చంద్రబాబును రాజకీయ గజనీ అని ప్రత్యర్ధులు అంటారు. అయితే ఇందులో సగం నిజం మాత్రమే ఉంది. ఆయనకు కావాల్సిన విషయాలు చాలా బాగా గుర్తుంటాయి. అక్కరలేనివి, తనకు పనికిరావనుకున్నవి మాత్రమే ఆయన గజనీ మాదిరిగా మరచిపోతారు.
కానీ ఏపీ ప్రజాలు టీడీపీని మొత్తం కూసాలు కదిలించేలా 2019లో ఇచ్చిన తీర్పు ఇంకా పచ్చిగానే ఉంది. అది అందరికీ బాగా గుర్తు కూడా ఉంది. ఇక ఎన్నికలు జరిగి కొత్త సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయింది.
ఇంతలోనే అసెంబ్లీ రద్దు అంటున్నారు చంద్రబాబు. అమరావతిపైఅ ప్రజాభిప్రాయ సేకరణ అంటున్నారు. నిజానికి ప్రజల అభిప్రాయం ఇదీ అని చెప్పే కదా బాబుని మాజీ సీఎం చేశారు అని అంటున్నారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు.
చంద్రబాబు అమరావతి రాజధానిని భ్రమరావతిగా తేల్చేస్తూనే కదా ఆయన కుమారుడు లోకేష్ ని మంగళగిరిలో ఓడించింది అంటూ ఘాటు కామెంట్స్ చేసారు దాడి. బాబు రాజకీయానికి శాసనామండలి బలి అయిపోయింది అని దాడి ఆవేదన వ్యక్తం చేశారు.
లేని అధికారాలు అంటకట్టి శాసనమండలి సెలెక్ట్ కమిటీ చేత ప్రజాభిప్రాయం చేయిస్తానని బాబు అనడాన్ని దాడి తప్పుపట్టారు. ఆ అధికారం కౌన్సిల్ కి ఎక్కడా లేదని ఆయన అన్నారు. ఇది బాబు రాజకీయ కుతంత్రం తప్ప మరేమీ కాదని అన్నారు.
మండలి రద్దు కావడానికి ఏళ్ళూ వూళ్ళూ పడుతుందని టీడీపీ చెబుతున్న మాటలను కూడా ఆయన కొట్టేశారు. 2017లోనే మండలి అవసరమా, అనవసరమా అని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ పంపిందని, దేశంలో ఇపుడు ఆరు రాష్ట్రాల్లోనే మండళ్ళు ఉన్నాయని దాడి గుర్తుచేశారు.
అందువల్ల మండలి రద్దు చేయాలనుకుంటే కేంద్రానికి నెల రోజుల సమయం కూడా పట్టదని దాడి స్పష్టం చేశారు. చంద్రబాబు పెద్దల సభను ప్రతిపక్ష సభగా మార్చి ప్రభుత్వాన్ని సవాల్ చేయాలనుకోవడం, ప్రభుత్వ వ్యవస్థనే స్తంభింపచేయాలనుకోవడం వల్లనే మండలి రద్దు అయిందని కూడా దాడి అంటున్నారు.