బ‌లిజ‌లకు కొత్త నాయ‌కుడు…పోలోమ‌ని అత‌ని వైపు!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో రాజ‌కీయం మారుతోంది. ఫ్యాక్ష‌న్‌కు అడ్డాగా పిలుచుకునే ఆళ్ల‌గ‌డ్డ‌లో కొత్త నాయ‌కుడు తెర‌పైకి వ‌చ్చాడు. ఇంత వ‌ర‌కూ ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా, గంగుల కుటుంబాలు ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్నాయి. వారిలో ఎవ‌రో ఒకరు గెలుపొందుతూ…

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో రాజ‌కీయం మారుతోంది. ఫ్యాక్ష‌న్‌కు అడ్డాగా పిలుచుకునే ఆళ్ల‌గ‌డ్డ‌లో కొత్త నాయ‌కుడు తెర‌పైకి వ‌చ్చాడు. ఇంత వ‌ర‌కూ ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా, గంగుల కుటుంబాలు ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్నాయి. వారిలో ఎవ‌రో ఒకరు గెలుపొందుతూ వ‌స్తున్నారు. రానున్న రోజుల్లో ఆళ్ల‌గ‌డ్డ‌లో కొత్త నాయ‌క‌త్వం వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అది కూడా జ‌న‌సేన‌కు బ‌ల‌మైన నాయ‌కుడు దొరికే అవ‌కాశాలున్నాయి.

హైకోర్టు న్యాయ‌వాది గోగిశెట్టి న‌ర‌సింహారావు ఆళ్ల‌గ‌డ్డ‌లో స‌త్తా చాటేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. పుష్క‌లంగా డ‌బ్బుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని సిరివెళ్ల మండ‌లం వీరారెడ్డిపాళెం ఈయ‌న స్వ‌గ్రామం. అయితే వృత్తిరీత్యా లాయ‌ర్ కావ‌డంతో విజ‌య‌వాడ‌లో ఉంటున్నారు.

బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈయ‌న ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న కుల‌స్తుల‌తో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. సుమారు 3 వేల మంది హాజ‌ర‌య్యార‌ని స‌మాచారం. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లిజ‌ల ఓట్లు సుమారు 27 వేలు వున్నాయి. త‌మ సామాజిక వ‌ర్గం నుంచి ఓ నాయ‌కుడు రావాల‌ని వారు ఎప్ప‌టి నుంచో ఆకాంక్షిస్తున్నారు. న‌రసింహారావు రూపంలో వారికి ఒక నాయ‌కుడొచ్చారు. ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌కవ‌ర్గంలోని బ‌లిజ‌ల సంక్షేమం కోసం ప్ర‌తి మండ‌లానికి రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.12 కోట్లు ఖ‌ర్చు చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించడం విశేషం. ఈ నెల 27న తన రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ప్ర‌క‌టిస్తాన‌ని ఆయ‌న చెప్పాడంతో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వర్గంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌న‌సేన నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లు పెడ‌తార‌ని ఎక్కువ మంది భావ‌న‌. లేదంటే టీడీపీలో చేరే అవ‌కాశాలున్నాయి. రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లు ఎక్కువ‌గా టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు.

ఇత‌ని రాక‌తో టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ‌కు భారీ న‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ బ‌లిజ కుల‌స్తుడే. అయితే న‌ర‌సింహారావు రాక‌తో ఇంత కాలం అఖిల‌ప్రియ, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్ వెంట ఉన్న ఆ కులం యువ‌త అంతా అత‌ని వెంట వెళ్లింది. దీంతో రాజ‌కీయంగా అఖిల‌ప్రియ‌లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. అస‌లే స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో ఆమె బాధ‌ప‌డుతున్నారు. అవి చాల‌వ‌న్న‌ట్టు న‌ర‌సింహారావు ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాల్లో ఎంట‌ర‌వుతూ, ఆమె ఓటు బ్యాంక్‌కు భారీగా గండికొట్ట‌నున్నారు. 

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ‌కు టీడీపీ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి ఏ మాత్రం లేక‌పోవ‌డం, మ‌రోవైపు క్లీన్ ఇమేజ్‌, ఎంతైనా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకునే నాయ‌కుడు రావ‌డంతో న‌ర‌సింహారావు వైపు రాజ‌కీయ పార్టీలు మొగ్గు చూపే అవ‌కాశాలు లేక‌పోలేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.