ప్రత్యేక హోదాపై కనీసం చర్చకు కూడా ఆస్కారం లేకుండా చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబే దోషి అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు. ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్రహోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 9 అంశాలతో ఒక అజెండాను కేంద్ర హోంశాఖ తయారు చేసింది. ఈ మేరకు అజెండాను ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖ అధికారులు పంపారు.
ఇందులో ప్రత్యేక హోదా కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆనందం వెల్లువెత్తింది. ఈ లోపు కొందరికి కన్ను కుట్టింది. తమ పాలనలో చరమగీతం పాడిన ప్రత్యేక హోదాకు జీవం పోస్తే, తమకు రాజకీయంగా ప్రాణం పోతుందనే ఆందోళన వారిలో కలిగింది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పావులు కదిపారు. తూచ్ తూచ్ అంటూ కేంద్ర హోంశాఖ …అజెండానే మార్చేసింది. ప్రత్యేక హోదాను ఎత్తేసింది.
ప్రత్యేక హోదా అంశం చర్చకు రాకుండా కీలక పాత్ర పోషించిన నాయకుడిగా అందరి వేళ్లు చంద్రబాబు వైపే చూపాయి. ఇదే విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండి పడ్డారు. బీజేపీతో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కై ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగించారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే అన్నారు.
అజెండాలోని 9 అంశాలను మీరే పెట్టి మీరే తీసేశారని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే ఇలా చేశారన్నారు. ప్రత్యేక హోదా వద్దని అమ్ముడుపోయింది టీడీపీ నేతలే అని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుంది టీడీపీనే అని ఆయన గుర్తు చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలు లోపాయి కారిగా చంద్రబాబుతో చేరతాయన్నారు.
గడచిన మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. భభిష్యత్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకుంటాయనేందుకు… ప్రత్యేక హోదా అంశాన్ని ఊసే లేకుండా చేయడమే అని పెద్దిరెడ్డి చెప్పకనే చెప్పారు. జగన్ హయాంలో ప్రత్యేక ఇస్తే… టీడీపీకి పుట్టగతులుండవనే భయం చంద్రబాబులో భయం ఉంది. ఆ భయమే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేందుకు ఉసిగొల్పుతోందనే విమర్శలు లేకపోలేదు.