ఒక కోతి అనవసరంగా పుస్తకాలు చదివి తాను కూడా మనిషితో సమానమే అనుకుంది. ఒక మనిషి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పింది.
“కుదరదు” అన్నాడు. “డార్విన్ రాసాడు. కోతి నుంచి మనిషి పుట్టాడని” చెప్పింది కోతి. “డార్వినా? వాడెవడు?” “నీకు పుస్తక జ్ఞానం లేదన్న మాట”
“పుస్తకాల వల్ల జ్ఞానం రాదు, జ్ఞానం ఉన్నవాడు పుస్తకాలు చదివే పనిలేదు. ఇంతకీ ఏమంటావ్?” చిరాగ్గా అడిగాడు మనిషి.
“నువ్వూ, నేనూ సమానమని” “సమానమని ఒప్పుకుంటా కానీ, నేను నీకంటే ఎక్కువ సమానున్ని” “నీకున్నవే నాకున్నాయ్. నాకు అదనంగా తోక కూడా వుంది. నువ్వెలా అధిక సమానుడివి” ఆశ్చర్యంగా అడిగింది కోతి.
“ఎలాగంటే , నేను దురాశతో సాటి మనిషిని చంపగలను. నీ వల్ల అవుతుందా?” కోతి కంగారు పడి “అలాంటి ఆలోచన కూడా నాకు రాదు” అంది.
“మనిషి గొప్పతనం గురించి బాగా విను. నేను అన్నం పెట్టే ప్రకృతిని ధ్వంసం చేయగలను. చెట్లు కొడతాను, కొండల్ని కంకర చేస్తా. జీవజాలానికి బతుకు లేకుండా అంతం చేయగలను. నీ వల్ల అవుతుందా” అడిగాడు.
“చెట్టు నాకు తల్లి. అది ఇచ్చే ఫలాలతోనే మా జాతి బతుకుతోంది. అయినా అందరూ బాగుంటేనే కదా మనమూ బాగుండేది” వినయంగా చెప్పింది కోతి.
“అందుకే నువ్వు కోతివయ్యావు. నువ్వు యుద్ధం చేయగలవా?” “దేని కోసం యుద్ధం?” “శాంతి కోసం? పాల నుంచి వెన్నతీసినట్టు, అశాంతి నుంచి శాంతిని బయటికి తీస్తాం, ఇతరుల సంతోషాన్ని లాగేసి మనం మాత్రమే సంతోషంగా వుండడమే శాంతి. దీని కోసం శతాబ్దాలుగా యుద్ధం చేస్తున్నాం. ఒకన్ని చంపితే హంతకుడు, లక్ష మందిని చంపితే విజేత”
“నాకు మనిషి అంటే భయమేస్తోంది” “ప్రతి ప్రాణిని భయపెట్టడమే మనిషి విధి. భయపెడతాం, భయపడతాం. ఇప్పుడు చెప్పు నువ్వూనేనూ సమానమా?”
“ఎప్పటికీ కాదు, మనుషులతోనూ, ప్రకృతితోనూ నువ్వు చేస్తున్న ధ్వంసం తప్పని అనిపించడం లేదా?”
“తప్పొప్పులు, న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు అన్నీ పుస్తకాల్లో వుంటాయి. అవి నేను చదవను, నీలాంటి కోతులు మాత్రమే చదువుతాయి. చదువు వల్ల బుద్ధిమాంద్యత ఏర్పడుతుంది. జ్ఞానం, అంధత్వం సమాన పదాలు. దీపంతో వెలుగు అనేది పురాతన నమ్మకం. దీపంతో ఈ ప్రపంచాన్ని భస్మీపటలం చేయడం నవీన నాగరికత. దీన్ని ముద్దుగా విజ్ఞానం, సైన్స్ అని కూడా అంటారు. తోక వల్ల జ్ఞానం రాదు, జ్ఞానం వల్ల తోక వస్తుంది. జంతువులకి మాత్రమే జ్ఞానం వుండడానికి ఇదే ముఖ్య కారణం” అన్నాడు మనిషి.
“అంటే మనిషికి జ్ఞానం లేదని అంగీకరిస్తావా?” ఆసక్తిగా అడిగింది కోతి.
“నూరు శాతం. జ్ఞానంతో మనిషి ఎదగడు. పాతాళానికి వెళ్లిపోతాడు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాకపోవడమే ఈ కాలం అర్హత. అక్షరాలు నేర్చుకుంటే వాన్ని అక్షరాలా శుంఠ అంటారు. ఏమీ రానివాడికి అన్నీ వస్తాయి. వచ్చిన వాడు వాడికి చాకిరీ చేస్తాడు. మనిషి తొలుత డబ్బుని, తర్వాత ఆయుధాన్ని కనిపెట్టాడు. రెండూ ప్రపంచాన్ని శాసిస్తాయి. శాసనం లేకుండా జీవించే కోతివి నువ్వు. మాతో సమానం కావాలని ఎందుకు కోరుకుంటున్నావ్” అడిగాడు మనిషి.
“అయ్యా, అనవసరంగా పుస్తకాలు చదివి, తోకలో ఉన్న తెలివిని తల వరకూ తెచ్చుకున్నాను. కోతులు పుస్తకాలు రాయలేవు. మనుషులు మాత్రమే రాయగలరు. చదివిన వాళ్లు , రాసిన వాళ్లు ఇద్దరూ కూడా పుస్తకాల ప్రకారం జీవించలేరని నాకు తెలియదు. అయినా కోతులకి నీతులతో ఏం పని? ఉపదేశాల వల్ల ప్రపంచం మారదు. ఆకలికి ఆత్రం తెలుసుకానీ, సూత్రం తెలియదు. మనిషి గురించి తెలియక మనుషుల్లో కలిసి పోదామనుకున్నాను. కళ్లు తెరిపించావ్
చెట్టుని ప్రేమిస్తూ, పండుని ధ్యానిస్తూ, సైన్స్‌తో పని లేకుండా జీవించడమే నిజమైన జీవితం.
సంతోషం ఎక్కన్నుంచి వస్తుందో కనిపెడితే, మనం ఇతరుల సంతోషం జోలికెళ్లం. ఈ విషయం కోతులకి తెలుసు” అని చెట్టు మీదకి వెళ్లిపోయింది.
మనిషి ఇగో చల్లారింది.
జీఆర్ మహర్షి