గౌత‌మ్‌పై వేటుకు కార‌ణం అదేనా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ షాక్‌ మీద షాక్ ఇస్తున్నారు. ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌పై బ‌దిలీ వేటు వేయ‌డంపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే, మ‌రో సంచ‌ల‌నం. ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై అనూహ్యంగా బ‌దిలీ వేటు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ షాక్‌ మీద షాక్ ఇస్తున్నారు. ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌పై బ‌దిలీ వేటు వేయ‌డంపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే, మ‌రో సంచ‌ల‌నం. ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై అనూహ్యంగా బ‌దిలీ వేటు ప‌డింది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. కొత్త‌గా పోస్టింగ్ కూడా ఇవ్వ‌కుండా జీఏడీలో రిపోర్ట్ చేసుకోవాల‌ని గౌత‌మ్ సవాంగ్‌కి ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

2023 వ‌ర‌కూ ప‌దవీ కాలం ఉన్న గౌత‌మ్ స‌వాంగ్‌కు అనూహ్యంగా స్థాన చ‌ల‌నం క‌ల‌గ‌డంపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు తెరపైకి వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా నూత‌న పీఆర్సీతో పాటు త‌మ సమ‌స్య‌ల‌పై ఈ నెల 3న ఉద్యోగులు త‌ల‌పెట్టిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ఘ‌న విజ‌యం సాధించింది. రాష్ట్ర న‌లుమూలల నుంచి చ‌లో విజ‌య‌వాడ‌కు ప్ర‌వాహంలా త‌ర‌లి వ‌చ్చిన ఉద్యోగుల‌ను నిలువ‌రించ‌డం పోలీసుల‌కు చేత‌కాలేదు.

దీంతో పోలీసులు చివ‌రి నిమిషంలో చేతులెత్తేసి ప్రేక్షక పాత్ర పోషించారు. కానీ ఉద్యోగుల చ‌లో విజ‌య‌వాడ‌ను ఎలాగైనా అడ్డుకుని ఫెయిల్ అయ్యింద‌నిపించాల‌ని ప్ర‌భుత్వం యోచించింది. అయితే ప్ర‌భుత్వ ఆలోచ‌న ప్ర‌కారం ఉద్యోగుల ఆందోళ‌న ఫెయిల్ కాక‌పోగా, సూప‌ర్ హిట్ కావ‌డం సీఎం జ‌గ‌న్‌కు తీవ్ర కోపం తెప్పించింది. ప్ర‌భుత్వానికి పోలీసుల స‌హాయ నిరాక‌ర‌ణ వ‌ల్లే ఉద్యోగులు విజ‌య‌వంతంగా విజ‌య‌వాడ‌కు రాగ‌లిగార‌ని ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదించిన‌ట్టు తెలిసింది.

దీంతో చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం అనంత‌రం డీజీపీ స‌వాంగ్‌ను సీఎం జ‌గ‌న్ త‌న వ‌ద్ద‌కు పిలిపించుకున్నారు. ఉద్యోగుల నిర‌స‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డానికి కార‌ణాల‌ను ఆరా తీసిన‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా డీజీపీపై సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన‌ట్టు స‌మాచారం. 

ఉద్దేశ పూర్వ‌కంగానే పోలీసులు ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించి, ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేశార‌ని మండిప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఉద్యోగుల చ‌లో విజ‌య‌వంతానికి డీజీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది.