మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి రాజకీయ నాటకాలు ఆడడంలో దిట్ట అని కడప జిల్లాలో పేరు. ఇప్పుడు మరోసారి రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఇటీవల ప్రకటించింది. జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి భూపేష్‌ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ ప్రచారంలో ఉన్నారు.
అయితే కడప ఎంపీ అభ్యర్థిగా తాను, జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ పోటీ చేయడానికి అభ్యంతరం లేదని ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇరుపార్టీలు ఆలోచిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆదినారాయణరెడ్డి మాటల్ని కడప జిల్లాలో ఎవరూ నమ్మడం లేదు. దీనికి కారణం ఆయన మాటల్లో నిజాయతీ లేకపోవడమే. ఇదంతా పొలిటికల్ డ్రామాగా కొట్టి పడేస్తున్నారు.
ఆదినారాయణరెడ్డి మాటల వెనుక మర్మాన్ని వైఎస్సార్ జిల్లా ప్రజలు వివరిస్తున్నారు. డిల్లీలో రోజుల తరబడి మకాం వేసి మరీ జమ్మలమడుగు సీటును ఆదినారాయణరెడ్డి దక్కించుకున్నారు. అయితే జమ్మలమడుగులో మూడేళ్లుగా టీడీపీ ఇన్చార్జ్గా భూపేష్ ఎంతో శ్రమిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఎన్నికల సమయంలో వచ్చిన ఆదికి భూపేష్ మద్దతు లేకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరు.
ఓడిపోయే సీట్లో తనను పోటీ చేయిస్తున్నారనే ఆవేదన భూపేష్‌లో వుంది. అలాగే ఆదినారాయణరెడ్డి కోసం భూపేష్‌ను బలిపెడుతున్నారని ఆయన కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర అసహనం, ఆగ్రహం నెలకుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా భూపేష్‌తో పని చేయించుకునేందుకు, తాను కడప ఎంపీగా అయినా సరే అనే మాయ మాటను వదిలేశారనేది వైఎస్సార్ జిల్లా ప్రజల అభిప్రాయం. అందుకే ఆదినారాయణరెడ్డి కామెంట్‌ను ఎల్లో పత్రికలు హైలెట్ చేయలేదనే సంగతిని గుర్తు చేస్తున్నారు.
భూపేష్ గాయంపై ఆదినారాయణరెడ్డి తన మాటలతో ఆయింట్మెంట్ రాసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఆదినారాయణరెడ్డి రాజకీయ స్వభావం తెలిసిన వారెవరూ ఆయన మాటల్ని విశ్వసించడం లేదు. కడప ఎంపీ బరిలో ఆది నిలిచే ప్రశ్నే లేదని అంటున్నారు. భూపేష్‌తో పని చేయించుకోడానికే ఈ మాటల గారడీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.