ఇట్లైతే వైసీపీ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌దు!

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకోవ‌డం ఆ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేనిది. గౌరవ‌ప్ర‌దంగా ఓడిపోయి వుంటే, ఆ పార్టీ శ్రేణులు కుంగిపోయేవి కావు. కానీ 11 అసెంబ్లీ స్థానాల‌ను మాత్ర‌మే వైసీపీ ద‌క్కించుకుంది.…

ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట క‌ట్టుకోవ‌డం ఆ పార్టీ అభిమానులు జీర్ణించుకోలేనిది. గౌరవ‌ప్ర‌దంగా ఓడిపోయి వుంటే, ఆ పార్టీ శ్రేణులు కుంగిపోయేవి కావు. కానీ 11 అసెంబ్లీ స్థానాల‌ను మాత్ర‌మే వైసీపీ ద‌క్కించుకుంది. గుడ్డిలో మెల్ల అన్న‌ట్టు నాలుగు ఎంపీ స్థానాల్ని ద‌క్కించుకోవ‌డం వైసీపీకి సంతోషాన్ని ఇస్తోంది.

ఘోర ప‌రాజ‌యానికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై పోస్టుమార్టం చేసుకోవాల్సిన స‌మ‌యం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, ఆ పార్టీ నాయ‌కుల‌కు వ‌చ్చింది. నిర్మొహ‌మాటంగా, నిజాయితీగా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై విశ్లేష‌ణ‌లు చేసుకుని, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన స‌మ‌యం ఇదే. అయితే ఓట‌మికి ప్ర‌ధానంగా ఈవీఎంల ట్యాంప‌రింగ్ కార‌ణ‌మ‌ని న‌మ్మ‌డం, దానిపైనే విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డం చూస్తే… ఈ పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌ద‌నే అభిప్రాయాన్ని సొంత పార్టీ నాయ‌కులే ఆవేద‌న‌తో అంటున్నారు.

ఓట‌మిని మొద‌ట హుందాగా అంగీక‌రించాలి. ఐదేళ్ల పాల‌న‌లో తాము తీసుకున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో ఎందుకంత వ్య‌తిరేక‌త వ‌చ్చిందో తెలుసుకోవాలి. అన్ని వ‌ర్గాలు వైసీపీకి వ్య‌తిరేక‌మ‌య్యేంత‌గా తాను చేసిన త‌ప్పులేంటో జ‌గ‌న్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. అప్పుడు మాత్ర‌మే త‌ప్పుల్ని స‌రిదిద్దుకుని, తిరిగి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంది. అలా కాకుండా ఘోర ప‌రాజ‌యానికి ఈవీఎంల ట్యాంప‌రింగే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న పార్టీ నాయ‌కులు న‌మ్మి, వింత వాద‌న చేస్తే… ఇక ఆ పార్టీని దేవుడు కూడా ర‌క్షించ‌లేడు.

ఐదేళ్ల పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో నిబ‌ద్ధ‌త ప‌క్క‌న పెడితే, కొన్ని విష‌యాల్లో చేయ‌కూడ‌ని ఘోరాల‌న్నీ చేశారనేది నిజం. అప‌రిమిత‌మైన అధికారం చేతిలో వుండ‌డంతో క‌ళ్లు నెత్తికెక్కి, తాము చేసిందే చ‌ట్టం అనే రీతిలో వైసీపీ వ్య‌వ‌హ‌రించింద‌నే ఆరోప‌ణ‌ల్లో నిజం లేక‌పోలేదు. అలాంటి వాటిని స‌మీక్షించుకోవాలి. దూర‌మైన వ‌ర్గాల‌కు చేరువ‌య్యేందుకు ఏం చేయాలో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకోవాలి.

కూట‌మి ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇచ్చి, ఆ త‌ర్వాత హామీల‌ను నిల‌బెట్టుకోక‌పోతే నిల‌దీసేందుకు సిద్ధం కావాలి. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే రాజ‌కీయాల్ని రాజ‌కీయంగా కాకుండా, శ‌త్రు భావ‌న‌తో చేసిన ఘ‌న‌త వైసీపీదే. ఇప్పుడు అదే పంథాను టీడీపీ అనుస‌రిస్తోంది. వైసీపీ చేసిన మొద‌టి త‌ప్పు ఇదే అని ఆ పార్టీ మొద‌ట గుర్తించాలి. రాజ‌కీయాల్లో ఏదీ స్థిరంగా వుండ‌దు. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందే వారే రాజు.

అందుకే త‌మ‌ను ఓడించింది ప్ర‌జ‌లే అని, ఈవీఎంలు కాద‌ని వైసీపీ ముందుగా ఒప్పుకోవాలి. గ‌తంలో త‌మ‌కు ఘ‌న విజ‌యం అందించింది కూడా ఈ ప్ర‌జ‌లే అని గుర్తు పెట్టుకోవాలి. కావున ఓట‌మికి నిజ‌మైన కార‌ణాల్ని ప‌క్క‌న పెట్టి, ఈవీఎంల‌పై నెపాన్ని నెట్టేసి, ఇళ్ల‌లో కూచోవాల‌ని అనుకోవ‌ద్దు. తిర‌స్క‌రించిన‌ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఏం చేయాలో జ‌గ‌న్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. ఆత్మ వంచ‌న చేసుకోకుండా, ప్ర‌జాస్వామ్యంలో దేవుళ్లైన ప్ర‌జ‌ల ఆశీస్సులు పొందేందుకు వారి ద‌గ్గ‌రికెళ్లాలి. త‌ప్పిదాల‌కు క్ష‌మాప‌ణ కోరాలి. పూర్వ వైభ‌వం రావాలంటే ఇదొక్క‌టే మార్గం. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డానికి ప‌క్క‌దారులుండ‌వ‌ని జ‌గ‌న్‌కు బాగా తెలుసు. తాను ప్ర‌జానాయ‌కుడిని అని జ‌గ‌న్ గుర్తెరిగి, తిరిగి వారి వ‌ద్ద‌కు వెళ్లేందుకు స‌మాయ‌త్తం కావాలి. అప్పుడే వైసీపీకి భ‌విష్య‌త్‌.