టికెట్లు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఇవ్వకుండా తమకు నచ్చిన వారికి కట్టబెట్టారు అని ఆగ్రహంతో తమ్ముళ్ళు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తమ్ముళ్ళు అధినాయకత్వం విషయంలో రగిలిపోయారు. అయితే వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు చేపట్టిన చర్యలు సగం వరకే ఫలించాయి.
బాబుని ఆయన విన్నపాలని కాదని దూరంగా ఉన్న వారు ఇప్పుడు ఏమి చేస్తారో అన్న చర్చకు తెర లేచింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం బాబు పిలుపులకు ఏ మాత్రం రియాక్ట్ కాలేదు. సైలెంట్ అయిపోయారు. అదిప్పుడు టీడీపీని కలవరపెడుతోంది.
మరో నేత మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకు పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించినా పాతపట్నంలో ఆయన టీడీపీ అభ్యర్ధితో ప్రచారం చేయడం లేదు అంటున్నారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీకి గట్టి ఝలక్ ఇచ్చి రెబెల్ గా నిలబడ్డారు. ఆమె సత్తా చూపిస్తాను అని అంటున్నారు.
ఇదే జిల్లాలో చాలా మందికి టికెట్లు రాకపోయినా టీడీపీ వారిని బుజ్జగించి దారికి తెచ్చింది. అరకు నియోజకవర్గంలో తొలుత రెబెల్ గా పోటీ అని చెప్పిన దొన్ను దొరను మెల్లగా రాజీ చేసుకున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు అబ్రహం చెప్పిన మాట ప్రకారం ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు. దాంతో మీసలా గీతతో పాటు అబ్రహాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. బుజ్జగింపులకు తగ్గిన నేతలలో కూడా లోలోపల అసంతృప్తి అలాగే ఉంది. దాంతో ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ అయితే పార్టీకి ఉందంటున్నారు.