ఉప్మా ఎంత బాగున్నా, దానిలో జీడిపలుకులు ఏరుకుని తినడం ఓ సరదా. ముళ్లపూడి వెంకట రమణ గారి రచనలు ఆద్యంతం బాగున్నా, వాటిలో కొన్ని కోటబుల్ కోట్స్ ఏరుకుని, దాచుకుని, అప్పుడప్పుడు గుర్తు చేసుకుని, మరొకరితో పంచుకుని ఆనందించడం ఓ సరదా. ఉడ్‌హౌస్ రచనల్లోంచి కొన్ని వ్యాఖ్యలు, సంభాషణలు ఏరి ‘‘నగ్గెట్స్’’ అనే పేర వేసిన పుస్తకం చూసినపుడు రమణ గారి రచనల్లోంచి యిలా ఎందుకు చేయకూడదు అనిపించి, నాకు నచ్చినవన్నీ ఏరి వాటిని సబ్జక్ట్ వైజ్ ఏర్పాటు చేశాను. ఏ కథ లేదా ఏ నవల లేదా సినిమా నుంచి తీసుకున్నానో దాని రిఫరెన్సు కూడా యిచ్చాను. అవి మీకు అప్పుడప్పుడు అందిస్తూంటాను. ప్రస్తుతం ‘సినీ‘మాలోకం’ పేర ఏరినవి మీముందు ఉంచుతున్నాను.
సినీ మాలోకం
* తెరమీద మాళవరాజు కుమారుడు వేట కెళ్లి విల్లెక్కుపెట్టి బాణం వేశాడు. అది సూటిగా అమెరికా వెళ్లి అక్కడి అడవిలోని పులికి తగిలేసరికి అ దెబ్బకి ఆఫ్రికాలో సింహం భయంకరంగా గర్జించింది. దాంతో ఆ చుట్టుపక్కల జింకలూ, జిరాఫీలూ, ఇండియాలోని కుందేళ్లూ, మళ్లీ ఆఫ్రికాలోని సింహాలూ, కారెనుమూలూ కంగారుపడి పరుగెత్తాయి. (విక్రమార్కుడి.. )
* అపార్థాలు వచ్చాక హీరో తూర్పుకీ, హీరోయిన్ పడమటికీ పోతారు. పోయి పోయి మళ్లీ 260వ రేఖాంశం దగ్గరే కలుసుకుంటారు. (గిరీశం లెక్చర్లు)
* తెలుగు సినిమా వాళ్లందరికీ దొరికినవి ఒకటో రకం పాత్రలు. అందరికీ ఆ వొక్కటే రకం పాత్రలుంటాయి. అన్ని పెళ్లాలనూ వకటే కిటికీ చిల్లులోంచి వొకటే రకం షాటులో చూసి వకటే రకంగా అపోహపడతాయి. వకటే రకం అవుడ్డోరులో తిరుగుతాయి. తరవాత వకటే రకం కారు కిందపడి, వక్కటే రకం దెబ్బ (పలాస్త్రీ మార్కు) తగిలించుకుంటాయి. చివార్ని అన్ని పాత్రలూ కలిసి వకటే రకంగా గ్రూపు ఫోటో తీయించుకుంటాయి- మూడో రీల్లో పోర్షన్ పోగొట్టుకున్న పెరుమాళ్లు వినా. (గిరీశం లెక్చర్లు)
* ‘నేను పెద్దస్టార్ నయ్యేక రౌడీయేసాలు ఎయ్యచ్చా?’
‘ఒక్క రౌడీ ఏమిటి, అడ్డమైన వెధవ్వేషాలు వేసెయొచ్చు. హీరో, విలన్, హాస్యగాడు వేయొచ్చు. నీకు సరదాగా ఉంటే, సాధించలేనా అనుకుంటే హీరోయిన్ కూడా వేయొచ్చు. నీ పలుకు వేదం అవుతుంది. నువ్వు బాక్సాఫీస్ పిచికవి అయినపుడు నీ మాటకి అడ్డెక్కడ? నీ కీర్తికి ఒడ్డెక్కడ? (సెరిబ్రల్ సినేమియా)
*‘సినిమా రైటరుగా చేరి ఏడాది దాటినా ఇతనికింత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, ధైర్యం, తనూ మనిషే, మొగాడేనన్న పిచ్చినమ్మకం ఎలా ఉండిపోయాయా అని అందరూ విస్తుపోయారు; ఎడతెగకుండా ఆలోచించారు. (విక్రమార్కుడి..)
*ఆమె చీరెమీద జరీపోగులు సినీమా పాటలలో భావంలా, అస్తినాస్తి సందేహం కలిగిస్తూ మెరుస్తున్నాయి. (విక్రమార్కుడి.. )
*రాజు – ‘నేను రాయబోయే సినిమా సబ్జెక్టుల హెడ్డింగ్సు వినండి ఎడిటర్‌గారూ – అతుకుల బ్రతుకులు, బతుకుల అతుకులు, బతుకులలో గతుకులు, శిథిలగృహం, శ్మశానవాటిక, సుందరి ఎమ్మే, బన్‌రొట్టి, నాన్రొట్టి (ఈ రెండూ క్యామిడీ ల్లెండి) బావామరదళ్లు, వానావడగళ్లు, జోడెడ్ల బళ్లు, ఆశ, (మూడక్షరాలవి, లక్కీపేర్లు చెప్పనాండి?) నిరాశ, దురాశ, పేరాశ, కులాసా, దిలాసా (ఈ రెండూ హ్యూమరికల్) పలాసా, మసాలా (ఇవి ఫైటికల్వి) లలాలా (మ్యూజికల్) సీత, లీల, బాల, గోల, రాధ, బాధ, బరి, శబరి, రబరి, అంబారి, లంబాడి (ఇక్కణ్ణుంచి నాలుగువండి) మామామయ్య, మీఅత్తయ్య, శేషశాయి, హాయిహాయి, ఇరుగిల్లు, పొరుగిల్లు, గల్లుగల్లు, దుర్యోధనుడు, దుర్మార్గుడు, సన్మార్గుడు, ధర్మరాజు, బెజవాడ, మెద్రాస్, గుడివాడ జంక్షన్ (ఇది డిటెక్టివు పిక్చర్లోకి హెడ్డింగులనుకోండి…. ‘మీ దయ’ అన్నాడు ఎడిటర్) తరువాత కాంచనమాల, యాటంబాంబ్, శిలీముఖం, సగంసగం, నువ్వూనేనూ….’
ఎడిటర్ : ‘అట్టె అట్టె…. శిలీముఖం అంటే ఏమిటి బ్రదర్?’
రాజు : ‘హెడ్డింగులకి అర్థం ఏమిటి సార్ నాబొంద.. కథకి కాళ్లా చేతులా అన్నట్టు దీనికి అర్థమా పర్థమా…. క్యాచీగా ఉండాలి అంతే….’
ఎడిటర్ :‘మీ బొంద… వెతికితే అర్థం పర్థం అన్నీ ఉంటాయి. శిలీమొహం అంటే శిలి అనేవాడి మొహం అన్నమాట. బాగా దానాలూ అవీ చేశాడు. వీడూ దభీచీ అనే ఇంకోడు. అసలు వారిద్దర్దీ జాయింటు స్టోరీ. నువ్వు విడదియ్యడం బాగానే ఉందనుకో. రెండు పిక్చర్లకి పనికొస్తుంది. ఏం ఆ శిలి అనేవాడి మొహంతో ఓ శ్టాట్యూటు కట్టారు. దాని కథ అన్నమాట. తెలిసిందా? (విక్రమార్కుడి.. )
*‘సార్ నేను శాంగ్సు రాయకపోతే పోయెగాని రాసిన వాటిలో ఎక్కడేనా ‘అర్నవమూ’ అనేమాట పెట్టించండి. అది భలే వరుడులెండి. నాకు చాలా యిష్టం. ఎప్పణ్ణించో అది పెట్టి పాట రాయాలనీ, అది పెట్టి పిక్చరు తియ్యాలనీ కలలు గాంచుతున్నాను.’ (విక్రమార్కుడి.. )
*‘అమా… కుట్టి! ఇదిలే నాకు పెద్ద సందేహండ, నువులేక నేనులేను ప్రేమలేదు మనమూలేమూ అని పాటగదా! అప్పో ఎవరు లేకపోతే పాట ఎప్పిడి? ఎవరు పాడతారు, ఎందుకు వింటారు? సరిసరే… అర్థమంతా నాకెందుకు?’ (రాధాకల్యాణం)
*సినిమా ‘కాదుసుమా కళ కాదు సుమా’.(ఆదుర్తీ – సుబ్బారావూ)
*కృతకమైన సాంఘికం కన్న సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు.(జానపథ బాటసారి)
*మీరు కాపీ కొట్టదలచికొన్న ఏడు రికార్డులలో మూడింటిని ఇంకో కంపెనీ వాళ్లు కూడా కొని మీకన్న ముందు రికార్డు చేశారు. కాపీకి కాపీరైటు ఉండాలి! ఏం చేస్తాం (విక్రమార్కుడి.. )
*గిరాకీ ఉన్న ఒక ఆర్టిస్టు మధ్యాహ్నం రెండు గంటల కాల్షీటుకు సాయంత్రం ఆరున్నరకల్లా వచ్చేసింది.(విక్రమార్కుడి.. )
*ఈ ‘‘నెక్స్ట్ పిక్చర్’’ అనే దాంట్లో గొప్ప మహత్యం ఉందిలే. మాజిక్కు అది. నొప్పించక తానొవ్వక తప్పించక తిరగమని ఓ పద్యంలేదూ దాని తాలూకు ట్రిక్కు ఇదన్నమాట.(ఎక్స్ ఫిలింస్ వారి నెక్స్ట్ పిక్చర్)
*పెళ్ళి జరుగుతున్నప్పుడు కూడా పుస్తెలతాడుకి మూడోమూడి పడేవరకు పెళ్లికొడుకు వేళ్లు పిల్లకూ పిల్లదాని జడగ్గాని తగల్రాదని సెన్సార్ శాసనం. తగిలిందే, సెన్సార్రూళ్ళకర్ర ప్రొడ్యూసరు నెత్తిన ఠంగున పడిందే (గిరీశం లెక్చర్లు)
*మన పాతపిక్చరులో హీరో, హీరోయిన్లు సైకిళ్లమీద వస్తూ డాషిచ్చుకుని ప్రేమలో పడతారు గదా. అందులో హీరోయిను ఎడమనుంచి, హీరో కుడినుంచి వస్తారు. ఈసారి ఆ సీనుని తలకిందులు చేసి పారేశాను. హీరో ఎడమనుంచి వస్తే, హీరోయిన్ కుడినుంచి వస్తుంది.(గిరీశం లెక్చర్లు)
*నువ్వక్కడ నిలబడితే నీ బ్రిలియన్సు వల్ల ఎక్కడో గ్లేరుకొడుతుంది. అంతా చెడుతుంది, ఎవడ్రా ఇక్కడెవరో బ్రిలియంట్ల వెధవలున్నట్లున్నారు తన్ని తగిలీయండంటారు.(గిరీశం లెక్చర్లు)
*పెద్దబాలశిక్షకి బంగారు ఫ్రేమూలు గదటోయ్ మన టెలుగు పిక్చర్లు.(గిరీశం లెక్చర్లు)
*కళాఖండాలనగా ఏమిటోయ్– డబ్బురాని పిక్చర్లు…(గిరీశం లెక్చర్లు)
*తెలుగు చిత్రాలలో నాయకుడు చిరంజీవికి రవికి ఎప్పుడూ ఢోకా ఉండదు.(భాగ్యరేఖ సమీక్ష)
*తల్లీ, తండ్రి, ఐశ్వర్యం, అఖరికి నోట్లో నాలికా కూడా లేని అనాథ బాలిక లక్ష్మి.(భాగ్యరేఖ సమీక్ష)
*తెలుగులో తర్జుమా చేసిన బొంబాయివాళీ వీధి నృత్యాలు….(భాగ్యరేఖ సమీక్ష)
*సెంటిమెంటుని సూపర్స్టిషన్ అనుకుంటుంది….(చేప నవ్విన కారణం)
*హీరోలో, హీరోయిన్లో వేళకు రాపోతే – ‘జీరో’తో లాంగ్‌షాట్ తీసెయ్ చైతైతే.(దశాదేశాలు)
*మ్యూజిక్ డైరెక్షన్ అనేది టెలుగులో అచ్చుతప్పు, ‘మాజిక్’ అని అనగ నొప్పు; అదే మనకు నప్పు(దశాదేశాలు)
*హీరో చివర్లో వహీదా రహమాన్‌తో కలిసి అలా దిగంతాలవేపు షికారెళ్లి పోతాడు సాయంసంధ్యలోకి… (ప్యాసా సమీక్ష)
*ఆత్మహత్యకి ప్రయత్నిస్తున్న హీరోయిన్ని ఆపడానికి వచ్చే సినిమా సాధువులా నవ్వుతున్నాడు నరసన్న…(విక్రమార్కుడి.. )
* ఆ హీరో ఇతని డైలాగు చింపేసి కొత్తది కుడుతూంటే, ‘ఆయ్యో దాన్ని చంపకండి సార్!’ అని ఏడిచేశాడు.(విక్రమార్కుడి.. )
*ఇక్కడ కోట్ల కొద్దీ పాటలు రికార్డు అయ్యాయి గదా. బాక్సాఫీసు సూత్రాలు అని ఉంటాయి చూడు. అవి బిగించేవారు జనానికి, ‘వాటికోసం అని’ వాటి మూలంగా, ఇంగ్లీషు, శ్పానిష్, ఇటాలియన్, ఇండియన్, ఇంకా ఏవో బోల్డు దేశాలున్నాయి. ఆ రకరకాల సంగీతాన్ని తెచ్చి మనదాంతో కలిపి కాచి గిరగిరతిప్పి సాగదీసేవాళ్లు.(విక్రమార్కుడి.. )
*ఈశ్వరు డొకడే. అతను మన సినిమాల్లాగే ఆదిమధ్యాంతరహితుడు….సినిమాలలో ఈ ఈశ్వరదర్శన రహస్యం దాంకుని వుందన్నమాట. ఇదీ సరిగ్గా అంతే. ‘‘సుబ్బలక్ష్మి’’ అంటావు ఓ సినిమాని. ‘‘సూరజ్’’ అంటావు మరోదాన్ని. ‘ముఝే న భూలో’ అంటావు ఒక సోషల్‌ని. అలాగే బంగారునువ్వు, వెండిబడి, అట్టబుట్ట, చెమ్మచెక్క ఇలా సవాలక్ష పేర్లు. కాని, సినిమాలో? అవన్నీ ఒకటేగదా..(విక్రమార్కుడి.. )
*నాలుగురీళ్లు సుఖపడితే ఆరురీళ్ల వేడి కన్నీళ్లు. మధ్యమధ్య నాలుగురీళ్ల హాస్సెపు చన్నీళ్లు. .(విక్రమార్కుడి.. )
*సాధారణంగా సినిమాలో కథ ఆరంభం కావడానికి మొదట్లోనే చచ్చిపోయేవాళ్ల వేషాలు దొరికేవి అతనికి..(విక్రమార్కుడి.. )
*అన్ని కాలాలకీ, అన్ని దేశాలకీ సరిపడే కథ అది. ఒక టమిల్ ఫోక్లోర్ హీరో ఒక టెలుగూ సోషల్ హీరోయిన్ని లవ్‌చేసి, కన్నడ పౌరాణిక విలన్‌తో పోరాడి రాక్ ఎండ్ రోల్ డాన్సు చేస్తాడు ఇందులో..(విక్రమార్కుడి.. )
*మన సినిమాలలో చీకటిగా ఉండాల్సిన సీనులో వెలుగు కిరణాలలా నిరాశతో నిండాల్సిన అతని మనసులో చాలా ఆశలు మిలమిల్లాడాయి..(విక్రమార్కుడి.. )
*జీవితం ఆక్సిడైజ్ కావడానికి ఇంధనమైన ధనం మహాత్మ్యాన్ని తెలిపే ఉద్గ్రంథం చెక్కుబుక్కును శ్రద్ధగా చదువుకుంటున్న ఒక సినీమార్కు ద్రౌపది దరిజేరిన ఒక దుశ్శాసనుడు పైట దిగలాగేస్తున్నాడు. మరో చండశాసనుడు అది వల్లకాదని ఎగలాగుతున్నాడు. ఆవిడ ఇదేం పట్టించుకోకుండా బుద్ధిగా బుక్కు చదువుకుంటోంది..(విక్రమార్కుడి..)
*మొత్తానికి, ఆడదాని తెలివితేటల మీద అట్టే నమ్మకం లేని బ్రహ్మచారి, ఓ మోస్తరుగా వేసిన అసంపూర్ణ వర్ణచిత్రంలా ఉంది నరసు..(విక్రమార్కుడి.. )
*‘‘ఇదే బెస్టు. మామూలుగా హీరోలు రెండేసి రోల్సు వేస్తే, మనదాంటో ఇద్దరు హీరోలు ఒక రోలే వేశారని పబ్లిసిటీ చేయొచ్చు.’’.(విక్రమార్కుడి.. )
*మ్యూజిక్ డైరెక్టర్ అంటూ వేరేలేరు. వాళ్లు చాలా అడుగుతారు. చెప్పినట్టు అందరూ వినరు. మనకు మూజికు ఎడిటరే ఉంటాడు. డైరెక్షను మనదే’’ అన్నారు డైరెక్టరుగారు. దగ్గిరే ఉన్న కుర్రాడు ఆయన గుండెమీద ఠీవిగా కొట్టాడు. (విక్రమార్కుడి.. )
*సినిమాలు, డైలాగులు తొడుక్కు తిరగడం ఆరంభించడానికి పూర్వమే సంగీతం మాట్లాడడం ఆరంభించింది. (నేపథ్య సంగీతం)
*తన కొడుకు ముగ్గురు బిడ్డల తండ్రి సైజుకి పెరిగినా తను విగ్గుకీ సినీమీసాలకి రంగేసుకోవడం వంటి కుర్రకారు చేష్టల దగ్గర నుంచి…(రేచుక్క పగటిచుక్క సమీక్ష)
*విశ్వరూపం అంటే లావుగా ఎత్తుగా కనబడడం.(కృష్ణలీలలు సమీక్ష)
*నేతి నేతి అనుకుంటూ– ఇదికాదు ఇదికాదు అనుకుంటూ పోతే అయినదేదో తెలీకపోయినా కానివన్నీ బోధపడతాయి. తెలుగు సినిమావారు మహగొప్ప వేదాంతులు అనడానికిదే ప్రబలసాక్ష్యం. ఈ నేతివాదం పట్టుగుని, ఒక్కొక్క సినిమా తీసి దెబ్బ తిన్నప్పుడుల్లా ఇది కాదు అని చెంపలేసుకుంటారు. ఈ ‘నేతి’ సినిమాల్ని పట్టుకుని, ‘‘మనదంతా నూనె సరుకోయ్’’ అన్న చెవలాయ యవడంట! (గిరీశం లెక్చర్లు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)