ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కళ్లలో ఆనందం చూసేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ తాపత్రయ పడుతున్నారు. “మనకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేస్తారనే నమ్మకంతో. వైసీపీపై కక్ష తీర్చుకోడానికి కాదు అధికారం. హామీల్ని అమలు చేయాల్సిన పెద్ద బాధ్యత మనపై వుంది ” అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో పవన్‌కల్యాణ్ అన్న మాటలివి.
పవన్‌కల్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావడం ఆయన హుందాతనాన్ని తెలియజేస్తోందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే తన రాజకీయ టార్గెట్‌ను చాపకింద నీరులా పని కానిచ్చేస్తున్నారనే సంగతి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. రాజకీయ వేధింపుల్ని టీడీపీ నేతలు బహిరంగంగా చేస్తుంటే, పవన్‌కల్యాణ్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ఆ పని చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పవన్‌కల్యాణ్ టార్గెట్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. ద్వారంపూడి వ్యాపారాలే లక్ష్యంగా పవన్, నాదెండ్ల మనోహర్ అక్కడికెళ్లి మరీ తమ లక్ష్యాల్ని సాధించుకునేలా కనిపిస్తున్నారు. ద్వారంపూడి ఆక్వా వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు ఆయన కంపెనీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన వ్యాపారాల్ని మూసేవేసే వరకు పవన్‌కల్యాణ్ నిద్రపోయేలా లేరు.
అలాగే చౌకబియ్యం అక్రమ రవాణాకు ద్వారంపూడి పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని గతంలో జనసేన ప్రతిపక్షంలో ఉండగా పవన్‌కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే నిజమని నమ్మించేందుకు సంబంధిత శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడే తిష్ట వేసి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ద్వారంపూడి అంతు తేల్చే వరకూ వదిలేది లేదని నాదెండ్ల బహిరంగంగా ప్రకటించారు.
పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పైకి మాత్రం ఆదర్శ రాజకీయాల గురించి నీతులు కోటలు దాటేలా మాట్లాడుతూ, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే చర్చకు తెరలేచింది. ఇందుకు ఉదాహరణగా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని టార్గెట్ చేయడమే అంటున్నారు.