కేశినేని వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న భుజాలు త‌డుముకున్నాడే!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీ నేత‌ల‌పై ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చివ‌రికి చంద్ర‌బాబును లెక్క లేకుండా మాట్లాడుతున్నా కేశినేనిని ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో టీడీపీ…

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని సొంత పార్టీ నేత‌ల‌పై ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చివ‌రికి చంద్ర‌బాబును లెక్క లేకుండా మాట్లాడుతున్నా కేశినేనిని ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో టీడీపీ వుండిపోతోంది. ఈ నేప‌థ్యంలో కేశినేని ఘాటు విమ‌ర్శ‌ల‌కు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న భుజాలు త‌డుముకున్నారు. ప్ర‌ధానంగా కేశినేని నాని న‌లుగురిని టార్గెట్ చేస్తున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

త‌న త‌మ్ముడు కేశినేని చిన్ని, బొండా ఉమా, నాగుల్ మీరా, బుద్దా వెంక‌న్న‌ల‌పై ప‌రోక్షంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు, లోకేశ్ స‌హా అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ స‌త్య‌మే. అయితే కేశినేని నానిని కెలికితే విజ‌య‌వాడ‌లో పార్టీకి న‌ష్ట‌మ‌ని అంద‌రూ తేలు కుట్టిన వారి మ‌ల్లే మౌనాన్ని ఆశ్ర‌యించారు. ఇవాళ ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని బుద్దా వెంక‌న్న ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్పందించారు. కేశినేని నాని ఎవ‌రి గురించి మాట్లాడుతున్నారో ఆయ‌నే చెప్పాల‌ని బుద్దా డిమాండ్ చేశారు. తాను మిస్ట‌ర్ క్లీన్ అని బుద్దా త‌న‌కు తాను స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను అన్నార‌ని అనుకోవ‌డం లేద‌ని బుద్దా వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డం ద్వారా కేశినేని ఎవ‌రిని ఉద్దేశించి ఘాటు విమ‌ర్శ‌లు చేశారో అర్థం చేసుకోవ‌చ్చనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కృష్ణా జిల్లాలో ఎంతో మంది టీడీపీ నాయ‌కులుండ‌గా, త‌న‌ను అన‌లేద‌ని బుద్దా ప్ర‌త్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వ‌చ్చింద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. కేశినేని విమ‌ర్శ‌ల తీవ్ర‌త తెలిసిన వారెవ‌రైనా… ఖ‌చ్చితంగా ఆ న‌లుగురి గురించే ఎంపీ ఘాటు విమ‌ర్శ‌లు చేశార‌ని చెబుతారు. ప‌నిలో ప‌నిగా తాను చిన్న భూక‌బ్జాకు కూడా పాల్ప‌డ‌లేద‌ని బుద్దా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన దుస్థితిని కేశినేని క‌ల్పించార‌నేది వాస్త‌వం.