అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి, పార్లమెంటు ఎన్నికల్లో శూన్యమైనప్పటి నుంచి కేసీఆర్ జిల్లాల నుంచి పార్టీ నాయకులను తన ఫామ్ హౌజ్ కు పిలిపించుకొని తెగ మాట్లాడేస్తున్నాడు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని వారిలో ధైర్యం నూరి పోస్తున్నాడు.
వాళ్లకు రకరకాల విషయాలు వినిపిస్తున్నాడు. తన గొప్పలు చాటుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ విషయం చెప్పాడు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు తానేమీ బాధ పడటంలేదని, ప్రజాస్వామ్యంలో గెలవడం, ఓడిపోవడం సాధారణమేనని అన్నాడు. రాజకీయాలంటేనే నిరంతరం ప్రజాసేవ చేయడమేనని అన్నాడు.
బీఆర్ఎస్ ఓడిపోయినందుకు పొరుగున ఉన్న మహారాష్ట్రతో పాటు ఇంకా చాలా రాష్ట్రాల ప్రజలు బాధపడిపోతున్నారని చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే దేశం మొత్తం బాధపడిపోతున్నదనే అర్థం వచ్చేలా చెప్పాడు. దేశంలో రైతు రాజ్యం తేవడానికి కదిలిన తన పార్టీ ఓడిపోవడంతో దేశం దార్శనిక పరిపాలనను కోల్పోయిందని కేసీఆర్ తీవ్ర ఆవేదన చెందాడు.
తెలంగాణ లాంటి పాలనను మహారాష్ట్ర ప్రజకు కోరుకున్నారని, కానీ ఇక్కడి ప్రజలు గులాబీ పార్టీని ఓడించారని చెప్పాడు. ఒకపక్క కేసీఆర్ ఇలాంటి కథలు చెబుతుంటే మరోపక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారం పోయాక అధినేతకు జ్ఞానోదయమైంది. నాయకులను పిలిపించుకొని తెగ మాట్లాడుతున్నాడు. ఇక మిగిలిన వారికి ఇంకెన్ని కథలు చెబుతాడో.