వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దెబ్బకు టీడీపీ, జనసేన ముఖ్య నాయకులే వణికిపోయారు. నరసాపురం ఎంపీ స్థానం దక్కకపోవడంతో రఘురామకృష్ణంరాజు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆయన ఫైర్ అయ్యారు. కొనసాగింపులో భాగంగా చంద్రబాబుపై కూడా ఆయన మండిపడ్డారు.
తనకు టికెట్ ఇప్పించలేని చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. చివరికి ఆయన అధికారికంగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంతకాలం వైసీపీ ఎంపీ అంటూ, అధికార పార్టీపై రఘురామ చేసే ఘాటు విమర్శలకు ఎల్లో మీడియా విశేష ప్రాధాన్యం ఇచ్చేది. ఇకపై ఆ అవకాశం వుండదు.
ఉండి అసెంబ్లీ సీటు ఆయనకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామ కోసం సిటింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిని కాదని ఇవ్వడానికి చంద్రబాబు ముందుకు వస్తారంటే, ఆశ్చర్యమే. మరీ ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు చేతిలో చంద్రబాబు, లోకేశ్‌కు సంబంధించిన రహస్యాలేవో ఉన్నాయని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే రఘురామ అంటే చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్నారని సొంత పార్టీ నేతల మనోగతం.
రఘురామకు ఒక శాపం వుందని, ఎవరైతే ఆదరిస్తారో వారినే టార్గెట్ చేస్తుంటారనే సరదా చర్చ సాగుతోంది. సరదాగా మాట్లాడుకుంటున్నప్పటికీ, రేపటి నుంచి టీడీపీకి రఘురామ చేతిలో దబిడి దబిడే అని హెచ్చరించక తప్పదు. కనీసం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేని తనకు నరసాపురం ఎంపీ సీటు ఇవ్వలేదని, ఆ పార్టీ పుట్టుపూర్వత్తరాల గురించి ఎలా మాట్లాడారో అందరూ చూశారు. అలాగే తనకు టికెట్ ఇప్పించలేని అసమర్థుడనే అర్థం వచ్చేలా చంద్రబాబుపై కూడా ఫైర్ అయ్యారు.
ఇక సీఎం జగన్ గురించి ఆయన దూషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రఘురామను అనాల్సిన పనిలేదు. ఆయన మనస్తత్వం ఏంటో తెలిసి కూడా అక్కున చేర్చుకున్నారంటే నిజంగా చంద్రబాబు ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే అనే వాళ్లు కొందరైతే, దగ్గరికి తీసుకోకపోతే రహస్యాలు బయట పెడతారనే భయంతోనే పచ్చ కండువా కప్పారనే వారు మరికొందరు.
ఏది ఏమైనా రఘురామ ఓ విలక్షణ, విచిత్ర, వివాదాస్పద నాయకుడు. అలాంటి నాయకుడిని పక్కన పెట్టుకుని రాజకీయం చేయడం అంటే… తినబోతు రుచి చూడడమే. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది.