జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ ఉభయ సభలూ సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇలా మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగానే కొనసాగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ పార్లమెంట్ మొదటి విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్స్ లో బడ్జెట్, బడ్జెట్ పై చర్చ ప్రధానంగా సాగే అవకాశం ఉంది.
ఇక రెండో విడత సమావేశాలు మార్చి రెండో తేదీన ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఏప్రిల్ మూడో తేదీ వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. మధ్యలో కొన్ని సెలవు దినాలు అయితే ఉంటాయి. స్థూలంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పార్లమెంట్ ఉభయ సభలూ చాలా పని దినాల్లో సమావేశం అవుతాయి.
ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో సీఏఏ అంశంపై చర్చ సాగుతుందని జాతీయ మీడియా వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక ఏపీకి సంబంధించి కూడా ఈ సారి లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు ఆసక్తిదాయకంగా మారాయి. అందుకు కారణం ఏమిటో చెప్పనక్కర్లేదు. ఏపీ మండలి రద్దు బిల్లు ఈ సారే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చకు వస్తుందా? రాజ్యసభలో ఆమోదం పొందుతుందా.. అనేవి ఆసక్తిదాయకమైన అంశాలు.