చిరు వ్యాపారికి జీఎస్టీ బాదుడు.. రూ. 366కోట్ల జరిమానా

ఫుట్ పాత్ మీద బట్టలమ్ముకునే వ్యక్తికి సడన్ గా జీఎస్టీ ఆఫీస్ నుంచి నోటీసు వచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ జీఎస్టీ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నందుకు గాను 366 కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ…

ఫుట్ పాత్ మీద బట్టలమ్ముకునే వ్యక్తికి సడన్ గా జీఎస్టీ ఆఫీస్ నుంచి నోటీసు వచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ జీఎస్టీ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నందుకు గాను 366 కోట్ల రూపాయల జరిమానా కట్టాలంటూ అధికారులు షాకిచ్చారు. రోజుకి 500 రూపాయలు సంపాదించుకునే తాను అంత పెద్ద మోసం ఎలా చేయగలనంటూ లబోదిబోమంటున్నాడు ఆ చిరు వ్యాపారి. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ వీధుల్లో రోజూ బట్టలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు 40 ఏళ్ల ఇజాజ్ అహ్మద్. రోజుకి అతనికి వచ్చే ఆదాయం 500 రూపాయలు. మహా అయితే నెలకోసారి వెయ్యిరూపాయలు కళ్లజూస్తాడు. అలాంటి ఇజాజ్ జీఎస్టీ ఫ్రాడ్ చేశారంటే ఎవరూ నమ్మడంలేదు.

రెండేళ్ల క్రితం అతను అనుకోకుండా ఓపెన్ చేసిన జీఎస్టీ అకౌంట్ ఇప్పుడతనికి 366 కోట్ల రూపాయల నోటీసు వచ్చేలా చేసింది. పాతవస్తువులు సేకరించి అమ్మే దుకాణాన్ని మొదలు పెట్టిన ఇజాజ్ అహ్మద్ రెండేళ్ల క్రితం జీఎస్టీ లైసెన్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత నష్టాలు రావడంతో దాన్ని మూసేశాడు. స్క్రాప్ దుకాణాన్ని వేరేవాళ్లకు ఇచ్చేశాడు. అదే సమయంలో తనకు అకౌంట్ ఓపెన్ చేయించి ఇచ్చిన సీఏకు దాన్ని రద్దు చేయాలని చెప్పాడు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం ముజఫర్ నగర్ వీధుల్లో బట్టలు అమ్ముకుంటున్నాడు.

ఇజాజ్ అహ్మద్ జీఎస్టీ అకౌంట్ నుంచి భారీ మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు అధికారులు. ఆ జీఎస్టీ నెంబర్ నుంచి 300 కోట్ల రూపాయల బిల్లులు రెడీ అయ్యాయని అంటున్నారు. దానికి సంబంధించి ఇజాజ్ కి నోటీసులిచ్చామంటున్నారు. గతంలో కూడా చాలామంది తమ జీఎస్టీ నెంబర్ దుర్వినియోగం అయిందని ఫిర్యాదులు చేశారని, వాటిపై కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు జీఎస్టీ అధికారులు.

పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతే ఇజాజ్ అహ్మద్ అమాయకుడా కాదా అనేది తేలుతుందన్నారు. అయితే తమ పక్కనే రోజూ తిరుగుతూ బట్టలమ్ముకునే ఇజాజ్ అలాంటివాడు కాదంటున్నారు సహచర వ్యాపారులు. ఇజాజ్ కూడా తనకేపాపం తెలియదంటున్నాడు.