మిగిలింది 3 రోజులే.. లింక్ చేసుకున్నారా?

దాదాపు ఏడాదిన్నరగా నలుగుతున్న వ్యవహారం ఇది. ఇప్పుడు దీనికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ముచ్చటగా 3 రోజులు గడువు మాత్రమే మిగిలుంది. అదే ఆధార్ కార్డ్-పాన్ కార్డు లింక్. ఈ రెండు కార్డుల్ని లింక్…

దాదాపు ఏడాదిన్నరగా నలుగుతున్న వ్యవహారం ఇది. ఇప్పుడు దీనికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ముచ్చటగా 3 రోజులు గడువు మాత్రమే మిగిలుంది. అదే ఆధార్ కార్డ్-పాన్ కార్డు లింక్. ఈ రెండు కార్డుల్ని లింక్ చేసుకోవడానికి 31వ తేదీతో గడువు ముగుస్తుంది.

ఇప్పటికే చాలామంది తమ ఆధార్, పాన్ కార్డుల్ని లింక్ చేసుకున్నారు. 31వ తేదీలోగా అలా లింక్ చేసుకోని వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లకు ఆర్థిక లావాదేవీల విషయంలో చిక్కులు తప్పవు. ఆధార్-పాన్ లింక్ చేసుకోకపోతే.. డీమ్యాట్ ఎకౌంట్ నిలిచిపోతుందని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు సందేశం పంపించింది. అంటే లింక్ చేసుకోని వాళ్లు ఇక స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేయలేరు, మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనలేరు.

ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే.. 50వేలు దాటిన నగదు బదిలీలకు సంబంధించి కూడా పాన్-ఆధార్ లింక్ ను భవిష్యత్తులో తప్పనిసరి చేయబోతున్నాయి బ్యాంకులు. కొన్ని రోజుల తర్వాత అలా లింక్ చేయని పాన్ కార్డులు చెల్లుబాటు కూడా కావు. అప్పుడిక బ్యాంక్ ఖాతా కూడా తెరవడం కుదరదు. ఇన్ కం ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయలేం.

దేశవ్యాప్తంగా చాలామంది రెండేసి పాన్ కార్డులు కలిగి ఉన్నారు. ఇలా ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. పాన్-ఆధార్ లింకేజ్ తో ఇలాంటి ఎక్స్ ట్రా పాన్ కార్డుల ఏరివేత సులభం అవుతుంది. 31వ తేదీ తర్వాత కూడా అలాంటి కార్డులు ఉన్నట్టు తేలితే సంబంధిత వ్యక్తులకు 10వేల రూపాయల వరకు జరిమానా పడే ప్రమాదం ఉంది.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రస్తుతం ఆధార్ కార్డు మాత్రమే ప్రామాణికంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డును కూడా జత చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తద్వారా కొన్ని ప్రత్యేక ప్రభుత్వ పథకాల అమలులో మరింత పారదర్శకత తీసుకురావాలనుకుంటోంది.

లింక్ చేయడానికి గడువును మరోసారి పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు. గతేడాది సెప్టెంబర్ తో ముగియాల్సిన గడువును ఇప్పటికే ఓసారి పెంచింది. ఇప్పుడు మరోసారి గడువు పెంచాలని కేంద్రం అనుకోవడం లేదు. సో.. మిగిలిన ఈ 3 రోజుల్లో పాన్-ఆధార్ కార్డుల్ని లింక్ చేసుకుంటేనే ఉత్తమం. లేదంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది.