కోడిపందేల వేటలో కత్తులు దూసుకుంటున్న టీడీపీ వర్సస్ జనసేన మంత్రి

తెనాలి నియోజకవర్గంలో ఎలాంటి కోడిపందేలు జరగడానికి వీల్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ హుకుం జారీ చేయడంతో పందెపు రాయుళ్లు అందరూ బిక్క మొహం వేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.

కోస్తా ఆంధ్రాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే పాడిపంటలతో ఒకవైపున కళకళ లాడుతూనే మరొక వైపున కోడి పందేల జోరుతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనపడుతుంది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూడా కోడిపందేలు జోరుగా జరగడం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఇలా కోడిపందేల పేరుతో గుండాటలు, పేకాట విచ్చల విడిగా జరిపి సామాన్యుడికి జూదాన్ని అలవాటు చేసి దాదాపుగా 90 శాతం మంది జేబులు గుల్ల చేయడం అన్నది ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తూనే ఉంటుంది.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వానికి చెందిన పార్టీ నాయకులు దగ్గర ఉండి పందేలను ప్రోత్సహించి తమను నమ్ముకున్న కార్యకర్తలకు కాస్తో కూస్తో దోచిపెట్టడం పరిపాటిగా మారింది. కానీ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కోడిపందేలు జోరుగా జరుగుతున్న వేళ, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఎలాంటి కోడిపందేలు జరగడానికి వీల్లేదని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ హుకుం జారీ చేయడంతో పందెపు రాయుళ్లు అందరూ బిక్క మొహం వేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.

గతంలో తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరుపున ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీచేస్తుండేవారు. కానీ కూటమిగా ఏర్పడి జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో తన ఎమ్మెల్యే సీటును నాదెండ్ల మనోహర్ కు ఇవ్వవలసి రావడంతో ఆలపాటి రాజా ఎన్నికలలో పోటీ చేయకుండా పక్కకు తప్పుకున్నారు. కానీ తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏదో ఒక చిన్న చితక పనులు చేసిపెడుతూ తన క్యాడర్ పక్కకు జారిపోకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీకి అండగా ఉండే కొంతమంది కొల్లిపర మండలంలో కోడిపందేలు నిర్వహించడానికి దాదాపుగా 10 ఎకరాల పొలం తీసుకొని బరులు సిద్ధం చేసుకుంటున్న వేళ నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఝలక్ తో కంగుతిన్నారని చెప్పుకోవచ్చు

కోడిపందేలు లాంటివి తన హయాంలో జరగడానికి వీలు లేదని మంత్రి నాదెండ్ల హుకుం జారీచేయడం మరొక వైపున టీడీపీ నాయకులు ఎలాగైనా తాము నిర్వహించి తీరుతామని పట్టుపట్టడంతో దాదాపుగా 100 మంది పోలీసులు కోడిపందేలు నిర్వహించే స్థలానికి చేరుకొని ట్రాక్టర్ లతో మొత్తం చదును చేసిన ప్రాంతాన్ని.. దున్నించి వేయించడంతో కోడిపందేల పందేల నిర్వహణకు పూర్తిగా అడ్డంకిగా మారింది. మరొక వైపున మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం ఈ మూడు రోజుల పాటు పండుగ పేరుతో పేకాట ఆడితే సహించే పరిస్థితి లేదని పోలీసులకు కూడా గట్టిగా చెప్పడంతో తెనాలి నియోజకవర్గం మొత్తం పోలీసులు జల్లెడ పడుతూ కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తూ జూదగాళ్ళ చేత ఊచలు లెక్కబెట్టిస్తున్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ పంతానికి పోయి పోలీసులతో కోడిపందేల బరిని కూల్చివేయించడంతో కూటమిలో లుకలుకలు ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ పరిణాలతో టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఏడాదిలో మూడు రోజుల పాటు నిర్వహించుకునే కోడి పందేల విషయంలో మంత్రి నాదెండ్ల ఇలా పంతానికి పోవడం ఏ మాత్రం తగదని, గతంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడు జరగలేదని… పోలీసులు వచ్చి ఆంక్షలు పెట్టినా చివరకు పందేలను నిర్వహించుకునేవారమని… కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా తమకు ఇలాంటి అవమానాలు జరుగుతుంటే అధికారంలో ఉంటే ఎంతా? లేకపోతే ఎంతా? అని టీడీపీ శ్రేణులు బాధపడుతున్నారు.

ఒకవైపున మాజీ మంత్రి, సెంట్రల్ మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలో నాదెండ్ల తన పట్టుని నిలుపుకోవడాన్ని చూస్తుంటే తాను ఎంత పవర్ ఫుల్ అన్నది కూటమి నేతలకు మరొకసారి చెప్పకనే చెప్పారు. మొదటి నుంచి నాదెండ్ల మనోహర్ జూదానికి వ్యతిరేకంగా పోలీసులకు తగు సూచనలు చేస్తూనే పేకాటతో పాటు మత్తు పదార్ధాలు లాంటి వాటిని అణచివేస్తూ తాను అందరిలా మాటలు చెప్పవాడిని కాదని చేతలలో చూపించే పవర్ ఫుల్ మినిస్టర్ ను అని నిరూపించుకుంటున్నారు.

మరొకవైపున కోడిపందేలు, పేకాట, గుండాటలకు వ్యతిరేకంగా ఉండే సామాన్య ప్రజలు మాత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ తీరుతో… వాడు మగాడ్రా బుజ్జి అనే రీతిలో కీర్తిస్తున్నారు. జూదం పేరుతో ప్రతి ఏడాది నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలతో ఎంతో మంది చితికి పోతున్నారని, ఈ మూడు రోజుల పాటు గంజాయి, మందు లాంటి వాటికి ప్రజలను దూరంగా ఉంచి సంక్రాంత్రి పండుగను ఎంతో ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలన్న తన అభిలాషను పోలీసులు కూడా ఉత్తమ పనితీరు కనపరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

కానీ తెలుగుదేశం నేతలు ఎలాగైనా పందేలు నిర్వహించి తీరాల్సిందే అని పంతం పట్టడంతో ఈ కోడిపందేల వేటలో గెలిచేదెవరో ఓడేదెవరో చూడాలి. చివరిగా తెనాలి నియోజకవర్గంలో కోడిపందేలు, జూదం లాంటివి జరగకుండా మంత్రి తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజులలో కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఎంత వరకు సహకరిస్తారన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెప్పుకోవచ్చు.

3 Replies to “కోడిపందేల వేటలో కత్తులు దూసుకుంటున్న టీడీపీ వర్సస్ జనసేన మంత్రి”

  1. ఎంటొ GA గాడి సొల్లు పురాణం!

    కొంచం అంటూ ఇటూ మార్చి వచ్చె సంక్రంతి కి కూడా ఇదె వార్త రాస్తాడు చూడండి

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.