పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు టికెట్‌కు ఇటీవల పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజు గండికొట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో ఉండి టికెట్‌ను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఖరారు చేసినట్టు ప్రకటించారు.
అంతా ఊహించినట్టే రఘురామకృష్ణంరాజు కోసం ఉండి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు. సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ ఇప్పటికే సీట్లను చంద్రబాబు ఖరారు చేశారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన రఘురామకృష్ణంరాజుకు ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో ఉండిలో రామరాజు టికెట్‌కు రఘురామ, బాబు కలిసి గండి కొట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రామరాజుకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయినప్పటికీ వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా రఘురామ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు.
ఇటీవల చంద్రబాబునాయుడిని కలిసిన మంతెన రామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండి సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటో వెలువడిన తర్వాత తన కార్యాచరణ వుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో ఉండడం ఖాయమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఉండి రాజకీయం ఎలా వుంటుందో అనే చర్చకు తెరలేచింది. టీడీపీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. ఇప్పటికే టీడీపీ రెబల్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇప్పుడు రామరాజు కూడా పోటీలో వుంటే రఘురామ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది.