వియ్యంకుడైన టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరులు దాడి చేయడంపై విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. లోకేశ్ పాదయాత్రలో ఏవీపై మాజీ మంత్రి అఖిలప్రియ ఒక పథకం ప్రకారం దాడికి తెగబడ్డా, దాన్ని లైట్ తీసుకోవాలని టీడీపీ అధిష్టానం మొదట భావించింది. అయితే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతోనే చంద్రబాబు యాక్షన్‌లోకి దిగినట్టు సమాచారం.
ఆ తర్వాత నంద్యాల ఘటనపై చంద్రబాబు త్రిమెన్ కమిటీ ప్రకటన, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవనే హెచ్చరికలు వచ్చాయని బొండా ఉమా అనుచరులు చెబుతున్నారు. అఖిలప్రియపై ఏవీ కుమార్తె, బొండా కోడలైన జస్వంతి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అఖిలప్రియను బజారు మనిషిగా బొండా కోడలు అభివర్ణించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఒకవేళ అఖిలప్రియకు ఆళ్లగడ్డ టికెట్ ఇస్తే, ఏవీ అనుచరులంతా ఆమెను ఓడించేందుకు పని చేస్తామని జస్వంతి బహిరంగంగానే హెచ్చరించారు.
ఏవీపై దాడి అనంతరం ఆయన్ను బొండా ఉమా ఫోన్‌లో పరామర్శించారని సమాచారం. అసలు దాడికి దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. తనది ఏ తప్పు లేదని, అంతా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని బొండాకు ఏవీ వివరించారని సమాచారం. ఈ నేపథ్యంలో దాడి వెనుక వైసీపీ ఉందనే అనుమానాల్ని తెరపైకి తెచ్చి, టీడీపీలో అంతా బాగుందనే పిక్చర్ ఇచ్చేందుకు ప్రయత్నించడంపై బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఇలాగైతే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, వాస్తవాల్ని తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి బొండా ఉమా అల్టిమేటమ్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం.
ఈ సందర్భంగా అఖిలప్రియ గత నాలుగేళ్లుగా పార్టీకి ఏ విధంగా నష్టం కలిగిస్తున్నదో అధిష్టానానికి బొండా ఉమా ద్వారా ఏవీ సుబ్బారెడ్డి ఒక నివేదిక పంపినట్టు విశ్వసనీయ సమాచారం. నంద్యాల ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక అనంతరం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదే సందర్భంలో ఆళ్లగడ్డలో టీడీపీకి బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డలలో టీడీపీలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి.