ఇప్పటికే సంక్రాంతికి అటుఇటుగా అరడజను సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. దిల్ రాజు కాంపౌండ్ నుంచే 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. చిరంజీవి, వెంకటేశ్, రవితేజ సినిమాలు సంక్రాంతికంటూ ప్రకటనలు కూడా వచ్చేశాయి. ప్రభాస్ ఏ నిమిషంలోనైనా వచ్చే అవకాశం ఉందంటూ ఫీలర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తో సినిమాలు తీస్తున్న మేకర్స్ కూడా సంక్రాంతిపై ఆలోచనలో పడ్డారు.
ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. ఇలా పవన్ నటిస్తున్న 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటిలో ఓజీ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాదిలోనే వస్తోంది అది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల రిలీజ్ డేట్స్ రావాల్సి ఉన్నాయి. వీటిలో ఒక సినిమాను సంక్రాంతికి షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి ఈ రెండు సినిమాలు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ అప్పుడప్పుడు చప్పుడు చేస్తోంది కానీ, హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా చతికిలపడింది. త్వరలోనే టీజర్ అంటూ ఏఎం రత్నం ప్రకటించినప్పటికీ, అభిమానులకు నమ్మకం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటన చేస్తే ఎలా ఉంటుందనేది నిర్మాత ఆలోచన.
ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల్లో ఏ మూవీనైనా సంక్రాంతికి విడుదల చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఆ డెడ్ లైన్ అందుకోవాలంటే పవన్ సహకారం చాలా అవసరం. ఆ ‘సహకారమే’ ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఓజీ రిలీజ్ డేట్ ఇచ్చి తప్పుచేశామా అనే ఆలోచనలో పడింది ఆ సినిమా యూనిట్.
ఇలాంటి టైమ్ లో ఉస్తాద్, హరిహర సినిమాల నుంచి రిలీజ్ డేట్స్ వస్తాయా అనేది అందరి అనుమానం. కానీ త్వరలోనే వచ్చే అవకాశం ఉందనేది చాలామంది మాట.