పేదరాలైన తెలంగాణ తల్లి!

నిజానికి పాత తెలంగాణ తల్లి విగ్రహం, టీఎస్ …ఇవేవీ రాష్ట్రానికి నష్టం కలిగించేవికావు. కేవలం కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి చేసిన పనులు.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేసీఆర్ సీఎం కాగానే తెలంగాణ ధనిక రాష్ట్రమని అన్నాడు. ఆయన హయాంలో రూపొందిన తెలంగాణ తల్లి అదే తీరులో ఉంది. తెలంగాణ తల్లిని ఓ దేవతలా రూపొందించారు.

రేవంత్ రెడ్డి తయారుచేసిన తెలంగాణ తల్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గులాబీ పార్టీ నాయకులు ప్రత్యేకించి కేసీఆర్, కవితలాంటి వాళ్ళు ఈ తెలంగాణ తల్లి పేద తల్లి అంటున్నారు. కాంగ్రెస్ తల్లి అంటున్నారు. ఇదేం దిక్కుమాలిన భావజాలమని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ తల్లి రాష్ట్రానికి సింబల్ అనుకుంటే రాష్ట్రం కూడా పేద రాష్ట్రమని అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడే కేటీఆర్ మేడ్చల్ లో పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. దీన్నిబట్టి కొత్త విగ్రహం పట్ల వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోంది.

తెలంగాణను టీఎస్ నుంచి టీజీగా మార్చడం పట్ల కూడా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. నిజానికి టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనే అర్ధం వస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అప్పట్లో గోడల మీద టీజీ అని రాసేవాళ్ళు. దాంతో రేవంత్ ఉద్యమకారులను గౌరవించాలనే ఉద్దేశంతో కావొచ్చు టీఎస్ ను టీజీ అని మార్చాడు.

గద్దర్ అవార్డ్స్ పట్ల కూడా సినీ పరిశ్రమలో వ్యతిరేకత ఉంది. కానీ ఎవరూ బయటపడలేదు. నిజానికి పాత తెలంగాణ తల్లి విగ్రహం, టీఎస్ …ఇవేవీ రాష్ట్రానికి నష్టం కలిగించేవికావు. కేవలం కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి చేసిన పనులు.

పాత ప్రభుత్వం పట్ల కొత్త ప్రభుత్వానికి రాజకీయంగా వ్యతిరేకత, కోపం ఉండటం సహజం. కానీ అదే పనిగా పాత ప్రభుత్వం చేసిన పనులను మార్చాల్సిన అవసరం లేదు. దానివల్ల సమయం, డబ్బు వృథా. కాకపొతే రేవంత్ రెడ్డి ఇగో చల్లారుతుంది. అంతే.