అయ్యన్న- దాడి అనూహ్య కలయిక

తెలుగుదేశం పుట్టిన నాటి ఉన్న ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దాడి వీరభద్రరావు. పార్టీలో చూస్తే దాడి కంటే అయ్యన్న సీనియర్. ఆయన 1983 లోనే గెలిచారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో…

తెలుగుదేశం పుట్టిన నాటి ఉన్న ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దాడి వీరభద్రరావు. పార్టీలో చూస్తే దాడి కంటే అయ్యన్న సీనియర్. ఆయన 1983 లోనే గెలిచారు. 1985లో మధ్యంతర ఎన్నికల్లో దాడి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చారు. ఇద్దరూ పక్క పక్క నియోజకవర్గాలైన అనకాపల్లి, నర్శీపట్నాలకు చెందిన వారు.

అయ్యన్న చంద్రబాబు టీంలో ఉంటే దాడి పెద్దల్లుడు దగ్గుబాటి టీం అని చెప్పుకునేవారు. దాడి వరసగా గెలిచి మంత్రి పదవులు అందుకుంటే అయ్యన్న ఏడు సార్లు గెలిచి ఎన్నో కీలక శాఖలు చూసారు. తాజా ఎన్నికల్లో అయ్యన్న గెలవడం విశేషం.

ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత, బీసీలలో స్ట్రాంగ్ లీడర్ గా అయ్యన్న ఉన్నారు. టీడీపీలో ఈ ఇద్దరు నేతల మధ్య ప్రచ్ఛన్న రాజకీయ సమరం దశాబ్దాల పాటు సాగింది అని ప్రచారం సాగింది. అయితే ఆ గ్యాప్ ని సీఎం రమేష్ పూడ్చేశారు. ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడం కాదు కానీ దాడి కొణతాల రామకృష్ణ, అలాగే దాడి అయ్యన్నల మధ్యన విభేధాలు లేకుండా చూడగలిగారు.

దాంతో అనూహ్య పరిణామాలే సంభవిస్తున్నాయి. తాజాగా అకస్మాత్తుగా అయ్యన్న ఇంట్లో దాడి ప్రత్యక్షం అయి అందరినీ ఆశ్చర్యపరచారు. ఈ ఇద్దరు సీనియర్లు చాలా సేపు అనేక విషయాలను ముచ్చటించుకున్నారు. స్పీకర్ కాబోతున్న అయ్యన్నను దాడి అభినందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి మంచి పాలన అందిస్తుందని మాజీ మంత్రులు అభిలషించారు. అయ్యన్నకు ఇప్పుడు టీడీపీలో రాజకీయంగా బాగానే సాగుతోంది. 

ఆయనకు మంత్రి ఇవ్వకపోయినా స్పీకర్ గా ఇచ్చారు. ఆయన వారసుడి బాధ్యతలను కూడా చూసుకుంటామన్న హామీ హై కమాండ్ నుంచి దక్కిందని అంటున్నారు. పార్టీలు మారుతూ వచ్చిన దాడి విషయమే ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. ఆయన టీడీపీలో తనకూ కుమారుడికీ లిఫ్ట్ కోరుకుంటున్నారు. అందుకే సీనియర్ అయిన అయ్యన్నతో భేటీ అయ్యారని అంటున్నారు. అయ్యన్న పార్టీ మారకుండా  తన క్రెడిబిలిటీని కాపాడుకున్న ఫలితమే ఇదంతా అని అంటున్నారు.