హమ్మయ్య ఓ పనైపోయింది. ఆస్కార్ వేదిక మీద ఓ తెలుగు పాట మారుమోగింది. ఆస్కార్ వేదిక మీదే కాదు, విదేశీ గడ్డ మీద కూడా మన పాట వినిపించింది. అస్సలు పాటలు లేని సినిమాలు తీసే, చూసే అలవాటు వున్న వారి చేత ఓ పాటకు గెంతులు వేసేలా చేసిన ఘనత ‘నాటు..నాటు’ పాటది. అందులో సందేహం లేదు.
అసలు నాటు ఏమిటంటే…వివరిస్తూ పాట రాసిన కవి చంద్రబోస్ ది. ఆస్కార్ ను పట్టుకువచ్చిన తొలి తెలుగు కవిగా చంద్రబోస్ చరిత్రకెక్కారు. తెలుగు పాటకు ఆస్కార్ తెచ్చిన తొలి తెలుగు సంగీత దర్శకుడిగా కీరవాణి గుర్తింపు పొందారు. ఇలాంటి పాటను రాయించుకుని, చేయించుకున్న రాజమౌళి కూడా తక్కువేం కాదు. అసలు ఈ మ్యూజిక్ జోష్ కు సరిపడా కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ ను మెచ్చుకుని తీరాల్సిందే.
దాదాపు గత ఒకటి రెండు నెలలుగా ఈ అవార్డ్ నేపథ్యంలో మన హీరోలు చేసిన అతి మాత్రం ఇంతా అంతా కాదు. ఆస్కార్ వచ్చింది కీరవాణికి..చంద్రబోస్ కు. గతంలో రెహమాన్ కు ఆస్కార్ వస్తే ఆ సినిమా హీరో ఎవరో కూడా మనకు తెలియదు. సౌండింగ్ చేసిన రసూల్ పూకొట్టి కి అవార్డు వస్తే ఆ సినిమా హీరో ఎవరో కూడా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు హీరోలు ఆస్కార్ తమదే అన్నంత హడావుడి చేసారు.
ఇద్దరు హీరోలూ చెరో పీఆర్ టీమ్ ను పెట్టుకుని, డజన్లు కొద్దీ డిజైనర్ డ్రెస్ లు కుట్టించుకుని చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. రామ్ చరణ్ అయితే అర్జంట్ గా ముంబాయి టీమ్ లను తీసుకుని మరీ హడావుడి చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. లోకల్ గా కూడా అర్జంట్ గా వున్న టీమ్ ను మార్చేసి కొత్త టీమ్ ను తీసుకున్నారు.
తీరా చేస్తే అవార్డ్ వేదిక మీదకు ఎవరు వెళ్లారు? అవార్డు సమయంలో ఎవరిని చూపించారు? కీరవాణి..చంద్రబోస్..ఎందుకంటే రాసింది ఒకరు ..దానికి ట్యూన్ చేసిది ఒకరు. అంతే తప్ప గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హడావుడి చేసినవారిని కానే కాదు. ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంటే మా హీరో అని కొట్టేసుకుంటున్నారు. అంత సత్తా వుంటే బెస్ట్ యాక్షన్ లేదా బెస్ట్ యాక్టర్ తెచ్చుకోవాలి. అప్పుడు ఎంత హడావుడి చేసినా నడుస్తుంది.
మామూలు హడావుడి జరగలేదు. పెయిడ్ ప్రమోషన్లు, ఇంటర్వూలు, విందులు వినోదాలు, ఒకటి కాదు. నిత్యం డజన్ల కొద్దీ ఫొటోలతొ వాట్సాప్ గ్రూపులు, ట్విట్టర్ నిండిపోయాయి. టీమ్ అందరికీ అవార్డు అనుకుంటే అక్కడ అందరికన్నా నిర్మాత డివివి దానయ్య పేరు కూడా వుండాలి కదా? మరి దానయ్య ను ఎందుకు విస్మరిస్తున్నారు. ఎందుకు మరిచిపోతున్నారు? ఎందుకు పక్కన పెడుతున్నారు? అంటే కొంపదీసి రాజమౌళి అంటే మనోడు..దానయ్య అంటే మనోడు కాదనా? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.
ఏమైతేనేం ఒక పనైపోయింది. విదేశాల్లో హడావుడి ముగిసింది. ఇక స్వదేశంలో హడావుడి మొదలవుతుంది. అది కొన్నాళ్లు వుంటుంది. మళ్లీ డిజైనర్ డ్రెస్ లు, ఫోటొలతో హీరోలు ఇద్దరూ రెడీ అయిపోతారు. ఎవరో రాసిన దానికి మరెవరో ట్యూన్ చేసిన దానికి అవార్డు వస్తే అందులో తమకూ భాగం వుందని చెప్పడం, చెప్పుకోవడం వేరు. తమదే అన్నంత హడావుడి చేయడం వేరు. మద్దతు ఇచ్చి, దన్నుగా నిలిచే ఫ్యాన్స్ వుంటే ఎవరికైనా ఏదైనా చెల్లుతుంది.