ఫైన‌ల్ గా.. కుప్పానికి చంద్ర‌బాబు!

తెలుగుదేశం పార్టీకి, ప్ర‌త్యేకించి ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిందో ఇది వ‌ర‌కే ర‌క‌ర‌కాల వైనాల‌తో రుజువు అయ్యింది. ఈ ఎన్నిక‌లో గ‌నుక టీడీపీ ఓడితే అది…

తెలుగుదేశం పార్టీకి, ప్ర‌త్యేకించి ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిందో ఇది వ‌ర‌కే ర‌క‌ర‌కాల వైనాల‌తో రుజువు అయ్యింది. ఈ ఎన్నిక‌లో గ‌నుక టీడీపీ ఓడితే అది చంద్ర‌బాబు నాయుడు పొలిటిక‌ల్ కెరీర్ కే పెద్ద దెబ్బ అయ్యేలా ఉంది.

ఈ నేప‌థ్యంలో కుప్పం మున్సిపాలిటీలో ప‌రువు నిల‌బెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ అన్నిర‌కాల అస్త్ర‌శ‌స్త్రాల‌నూ సంధించింది. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ కుప్పంలో వీధివీధి తిరిగి ప్రచారం చేసుకున్నారు.

ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ చేసి కూడా ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌నే ప్ర‌య‌త్నం లోకేష్ మాట‌ల‌తో జ‌రిగింది. ఇక ఓటుకు నోటు విష‌యంలో టీడీపీ వెనుకాడ‌టం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గెలుపు కోసం అన్ని అస్త్రాల‌నూ టీడీపీ వెనుకాడ‌కుండా సంధించింద‌నే మాట వినిపిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో పోలింగ్ రోజున చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా కుప్పంలో అడుగు పెడుతున్నారు.

వాస్త‌వానికి ప్ర‌చార స‌మ‌యంలోనే చంద్ర‌బాబు నాయుడు కుప్పానికి వెళ్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. 24 వార్డులున్న ఆ చిన్న మున్సిపాలిటీ ప్ర‌చారానికి… దేశానికి ప్ర‌ధాన‌మంత్రుల‌ను డిసైడ్ చేసిన చంద్ర‌బాబు వెళితే అంత‌క‌న్నా ఆయ‌న‌కు చిన్న‌త‌నం ఉండ‌దు. అందుకే ఆగిన‌ట్టుగా ఉన్నారు. అక్క‌డ‌కూ రోజుకు మూడు సార్లు ఆన్ లైన్ స‌మీక్ష ద్వారా చంద్ర‌బాబు నాయుడు కుప్పం లో ప‌రిస్థితుల‌ను స‌మీక్షించిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

అలాగే కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ మీద టీడీపీ ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుంద‌ట‌. అందులో కుప్పం బాధ్య‌త‌ల్లో ఉన్న‌వారు స‌భ్యులు. ఆ గ్రూప్ కు చంద్ర‌బాబే స్వ‌యంగా అడ్మిన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని భోగ‌ట్టా. ఇంత జేసి.. ఇక పోలింగ్ రోజున చంద్ర‌బాబు నాయుడు కుప్పంలో అడుగుపెట్టి పోలింగ్ ను ప‌ర్య‌వేక్షించే ప‌ని పెట్టుకున్నారు. త‌ద్వారా ఈ మున్సిపాలిటీ ఎన్నిక టీడీపీ అధినేత‌ను ఎంత టెన్ష‌న్ పెడుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

ద‌శాబ్దాలుగా కుప్పం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించి, ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో గెలుపు కోసం చంద్ర‌బాబు ఇంత అపసోపాలు ప‌డ‌ట‌మే ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ లో అత్యంత ప‌త‌నావ‌స్థ కావొచ్చు.