విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ తననుతాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ తుపాకీతో తనకుతానే గురిపెట్టుకొని కాల్చుకున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు అందరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.
ఐవోబీ లో సెక్యూరిటీ గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు శంకర్ రావు. ఎప్పట్లానే ఈరోజు కూడా ఉదయం 5 గంటలకే డ్యూటీకి హాజరయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కూడా విధులకు వచ్చారు. 6 గంటల సమయంలో మిగతా ముగ్గురు బయటకు వెళ్లారు. శంకర్ రావు ఒక్కరే ఉన్నారు.
అప్పటివరకు నార్మల్ గానే ఉన్న ఆయన ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా తుపాకీని నేలపై ఆనించారు. తుపాకీ గొట్టాన్ని తన గుండెలకు అదిమి పెట్టుకున్నారు. ట్రిగ్గర్ అందుతుందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నారు. ఆ వెంటనే ‘భగవంతుడా’ అంటూ గట్టిగా అరుస్తూ ట్రిగ్గర్ నొక్కారు.
అంతే.. క్షణంలో బుల్లెట్ ఆయన గుండెల్లోకి దూసుకుపోవడం, ఆయన మరణించడం రెప్పపాటులో జరిగిపోయాయి. తుపాకీ పేలిన శబ్దం విని మిగతా గార్డులు లోపలకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే శంకర్రావు ప్రాణాలు విడిచారు.
కొన్ని నిమిషాల ముందు వరకు తమతో సాధారణంగా మాట్లాడిన వ్యక్తి, ఒక్కసారిగా ప్రాణాలు తీసుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది చలించిపోయారు. ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది ఇంకా బయటకురాలేదు. శంకర్రావు మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఏడేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురు ఉన్నారు.
ఎన్నికల వేళ కానిస్టేబుల్ ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది. అప్పుడే ఈ ఘటనపై చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.