ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందన్నది వాస్తవం. దీనికి బాధ్యులు గత రెండు ప్రభుత్వాలు. పోటీలు పడి మరీ పాలకులు అప్పులు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడాయన సాయం కోసం ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటే తప్ప, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని రాబడితే చంద్రబాబునాయుడు గొప్పోడే అని ఎవరైనా ఒప్పుకుంటారు.
ఇసుక నుంచి తైలాన్ని అయినా తీయొచ్చేమో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల్ని కూడా రాబట్టలేరని గత పదేళ్లలో చంద్రబాబు, వైఎస్ జగన్‌ను చూశాం. మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కూడా వరుసగా కలుసుకుంటున్నారు. ఏపీ అప్పుల్లో ఉందని, ఆర్థిక సాయం అందించాలని ఆయన అందర్నీ కోరుతున్న ఏకైక కోరిక. అయితే గత పదేళ్ల అనుభవాల్ని గుర్తు చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఆంధ్రాపై కరుణించరని గట్టి నమ్మకం.
విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులకే ఇంత వరకూ అతీగతీ లేదు. రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు.. జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఏడాదికి ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏ మేరకు ఇచ్చారో మనందరికీ తెలుసు. హక్కుల్నే గౌరవించని కేంద్ర ప్రభుత్వం, ఉదారంగా ఏపీకి సాయం అందిస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుందనే చర్చకు తెరలేచింది.
కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చినా, ఇవ్వకపోయినా మన నాయకులెవరూ నోరెత్తరని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. ఏపీలో అధికార, ప్రతిపక్ష నాయకులు తమలో తాము పదేళ్లుగా కొట్టుకు చస్తున్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడడంపై మన నాయకులకు ఆసక్తి లేదు. ఎంతసేపూ కేసుల నుంచి తమకు కేంద్ర ప్రభుత్వ రక్షణ మాత్రమే టీడీపీ, వైసీపీ నాయకులకు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ప్రయోజనాల్ని ఏనాడో కేంద్ర ప్రభుత్వానికి మన నాయకులు తాకట్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం నుంచి నిధులు రాబడితే చంద్రబాబు గొప్ప నాయకుడే అని ప్రశంసించాల్సిందే.