతల్లో వుంది. ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకోవడం ఆయన చేతల్లో పని.