జనసేనాని పవన్‌కల్యాణ్ ఒక్కోసారి భలే మంచిగా వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర శ్రేయస్సు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేవలం చెప్పడమే కాదు, కీలక సమయాల్లో ఆయన వ్యవహరించే తీరు కూడా అందుకు తగ్గట్టుగానే వుంటోంది. తాజాగా పవన్‌కల్యాణ్ చేసిన ట్వీట్లు అభినందనలు అందుకుంటున్నాయి.
విశాఖ వేదికగా రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇది మంచి పరిణామం. రాష్ట్రానికి పరిశ్రమలు ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. ఇందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాల్సిన అవసరం వుంది. కనీసం అడ్డు తగలకుండా వుంటే, పరోక్షంగా ప్రభుత్వానికి సహకారం అందించినట్టే అవుతుంది. అయితే జగన్ పాలనలో పరిశ్రమలు వస్తే… తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని టీడీపీ ఆందోళన. అందుకే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావాలనేది వారి గాఢమైన ఆకాంక్ష.
ఏపీకి టీడీపీ తప్ప, మరొక పార్టీ అవసరం లేదనే సంకేతాల్ని పంపి, రాజకీయ లబ్ధి పొందడానికి ఆ పార్టీ తాపత్రయ పడుతోంది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న తరుణంలో టీడీపీ తన పైశాచికత్వాన్ని చాటుకుంది. “ముడుపులు, రాజకీయ కక్షలకు బలైన పరిశ్రమలు” పేరుతో టీడీపీ వాస్తవం పత్రం అంటూ ముద్రించింది. విశాఖకు పారిశ్రామిక దిగ్గజాలు వస్తున్న తరుణంలో ఇలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఈ తరుణంలో పవన్‌కల్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైన ట్వీట్స్ చేయడం విశేషం.
“ఇన్వెస్టర్ల సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియచేస్తోంది. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న”
“రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయం. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తోంది”
“దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను.ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌ను కోరుకునే ప్రతిపక్ష నాయకులెవరైనా ఇలాంటి చేయూత అందిస్తారు. రాజకీయాల కంటే రాష్ట్రం గొప్పదనే ఆశయంతో నడుచుకుంటారు. ఈ ట్వీట్లతో పవన్‌కల్యాణ్ స్థాయి పెరిగింది. అలాగే తన వాళ్లతో పారిశ్రామిక వేత్తలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఏపీ దృష్టిలో విలన్ అయ్యారు. చంద్రబాబు, పవన్‌ను పోల్చి చూస్తే… జనసేనాని అందనంత ఎత్తుకు ఎదిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.