ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు వస్తాయంటే పచ్చదళం జీర్ణించుకోలేకపోతోంది. వాళ్ల కడుపు మంట అంతాఇంతా కాదు. పరిశ్రమలు పెట్టేందుకు ఏపీ సేఫేనా…రావచ్చా? అంటూ కథనాలు వండివార్చేంత ఓర్వలేనితనం. పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు ఏపీలో కల్లోల పరిస్థితులున్నాయని సృష్టించేందుకు కూడా వెనుకాడడం లేదు. అదృష్టవశాత్తు పచ్చముఠా మాటల్ని నమ్మే పరిస్థితి లేదు.
విశాఖ వేదికగా రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జగన్ సర్కార్‌కు ఇక ఏడాది పాలనా సమయం మాత్రమే వుంది. ఇంత వరకూ జగన్ సర్కార్ అంటే సంక్షేమ పాలనకు ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. అభివృద్ధి, పరిశ్రమలు ఎక్కడ? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, అలాగే ఏపీకి ఆదాయాన్ని పెంచుకునేందుకు సీఎం జగన్ సంకల్పించారు.
ఇందులో భాగంగా చేపడుతున్నదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023. ఈ సమ్మిట్‌కు కార్పొరేట్ దిగ్గజాలు వస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 45కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నట్టు అధికారికంగా వెల్లడిస్తున్నారు. అలాగే ఇప్పటికే 18 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలున్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగే ఏ చిన్న ప్రయత్నాన్ని అయినా రాజకీయాలకు అతీతంగా స్వాగతించాల్సిన అవసరం వుంది. ఇంతకాలం ఏపీకి పరిశ్రమలు రాలేదని గగ్గోలు పెడుతున్న వాళ్లు ముఖ్యంగా విశాఖలో ఈ రెండు రోజుల సదస్సులపై ఆనందం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్డంకులు సృష్టించకుండా, అవాకులు చెవాకులు మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయిస్తే గౌరవం దక్కుతుంది.
పరిశ్రమల కోసం జగన్ సర్కార్ యజ్ఞం చేపట్టిన తరుణంలో రాక్షసుల్లా అడ్డంకులు సృష్టిస్తున్న వైనాన్ని గమనించొచ్చు. చంద్రబాబు అనుకూల పత్రికలో రాసిన కథనం చదివితే… పారిశ్రామిక యజ్ఞానికి విఘాతం కలిగించాలనే తాపత్రాయాన్ని పసిగొట్టొచ్చు. జగన్‌పై అక్కసుతో చివరికి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగాలని కోరుకోడానికి కూడా వెనుకాడనంత బరితెగింపును గుర్తించొచ్చు.
‘దుబాయ్‌కి చెందిన ‘లులు’ కంపెనీ విశాఖపట్నంలో గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు ఎందుకు వద్దనుకుంది? ఆ భూమి కోసం అధికార పార్టీ కీలక నేత బెదిరింపులతోనే బెంగళూరుకు వెళ్లిపోయిందా.?’ ఒక బ్యూరోక్రాట్‌కు ఒక ఇండస్ట్రీ అధినేత నుంచి ఎదురైన ప్రశ్న! గతంలో ఉత్తరాంధ్రలో పని చేసిన ఆ బ్యూరోక్రాట్….‘అలాంటి ప్రచారమైతే ఉంది. కానీ నాకు పూర్తిగా తెలియదు’ అని గతంలో ఉత్తరాంధ్రలో పని చేసిన బ్యూరోక్రాట్ సమాధానం చెప్పినట్టు తెలిసింది’….ఇలా సాగింది ఆ కథనం. ప్రచారం చేసేది వీళ్లే, మళ్లీ విన్నట్టు, కన్నట్టు తప్పుడు కథనాలు అల్లేది ఈ ఎల్లో మీడియానే. ఎవరికి తెలియదు వీరి భాగోతాలు? ఒకప్పుడైతే వీళ్లు రాసేవి నిజమే అనుకుని నమ్మే వెర్రి కాలం. కానీ ఇప్పుడు ప్రత్యర్థులపై వీళ్ల కథనాల వెనుక కథ ఏంటో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు.
ఇటీవల జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ చేసినట్టు రాసిన పత్రికకు ఆంధ్రప్రదేశ్‌పై విషం చిమ్మే కాంట్రాక్ట్‌ను చంద్రబాబు అప్పగించినట్టున్నారు. జగన్ ప్రభుత్వం ఏం చేసినా రంధ్రాన్వేషణ చేయడమే ఆ పత్రిక దురుద్దేశమని అందరికీ తెలిసిందే. పచ్చదళానికి రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ కావాలి. అధికారం కోసం ప్రత్యర్థులపై ఏ స్థాయిలోనైనా బురద చల్లడానికి వెనుకాడని తెంపరి తనం వారి సొంతం. ఇందులో భాగమే గ్లోబల్ సమ్మిట్‌పై అక్కసుతో విషం చిమ్మడాన్ని ఎల్లో పత్రికలో చూడొచ్చు.
గతంలో దేవతలు యజ్ఞం చేస్తుంటే, రాక్షసులు అవరోధాలు కల్పించిన వైనాన్ని… గ్లోబల్ సమ్మిట్‌పై టీడీపీ, దాని అనుబంధ మీడియా కడుపు మంట గుర్తు చేస్తోంది.