మోదీ, కేసీఆర్ మధ్య సడన్ గా వ్యవహారం బెడిసింది. ఎంతలా అంటే మోదీని తరిమి కొడతా, జైలులో వేస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు కేసీఆర్, థర్డ్ ఫ్రంట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీని ఎవరు తిట్టినా వారు కేసీఆర్ కి మిత్రులే అవుతారు, పోనీ మోదీతో తిట్టించుకున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్లు కూడా కేసీఆర్ సింపతీకి పాత్రులవుతారు.
ఇక మోదీని పొగిడిన వారెవరైనా సరే వారు కేసీఆర్ కి శత్రువులే. సరిగ్గా ఇక్కడే చినజీయర్ స్వామి చిక్కుల్లో పడ్డారు. మోదీని పొగిడి, కేసీఆర్ మనసు కష్టపెట్టారు.
అవన్నీ టర్మ్స్ బాగున్నప్పుడు..
ముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు చాన్నాళ్ల క్రితమే ప్రణాళిక సిద్ధమైంది. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు ఎవరెవరు రావాలి, ఏయే కార్యక్రమాలుంటాయనేది దాదాపుగా ఏడాది క్రితమే ఖరారైన షెడ్యూల్.
అయితే అప్పుడు మోదీ, కేసీఆర్ మధ్య టర్మ్స్ బాగున్నాయి. కానీ ఇప్పుడు వ్యవహారం తేడా కొట్టింది. దీంతో రామానుజ విగ్రహావిష్కరణకు మోదీ రావడం, అప్పుడే కేసీఆర్ కి ఆరోగ్యం బాగోలేకపోవడం.. చకచకా జరిగిపోయాయి. ఆ టైమ్ లో మోదీని శ్రీరామచంద్రుడంటూ చినజీయర్ స్వామి కీర్తించడం కేసీఆర్ కి బొత్తిగా నచ్చలేదు.
ముగింపు వేడుకల వేళ ముదిరిన వివాదం..
మోదీని చినజీయర్ స్వామి శ్రీరాముడితో పోల్చడం కేసీఆర్ కి నచ్చలేదా..? అందుకే కేసీఆర్ ముగింపు వేడుకల వేళ ముచ్చింతల్ కి మొహం చాటేశారా..? రాష్ట్రపతికి స్వాగతం చెప్పిన కేసీఆర్, సమతా విగ్రహం వరకు ఎందుకు రాలేదు..? కేసీఆర్ అలక వల్లే శాంతి హోమం ఈనెల 19కి వాయిదా పడిందా..? మోదీ, కేసీఆర్ ఇద్దరూ కావాలనుకుంటున్న చినజీయర్ స్వామి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారా..?
ఈ సీక్వెన్స్ చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఓవైపు మోదీని బండబూతులు తిడుతున్నారు కేసీఆర్, చినజీయర్ మాత్రం ఆయన వీరుడు, శూరుడు, రాముడు అంటున్నారు. దీంతో కేసీఆర్ కి కాలింది. చివరి రోజు కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీంతో ఆ కార్యక్రమం ఈమెల 19కి వాయిదా వేసి కేసీఆర్ ని బుజ్జగిస్తున్నారట.
శిలాఫలకంతో మరో రచ్చ..
అటు సమతా మూర్తి విగ్రహావిష్కరణ శిలా ఫలకంలో మోదీ పేరు ఉంది కానీ, కేసీఆర్ పేరు మిస్సయిందట. దీంతో కేసీఆర్ అలిగారని, తీరా ఇప్పుడు కేసీఆర్ పేరు అందులో జతచేసినా ఆయన మాత్రం ససేమిరా అంటున్నారని మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది.
చినజీయర్ స్వామితో పాటు, మై హోమ్ రామేశ్వరరావుపై కూడా సీఎం అలకబూనారని అంటున్నారు. దీంతో సోమవారం జరగాల్సిన శాంతి కల్యాణం అనూహ్యంగా నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. అప్పటికైనా కేసీఆర్ అలక తీరుతుందో లేదో చూడాలి.