తిరుపతిలో అమరావతి సభ.. పవన్ భారీ ఊహలు

తిరుపతి అంటేనే పవన్ కి పూనకం వస్తుంది. గతంలో చిరంజీవి తిరుపతిలో గెలిచారని కావొచ్చు, తమ సామాజిక వర్గం జనాలు ఎక్కువగా ఉన్నారని కావొచ్చు. అందుకే ఆ మధ్య తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో…

తిరుపతి అంటేనే పవన్ కి పూనకం వస్తుంది. గతంలో చిరంజీవి తిరుపతిలో గెలిచారని కావొచ్చు, తమ సామాజిక వర్గం జనాలు ఎక్కువగా ఉన్నారని కావొచ్చు. అందుకే ఆ మధ్య తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఓ ట్రైల్ రన్ నడపాలని చూశారు.

ముందుగానే సర్వేలు చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు తిరుపతిలో అమరావతి రైతుల యాత్ర రూపంలో పవన్ కి మరో అవకాశం వచ్చింది. తిరుపతి సభకు వెళ్లి 'జై అమరావతి' అంటారా.. పవన్ రాకతో తిరుపతి సభకు మరింత క్రేజ్ వస్తుందా..? పవన్ అంచనాలేంటి..?

తిరుపతిపై పవన్ కి ఆశ..

పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి పోటీపడాలని భావించారు. కానీ తిరుపతి కంటే సేఫ్ అంటూ మరో రెండు నియోజకవర్గాల గురించి ఆయన ముందు ఊదరగొట్టి మరీ భీమవరం, గాజువాకలో పోటీ చేయించారు సన్నిహితులు. పవన్ క్రేజ్ సినిమాలకే పరిమితం అనే విషయం ఆ రెండు ఓటములతోనే బాగా రుజువైంది. అయితే పవన్ కి మాత్రం తిరుపతి ఆశ అలాగే మిగిలి ఉంది. 

అందుకే చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పార్టీ పటిష్టతపై ఆయన ఎక్కువగా దృష్టిపెట్టారు. తాజాగా అమరావతి సభ పేరుతో పవన్ కి మరో అవకాశం వచ్చింది. ఈనెల 17న అమరావతి రైతులు తిరుపతిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ ఆహ్వానం వెనక అంత కథ నడిచిందా..?

ఇటీవల తిరుపతిలో అమిత్ షా క్లాస్ తీసుకున్న తర్వాత అమరావతి రైతుల యాత్రకు బీజేపీ నేతలంతా సంఘీభావం ప్రకటించారు. ఇటు జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ వరద పరామర్శ యాత్రల పేరుతో వచ్చి జై అమరావతి అనేసి వెళ్లిపోయారు. రాగాపోగా పవన్ కల్యాణ్ ఒక్కరే ఇంకా అమరావతి యాత్రలోకి రాలేదు. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ గా ఆయన.. తిరుపతి బహిరంగ సభకు చీఫ్ గెస్ట్ గా రావాలనుకున్నారు.

దీనికి ముందస్తు ప్రిపరేషన్ ప్రకారం అమరావతి రైతులు వచ్చి ఉక్కు దీక్షలో పాల్గొన్న పవన్ ని కలసి తిరుపతి సభకు రావాలని అభ్యర్థించారు. ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందే. ఈ ఇన్విటేషన్ కూడా ఉక్కు దీక్షలో ఇచ్చారు కాబట్టి, దానికి ప్రయారిటీ పెరిగింది. ఇక పవన్ తిరుపతి వెళ్లడమే తరువాయి.

పవన్ కల్యాణ్ తిరుపతి సభకు వెళ్లడం అమరావతి రైతులకు ఉపయోగమో లేదో కానీ, పవన్ కి మాత్రం మైలేజీ ఇస్తుంది. అందుకే పవన్ తిరుపతి సభపై ఆసక్తి చూపిస్తున్నారు. అటునుంచి ఆహ్వానం వచ్చేలా చేసి, ఇటునుంచి తాను రెడీ అవుతున్నారు. తిరుపతి కేంద్రంగా మరింత రాజకీయ దుమారం రేపేందుకు సిద్ధమవుతున్నారు.

అక్కడక్కడ జిల్లాల్లో అమరావతి రైతుల యాత్రలను కొంతమంది అడ్డుకున్నా.. వారిపై సింపతీ రాలేదు. పెయిడ్ ఆర్టిస్ట్ లు, కోట్ల రూపాయల ఆస్తిపరులు అనే అపవాదు వారిపై ఉంది. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ నాలుగు జిల్లాల్లో యాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఎలాగైనా తిరుపతిలో హడావిడి సృష్టించాలని పథక రచన చేశారు, పవన్ ని ఆహ్వానించారు. 

అదను కోసం చూస్తున్న పవన్ కల్యాణ్ తిరుపతిలో రెచ్చిపోడానికి సిద్ధమయ్యారు. పనిలో పనిగా మరోసారి తిరుపతిలో తన సత్తా ఎంత ఉందనేదానిపై ఆయన ఓ అంచనాకి రాబోతున్నారు.