అఖండ రిలీజ్ రోజు జై బాలయ్య నినాదాలు మారుమోగాయి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద జై ఎన్టీఆర్ నినాదాలు మారుమోగాయి. కానీ ఒక్కటే తేడా.. జై ఎన్టీఆర్ తో పాటు, జై సీఎం, ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు కూడా వినిపించాయి.
అంటే బాలయ్యలో కంటే, ఎన్టీఆర్ లోనే నందమూరి అభిమానులు భావి నాయకుడిని చూసుకుంటున్నారనమాట. టీడీపీకి ఎన్టీఆరే దిక్కు అని డిసైడ్ అయిపోయారనమాట. ఇక ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన ఏకైక వ్యక్తి చంద్రబాబు ఒక్కరే.
అఖండ మూవీతో బాలయ్య మాస్ ఫాలోయింగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రుజువైంది. లాజిక్ లేని మేజిక్ కి అందరూ జై కొట్టారు. అదే సమయంలో జై బాలయ్య నినాదాలతో థియేటర్లు మారుమోగిపోయాయి. దీంతో సహజంగానే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. నందమూరి హీరో హిట్ కొట్టారంటూ సంబరపడ్డారు. వారం రోజుల్లోగానే ఆ సంబరం ఆవిరయ్యేలా జై ఎన్టీఆర్ నినాదాలు తెరపైకి వచ్చాయి.
ఒకరకంగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మెగాభిమానుల కంటే నందమూరి అభిమానులే ఎక్కువగా రచ్చ చేశారు. రాజకీయ కోణం కూడా ఇందులో ఉందనే విషయం బహిరంగ రహస్యం.
కుప్పంలో కావాలనే జై లవకుశ సినిమా ప్రదర్శించి మరీ సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు చేసిన అభిమానులు, ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ ని మరో వేదికగా చేసుకున్నారంతే. అయితే ఇక్కడే నందమూరి అభిమానుల ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
బాలయ్యకు సినిమాలు చాలు..
అఖండ సినిమా విడుదల సమయంలో కనీసం ఎమ్మెల్యే బాలయ్య అని కూడా ఎవరూ అనలేదు. 'జై బాలయ్య' అంతే. ఆయన పొలిటికల్ వ్యవహారాలను కూడా అభిమానులు పెద్దగా పట్టించుకోరు.
ఇప్పటికీ బాలకృష్ణ అంటే సినిమా హీరో మాత్రమే, హిందూపురం ఎమ్మెల్యే కాదు అనే భావన ఆయన అభిమానుల్లో ఉంది. అందుకే 2014లో చంద్రబాబు బాలయ్యకు మంత్రి పదవి లేకుండా చేసినా అభిమానులు లైట్ తీసుకున్నారు. ఆయనలో ఓ హీరోని మాత్రమే చూసుకున్నారంతే.
బాబులకే బాబు తారక్ బాబు..
ఎన్టీఆర్ విషయంలో అలా కాదు. తారక్ లో అభిమానులు పెద్దాయన అసలు సిసలు వారసుడిని చూసుకుంటున్నారు. మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టి, పార్టీకి పునర్వైభవం తీసుకురాగల ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆరే అని డిసైడ్ అయ్యారు అభిమానులు. అందుకే కుప్పంలో టీడీపీ జెండా గద్దెలపై ఎన్టీఆర్ స్వతంత్ర జెండా ఎగిరింది. చంద్రబాబు పర్యటనల్లో కూడా 'జై ఎన్టీఆర్' నినాదం మారుమోగింది.
తీరా ఇప్పుడు సినిమా థియేటర్ల వద్ద కూడా జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ అభిమానులు రచ్చ చేశారు. ఒకరకంగా ఇది చంద్రబాబుకి ఇబ్బందికర పరిణామమే. బాలయ్యని వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పించి డమ్మీగా మార్చేసినా, ఎన్టీఆర్ రూపంలో నారావారి కుటుంబానికి పెద్ద గండం పొంచి ఉంది. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.