ఎప్పుడో థియేటర్లలోకి వస్తుందనుకున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయిందని చెబుతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్స్ నడుస్తూనే ఉన్నాయి, లొకేషన్లు మారుతూనే ఉన్నాయి. షూటింగ్ చేస్తూనే ఉన్నారు.
దీంతో గేమ్ ఛేంజర్ పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ నడుస్తోందని అంటున్నారు కానీ, ఈ షెడ్యూల్స్ చూస్తుంటే ప్యాచ్ వర్క్ లా అనిపించడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త షెడ్యూల్స్ మొదలవుతూనే ఉన్నాయి. దీంతో సినిమాను రీషూట్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
నిన్నటికినిన్న హైదరాబాద్ లో 5 రోజుల షూట్ కంప్లీట్ చేశారు. ఎల్బీ స్టేడియం, ఎయిర్ పోర్టులో సన్నివేశాలు తీశారు. ఈరోజు చెన్నైలో మళ్లీ షూట్ మొదలుపెట్టారు. ఇదొక 3 రోజులు ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రాజమండ్రి వెళ్లబోతున్నారు. రాజమండ్రి షెడ్యూలే చివరిదనే ప్రచారం నడుస్తోంది కానీ నమ్మశక్యంగా లేదు.
గేమ్ ఛేంజర్ కు సంబంధించి కేవలం 20శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, దాదాపు 7 నెలల కిందట దిల్ రాజు ప్రకటించాడు. ఇప్పటికీ ఇంకా షూటింగ్ మోడ్ లోనే సినిమా ఉందంటే ఏమనుకోవాలి?
మొన్నటివరకు భారతీయుడు-2 సినిమాతో దీనికి లింక్ ఉండేది, ఆ సినిమా ముందుగా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ కావాలి. ఇప్పుడా సినిమా జూన్ లో రిలీజ్ అవుతోంది. భారతీయుడు-2 సినిమాకు లైన్ క్లియర్ అయినప్పటికీ, గేమ్ ఛేంజర్ కు రిలీజ్ డేట్ ప్రకటించలేకపోయారంటే దానికి కారణం ఏంటి?